వలసల జోరు.. టీడీపీ బేజారు

TDP Leaders Joining in YSR Congress Party Vijayawada - Sakshi

వైఎస్సార్‌ సీపీలోకి ప్రారంభమైన వలసలు

ఇప్పటికే నందిగామ,  కైకలూరు, అవనిగడ్డ నుంచి

వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకున్న పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు  

బేషరతుగా పార్టీలో చేరుతున్న వైనం

ఎన్నికల తేదీ నాటికి జాబితా మరింత పెరిగే అవకాశం

జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన ఆ పార్టీ.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక చతికిలపడుతోంది. ఇప్పటి వరకు ఆ పార్టీకి అండగా నిలబడిన ద్వితీయశ్రేణి నాయకత్వం.. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం చేస్తున్న నిష్పాక్షిక పాలనకు జై కొడుతోంది. ఫలితంగా వలసలు ఊపందుకున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో నాయకులు వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తేదీ నాటికి ఈ జాబితా మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష టీడీపీ అచేతనావస్థకు చేరడంతో ఆ పార్టీ నుంచి వైఎస్సార్‌ సీపీ వైపునకు వచ్చేందుకు పలు నియోజకవర్గాల్లోని నాయకులు ఆసక్తి చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వలసలు ఊపందుకున్నాయి. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే కొంతమంది నేతలు వైఎస్సార్‌ సీపీ కండువాను కప్పుకోగా.. ఎన్నికల నాటికి మరికొంతమంది పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ముందు ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీని వీడటం వల్ల గ్రామ, మండల స్థాయిలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ మరింత బలహీన పడే అవకాశాలున్నాయి. 

ఎన్నికలకు ముందే..
గుడివాడ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్, టీడీపీ నేత జోగా సూర్యప్రకాశరావు, నందివాడ మండలం జిల్లా సెక్రటరీ తమ్మినేని రూమేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది, గుడివాడ రూరల్‌ మండల యూత్‌ అధ్యక్షుడు బాతీ ఆధ్వర్యంలో 200 మంది రాష్ట్ర మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. మైలవరం నియోజకవర్గం రెడ్డి గూడెంలో టీడీపీ నేత రామినేని వెంకటేశ్వరరావు తన అనుచరులు 50 మందితో కలిసి వైఎస్సార్‌ సీపీలో చేరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 40వ డివిజన్‌ అధ్యక్షుడు ఎస్‌ఈ అతీక్‌ తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌ సీపీ కండువా కప్పుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర బీసీ సంఘం నేత మోర్ల ప్రసాద్‌ తన అనుచరులతోనూ, నందిగామ మండలం ఏటిపట్టు, రుద్రవరం గ్రామాలకు చెందిన పలువరు టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుల ఆధ్వర్యంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఇంకా తిరువూరు, కైకలూరు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు  వైఎస్సార్‌ సీపీ వైపు అడుగులు వేశారు. 

బేషరతుగానే..
వైఎస్సార్‌ సీపీలోకి బేషరతుగానే చేరేందుకు టీడీపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ సీపీలో సీట్ల కోసం ఆశావహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు టీడీపీ నుంచి తీసుకున్న వారు పోటీ పడితే ఇబ్బందులు ఎదురవుతాయని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పట్ల ఆకర్షితులవ్వడమే కాకుండా, గ్రామాలను అభివృద్ధి చేస్తారని నమ్మి పార్టీలు మారుతున్నారు. వైఎస్సార్‌ సీపీలో పనిచేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు లభించక జిల్లా నాయకత్వం నానా ఇబ్బందులు పడుతోంది. ఈ స్థాయిలో క్యాడర్‌ పార్టీని వీడితే టీడీపీ అభ్యర్థులకు గెలుపు కష్టమేనని పార్టీలోని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

పట్టించుకోని నియోజకవర్గ నేతలు..
గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జిల్లా, రాష్ట్ర నాయకత్వం కూడా కార్యకర్తల విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కార్యకర్తలు పార్టీ నేతల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top