టీడీపీ హైడ్రామా..

TDP Leaders Went To Relief Camp Due To YSRCP Attacks In Palnadu - Sakshi

సాక్షి, గుంటూరు : పల్నాడులో టీడీపీ శ్రేణులపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లోకి వెళ్లాలంటేనే టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులు ఉంటే రక్షణ కల్పిస్తామని పోలీసులు పిలుపునిస్తే మాత్రం ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. దీనిని బట్టి పునరావాసం పేరుతో టీడీపీ హైడ్రామాకు తెర తీసిందనే విషయం స్పష్టంగా తేలింది. గుంటూరులో టీడీపీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఏదో జరుగుతోందని రాద్ధాంతం చేస్తోంది. పునరావాస కేంద్రంలో ఉన్న వారికి రక్షణ కల్పించి స్వగ్రామాల్లోకి తీసుకెళ్లి వదిపెడతామని పోలీసులు ముందుకు వచ్చినా టీడీపీ నాయకులు మాత్రం ‘పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు రావాలి.. హామీ ఇవ్వాలి’ అంటూ పునరావాస కేంద్రంలో ఉన్న వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లనివ్వకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం రాత్రి గుంటూరు ఆర్డీవో భాస్కర్‌రెడ్డి, రూరల్‌ జిల్లా ఏఎస్పీ చక్రవర్తి పునరావాసానికి వెళ్లి రక్షణ కల్పిస్తామని, మీరంతా గ్రామాలకు వెళ్లాలని సూచించినప్పుడు పునరావాస కేంద్రంలో ఉన్న వారు తమ గ్రామాలకు వెళ్లడానికి సుముఖత చూపారు. అయితే టీడీపీ నాయకులు మాత్రం తమ అధినేతతో మాట్లాడి మంగళవారం నిర్ణయం తీసుకుంటామని దాటవేశారు. మంగళవారం ఉదయం పునరావాస కేంద్రంలో ఉన్న వారిని స్వగ్రామాలకు తీసుకెళ్లడానికి పోలీసులు అక్కడికి వెళ్లగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు వచ్చి వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇస్తేనే ఒప్పుకుంటామని కొత్త డ్రామాకు తెరతీశారు.

పల్నాడు ప్రాంతంలో కొన్ని గ్రామాల్లో కుటుంబ సమస్యలు, వ్యక్తిగత గొడవల వల్ల కొందరు గ్రామాలు వదిలి వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. టీడీపీ మాత్రం వైఎస్సార్‌ సీపీ దాడుల వల్లే వారు గ్రామాలు వదిలి వెళ్లారని ఆరోపిస్తోంది. సోమవారం కుటుంబ కలహాల వల్ల పిన్నెల్లి, ఆత్మకూరు గ్రామాలు వదిలి వెళ్లిన కుటుంబాలను వారి బంధువులతో సయోధ్య కుదిర్చి పోలీసులు స్వగ్రామాలకు చేర్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top