పోతిరెడ్డిపాడుపై తలో వైఖరి

Srinivas Goud Fires On The Congress And The BJP Parties - Sakshi

కాంగ్రెస్, బీజేపీల తీరుపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు అంశంలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికో వైఖరి అవలంబిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. రెండు ప్రధాన పార్టీలు ఈ అంశంపై ప్రధాన మంత్రిని కలిసి లేఖలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి గురువారం టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డి పాడు అంశంపై కాంగ్రెస్‌ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. పోతిరెడ్డిపాడు అంశంపై మాట్లాడుతున్న విపక్ష నేతలు గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నేతలు రాయలసీమకు నీటి తరలింపుపై అప్పట్లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

కుమ్మక్కయితే తెలంగాణ వచ్చేదా?
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ నేతలు పదవీ త్యాగం చేస్తే కాంగ్రెస్‌ నేతలు దొంగ రాజీనామాలు చేశారని, ఏపీ నేతలతో తాము కుమ్మక్కయి ఉంటే తెలంగాణ వచ్చేదా అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రశ్నించారు. పదవుల కోసం కుమ్మక్కయ్యే అలవాటు, కాంగ్రెస్‌ ఇతర విపక్షాలకు ఉందన్నారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలను చేతనైతే కాంగ్రెస్‌ నేతలు తిరిగి ఇప్పించాలని డిమాండు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రకటనలు చేసి. నయా పైసా ఇవ్వలేదన్నారు.

కేసీఆర్‌ను విమర్శిస్తే ప్రజల్లో గుర్తింపు వస్తుందనే ఆలోచన మానుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలకు సత్తా ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు చెప్పిన తర్వాతే పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో ఇచ్చామని ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనలు రాజకీయమైనవిగా శ్రీనివాస్‌గౌడ్‌ కొట్టిపారేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలూ పనిచేస్తున్నారని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top