‘నక్కా’వారి అవినీతి జిత్తులు

Vemuru MLA Nakka Anandbabu  Illegal Activities Is Highly Corrupted - Sakshi

సాక్షి, గుంటూరు : అయనో అవినీతి మాంత్రికుడు.. మంత్రి పదవి రాకముందే అక్రమాలకు తెరతీసిన తాంత్రికుడు.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హాంఫట్‌ అంటూ కాజేశాడు. రాక రాక వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దండుకున్నాడు. వేమూరు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లపై మారీచుడిలా వాలాడు. ప్రజలకు ఉచితం పేరుతో ఇసుకను ఆయాచితంగా దోచుకున్నాడు.

లారీలు, ట్రాక్టర్లతో యథేచ్ఛగా తరలిస్తూ అక్రమాల దందా కొనసాగించాడు. మంత్రి పదవి వచ్చాక మరింత రెచ్చిపోయాడు. తన అనుచరగణంతో జిల్లా వ్యాప్తంగా దందాకు తెరతీశాడు. గుంటూరులో బెక్కర్‌ కాంపౌండ్‌ స్థలాన్ని ఆక్రమించేశాడు. కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు దక్కించుకున్నాడు. మంత్రి ఆధ్వర్యంలో తవ్విన గుంతల్లో పడి చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా.. ఆ కుటుంబాల ఉసురుపోసుకున్నాడు మంత్రి నక్కా ఆనందబాబు.  

ఇసుక అమ్మకాల్లో రూ. 200 కోట్లకుపైనే...

ఇసుక తవ్వకాలపై మంత్రి ఆనందబాబును తిప్పలకట్టలో  మహిళల నిలదీత

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వేమూరు నియోజకర్గంలోని కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లో ఇసుక అమ్మకాల ద్వారా మంత్రి నక్కా ఆనందబాబు రూ. 200 కోట్లకుపైనే గడించారని నియోజకవర్గంలో విమర్శలున్నాయి. నదీ గర్భశోకం మిగిల్చి ఇసుకను పిండి రూ. కోట్లకు కోట్లు దండుకోవడంలో సిద్ధహస్తుడిగా మంత్రి పేరు గడించారు.

ఇసుక మాఫియాకు మంత్రే మూలంగా మారి తన బినామీలతో తవ్వకాలు జరిపించి అక్రమార్జనకు నాంది పలికారు. 2011 నుంచి 2013 మధ్య కాలంలో కొల్లూరు మండలం జువ్వలపాలెంలో ప్రభుత్వం పాట నిర్వహించిన క్వారీని తన బినామీలకు దక్కేలా చక్రం తిప్పి ఇసుక దందాకు తెర తీశారు. జువ్వలపాలెంలో అనుమతులు ఉంటే గాజుల్లంకలో సైతం రెండేళ్లపాటు రేయింబవళ్లు అనధికారిక క్వారీని నడిపించారు.

భట్టిప్రోలు మండలం కాకుల డొంక, ఓలేరు ప్రాంతాల్లో మంత్రి కనుసన్నల్లో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగాయి. అప్పట్లో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇసుక పాటలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించడంతో 2013–2014 మధ్య కాలంలో తన బినామీలను రంగంలోకి దింపి కొత్త తరహా ఇసుక వ్యాపారానికి బీజం వేశారు. ఏడాది క్రితం గుంటూరులో కీలక నామినేటెడ్‌ పోస్టు దక్కించుకున్న టీడీపీ నాయకుడు కుమారుడు సైతం ఈపూరులో క్వారీ నిర్వహించి రూ. కోట్లు గడించాడు. 

బెక్కర్‌ కాంపౌండ్‌లో స్థలం బొక్కేశారు 

గుంటూరు నగరంలోని మహిమ గార్డెన్స్‌

బెక్కర్‌ కాంపౌండ్‌లో స్థలాన్ని సైతం మంత్రి నక్కా ఆనందబాబు కారు చౌకగా బొక్కేశారు. ఈ స్థలాన్ని కాజేయడం కోసం బెక్కర్‌ కాంపౌండ్‌ను లీజుకు తీసుకున్న బాబూప్రకాశ్‌తో... టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఒప్పందం చేసుకున్నారు. ఆ స్థలం తమకు కేటాయిస్తేనే లీజుకు తీసుకున్న స్థలాన్ని చర్చికి అప్పగిస్తానంటూ షరతులతో కూడిన ప్రతిపాదనను చర్చి ముందు పెట్టారు.

ఈ షరతులకు తలొగ్గిన చర్చి పెద్దలు 2015 జూలై 22న భీమవరం బేతనీపేట లూథరన్‌ చర్చిలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో.. షరతులను అంగీకరించి, టీడీపీ ఎమ్మెల్యేలు నక్కా ఆనంద్‌బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు స్థలం కేటాయించడానికి అంగీకారం తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు తన పేరిట చర్చి ఇవ్వాలనుకున్న 4400 గజాల స్థలాన్ని తన సోదరుడు నక్కా ప్రసాద్‌బాబు పేరిట ఇవ్వాలని కోరారు.

ప్రసాద్‌బాబు పేరిట 4400 గజాల స్థలాన్ని.. గజం రూ. 12 వేల చొప్పున చర్చి విక్రయించింది. మొత్తం స్థలం విలువ రూ.5.28 కోట్లకుగాను నక్కా ప్రసాద్‌ సంఘానికి అందించిన సేవలకుగాను రూ.3.28 లక్షలు మినహాయించారు. ఈ లెక్కన కేవలం రూ. 2 కోట్లకు 4400 గజాల స్థలాన్ని తన బినామీ అయిన సోదరుడి పేరు మీద ఆనందబాబు కొట్టేశారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్‌లో ఈ స్థలం విలువ గజం రూ.4 లక్షలు ఉంటుందని అంచనా. ఈ ప్రకారం స్థలం విలువ సుమారు రూ.200 కోట్లు ఉంటుంది. ఈ చర్చి భూమిని కొట్టేయడం వెనక నక్కా చక్రం తిప్పారని క్రైస్తవ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

కారుచౌకగా ఏఈఎల్సీ ఆస్తుల లీజు..

కుగ్లర్‌ ఆసుపత్రి 

కుగ్లర్‌ హాస్పిటల్‌ 6.95 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా నక్కా ఆనందబాబు లీజు కొట్టేశాడు. కుగ్లర్‌ ఆసుపత్రి స్థలం లీజు ధర మార్కెట్‌లో రూ. 50 లక్షలకుపైగా పలుకుతుంది. అలాంటి స్థలాన్ని ఆనందబాబు సతీమణి చింతబత్తుని సత్యరత్నకుమారి పేరు మీద సంవత్సరానికి రూ.10 వేలు చొప్పున 2006–2036 వరకూ లీజుకు తీసుకున్నారు.

కారు చౌకగా కొట్టేసిన నక్కా ఆనందబాబు లీజు డబ్బును చర్చి అకౌంట్‌లో కట్టిన దాఖలాలే లేవని ఆరోపణలున్నాయి. ఇదే తరహాలో గుంట గ్రౌండ్‌ స్థలాన్ని సైతం ఆనందబాబు తన బినామీ అయిన సోదరుడు ప్రసాద్‌ పేరున లీజుకు తీసుకుంటున్నారు. ఆరేడేళ్లుగా గ్రౌండ్‌ను లీజుకు తీసుకుంటున్న ఆయన గత సంవత్సరం వరకూ మార్చి, ఏప్రిల్, మే నెలలకుగాను రూ. 5 లక్షలు లీజుగా చెల్లించేవారు.

గత ఏడాది సంఘ సభ్యులు వ్యతిరేకించడంతో లీజు ధరను రూ. 20 లక్షలకు పెంచినట్టు సమాచారం. కారు చౌకగా లీజుకు కొట్టేస్తున్న గుంట గ్రౌండ్‌ స్థలాన్ని ఎగ్జిబిషన్లు, ప్రైవేట్‌ కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆనందబాబు ఏడాదికి రూ.10 కోట్ల వరకూ గడిస్తున్నారని విమర్శలున్నాయి. గుంటూరు నగరంలోని గ్రాండ్‌ నాగార్జున హోటల్‌ స్థలాన్ని 1981–2030 వరకు మంత్రి నక్కా ఆనంద్‌బాబు, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మధ్య లీజ్‌ కొనసాగుతుంది. దీనికి సంత్సరానికి లీజ్‌ రూ.33,333 చెల్లిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top