పంచాయతీ’ పోరుపై టీజేఎస్‌ గురి | Sakshi
Sakshi News home page

పంచాయతీ’ పోరుపై టీజేఎస్‌ గురి

Published Fri, Dec 14 2018 5:17 AM

telangana jana samithi focus on panchayat elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి త్వరగా కోలుకునేందుకు తెలంగాణ జన సమితి ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా పరాభవమే ఎదురవ్వడంతో జవసత్వాలు కూడగట్టుకుని పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచేందుకు యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగాలని టీజేఎస్‌ భావిస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక అంశాలు, అభ్యర్థులే ఫలితాలను నిర్ణయించే అవకాశముండటంతో క్షేత్రస్థాయిలో మంచి పేరున్న వారిని పోటీలో నిలపాలనుకుంటోంది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, కూటమితో కలసివెళ్లే ఆలోచన తమకు లేదని టీజేఎస్‌ నేతలు చెబుతున్నారు. కచ్చితంగా తమ సొంత బలంతోనే పంచాయతీ ఎన్నికల్లో పోరాడతామని, గ్రామాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని వారంటున్నారు. అయితే, దీనిపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మూడ్రోజుల్లో కీలక భేటీ
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకునేందుకుగానూ టీజేఎస్‌ త్వరలోనే సమావేశం కానుంది. రెండు లేదా మూడ్రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా ఆహ్వానించనున్నారు. ఇందులో పార్టీ భవిష్యత్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలతో టీజేఎస్‌ ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరగబోయే సమావేశంలో ఏం నిర్ణయిస్తారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

అసెంబ్లీ ఎన్నికలే ప్రామాణికం కాదు: కోదండరాం
రెండు, మూడ్రోజుల్లో టీజేఎస్‌ రాష్ట్ర కమిటీ సమావేశం ఉంటుందని, అందులో చర్చించి పంచాయతీ ఎన్నికలపై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిని అంగీకరిస్తున్నామని, అన్ని అంశాలను సమీక్షించుకుని పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికలు అన్నింటికీ ప్రామాణికం కాదన్నారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని వస్తున్న వాదనలను కొట్టిపారేశారు. ప్రజా సంక్షేమం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే తాము పార్టీ పెట్టినట్లు చెప్పారు. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యాచరణపై భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement