24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా?

Uttam Kumar Reddy Fires On KCR Over RTC Strike - Sakshi

కేసీఆర్‌పై ఉత్తమ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీపై అసత్యాలతో కూడిన అఫిడవిట్‌ను తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిందని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి విమర్శించారు. కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన సునీల్ శర్మ వెంటనే విధులనుంచి డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం కాంగ్రెస్, ఆర్టీసీ యూనియన్లు చేయడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా పోరాడుతోందని, ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసినట్లు ఆధారాలు ఉంటే జైలుకు పంపాలని ఆయన సవాలు విసిరారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టినట్టు ఉత్తమ్‌ గుర్తుచేశారు. కార్మికులకు సెప్టెంబర్ నెల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈనెల 19న నిర్వహించే సడక్ బంద్ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. 24 మంది చనిపోయినా సీఎం ఇగో తగ్గలేదా? అని నిలదీశారు. కేసీఆర్ అమానవీయ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు ఉత్తమ్‌ కుమార్‌తో భేటీ అయి సమ్మెపై చర్చించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులే సమ్మెకు కారణమని వారు అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి ఎండీ లేకపోవడంతో ఉన్నతాధికారుల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో సమ్మెకు దిగినట్లు ఉత్తమ్‌కు వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top