అభివృద్ధి కోసమే అప్పులు

Talasani srinivas yadav commented over congress - Sakshi

కాంగ్రెస్‌ది బస్సుయాత్ర కాదు.. విహారయాత్ర: తలసాని

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వం అప్పులు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. కాగ్‌ తన నివేదికలో కేవలం ప్రభుత్వ విధానపరమైన లోపాలను ఎత్తిచూపిందని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను కాగ్‌ ప్రస్తావించిన విషయం కాంగ్రెస్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాగ్‌ నివేదికపై కాంగ్రెస్‌ నేతలు వాస్తవాలు గ్రహించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సుయాత్ర విహారయాత్రను తలపిస్తుందని ఎద్దేశా చేశారు. పదేళ్ల పాలనలో ప్రజల అభివృద్ధికోసం కాంగ్రెస్‌ ఏం చేసిందో చెప్పాలని అన్నారు. ఇప్పుడు బస్సుయాత్ర పేరుతో మరోసారి ప్రజలను మోసగించేందుకు తప్పుడు హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందని, ఇది వాస్తవం కాదని నిరూపించగలరా? అని సవాల్‌ చేశారు.

సీఎం కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించడానికి అసలు మీకేం అర్హత ఉందని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతల చేష్టల కారణంగానే అసెంబ్లీలో సస్పెండ్‌ అయ్యారని, దానిని కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, వద్దనే అధికారం ఎవరికీ లేదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం పార్టీ ప్రకటనపై తలసాని తేల్చిచెప్పారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top