ఎన్నికల్లో పోటీ చేయను : ఉమా భారతి

Uma Bharti Announce She Wont Contest Lok Sabha Polls - Sakshi

లక్నో : ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేంద్ర మంత్రి ఉమాభారతి పునరుద్ఘాటించారు. ఈ మేరకు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షాకు శనివారం ఆమె లేఖ రాశారు. ఈ సందర్భంగా... ‘ ముందు చెప్పినట్లుగానే నేను 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అయితే అధిష్టానం కోరిన సమయంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గంగా నదీ కాలుష్య ప్రక్షాళనలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే అమిత్‌షాకు లేఖ రాశాను. అయితే రాజకీయాల్లో తప్పకుండా కొనసాగుతాను’ అని ఉమాభారతి ట్వీట్‌ చేశారు. ఇక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ కూడా వచ్చే ఎన్నికల్లో తాను నిలబడటం లేదని, ఆరోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తోందని ప్రకటించిన విషయం తెలిసిందే.  

కాగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం ఉమాభారతి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ నుంచి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖా మంత్రిగా ఉన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం తమ లక్ష్యమని చెప్పే ఆమె కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో  బాబ్రీ మసీదు కూల్చివేతలో ఉమాభారతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2017లో సీబీఐ కోర్టు ఆమెకు నోటీసులు జారీ చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top