టీటీడీపీ పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ | Sakshi
Sakshi News home page

టీటీడీపీ పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ

Published Sun, Oct 22 2017 8:10 PM

Telangana TDP Politburo Emergency Meeting - Sakshi

హైదరాబాద్‌: టీడీపీలో రేవంత్‌రెడ్డి రేపిన కలకలం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. రేవంత్‌ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్‌ నాయకులను కలిసిన రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ఆయన షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని మోత్కుపల్లి నర్సింహులు, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. షోకాజ్‌ నోటీసు అవసరం లేదని, తనపై వచ్చిన ఆరోపణలను రేవంత్‌ ఖండిచారని ఇతర నాయకులు వాదించినట్టు సమాచారం. అయితే రేవంత్‌ ఖండనలో స్పష్టత లేదని, షోకాజ్ నోటీసు ఇస్తేనే కేడర్‌కు సానుకూల సంకేతాలు వెళతాయని మోత్కుపల్లి పేర్కొన్నట్టు తెలుస్తోంది.

పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను రేవంత్‌రెడ్డి స్పష్టంగా ఖండించలేదని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. పొలిట్‌బ్యూరో భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీ మారుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ నాయకులు టీడీపీలోనే కొనసాగుతామని ప్రకటన చేయాలని సూచించారు. పార్టీ మారే విషయంపై రేవంత్‌రెడ్డి నుంచి నిర్దిష్టమైన ప్రకటన రాలేదన్నారు. తమ పార్టీ నాయకులను రేవంత్‌రెడ్డి కలిశారని కాంగ్రెస్‌ నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్న వారి పేర్లు ఫైనల్‌ చేశామని, ఈ జాబితాను చంద్రబాబుకు పంపిస్తామని తెలిపారు.

Advertisement
Advertisement