మోదీ విధానాల వల్లే వివాదం

Sonia Gandhi Fires On Narendra Modi Policies - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు విధానాల వల్లే సరిహద్దుల్లో చైనాతో వివాదం తలెత్తిందని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయ మండలి(సీడబ్ల్యూసీ)నుద్దేశించి మంగళవారం ఆమె మాట్లాడారు. మే 5వ తేదీనే పాంగాంగ్‌ త్సో, గల్వాన్‌ లోయలోకి చైనా బలగాలు ప్రవేశించినట్లు తెలిసినా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోలేకపోయిందన్నారు. ఫలితంగానే చైనా బలగాలతో ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారని తెలిపారు. ప్రభుత్వం పరిణతితో కూడిన దౌత్య విధానాలను అమలు చేయాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రమే ప్రజలపై ఏమాత్రం కనికరం చూపకుండా 17 రోజులుగా పెట్రో ధరలను పెంచుతోందని మండిపడ్డారు. కోవిడ్‌–19 మహమ్మారితో ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కోవడంలోనూ మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని ప్రకటించడం ద్వారా ప్రధాని మోదీ చైనా వాదనను బలపరిచి, సైన్యాన్ని మోసం చేశారని రాహుల్‌ ఆరోపించారు. చైనా సైన్యంతో ఘర్షణల సందర్భంగా వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబుకు, ఇతర  సైనికులకు నివాళుల ర్పించడంతో ఈ సమావేశం ప్రారంభమైంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top