వాటే మీటర్స్‌ యార్‌!

Satirical Story on Current Meters - Sakshi

అప్పట్లో ప్రతి ఇంటికి ఉంటేగింటేకరెంటు మీటర్‌ అనేదొక్కటే ఉండేది.అది కూడా ముక్కీ మూలిగీ నడిచేది.  పొరుగింటి వాళ్ల కంటే ఒకవేళ మన ఇంటి కరెంటు మీటరు గబగబా తిరుగుతుందనుకోండి. అలా తిరగడంలో అది అతిచురుగ్గా ఉందనుకోండి. అప్పుడు దాని దూకుడు చూసి మనం ఏడ్చి చచ్చేవాళ్లం. దీనికిదేం పోయే కాలం వచ్చిందో.. అలా వేగంగా తిరిగి చస్తోందని ఆడిపోసుకునేవాళ్లం. కానీ ఆ స్వర్ణయుగం కాస్తా ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయింది. 

ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడంతా కాలమంతా టెక్నాలజీదే. మీరొక మాడ్రన్‌ వాచీలాంటిది పెట్టుకున్నారనుకోండి. అదెన్నో విషయాలు చెబుతుంటుంది. ఇవ్వాళ మీరెన్ని క్యాలరీలు తిన్నారు? తిన్నదరిగి చావాలంటే.. నడిస్తే ఎన్ని అడుగులు వేయాలి? ఒకవేళ గెంతితే ఎన్ని గెంతులు? పరుగెత్తితే ఎన్ని అంగలు?ఇలా నడకోమీటరూ, పరుగోమీటరూ, గెంతోమీటరు.. అన్నీ మీ వాచీలోనే ఉంటాయి. అన్నట్టు.. అది మీ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటోందో కూడా చెబుతుంది. రాత్రి మీకెంత నిద్ర పట్టిందీ.. ఒకవేళ ఆ నిద్రలో ఏమైనా కొరత ఏర్పడితే ఇవ్వాళ ఎన్ని గంటలు నిద్రపోవాలి లాంటి విషయాలన్నీ చెప్పేసి, వాటిని అక్షరాలా అమలు జరిపే మెకానికల్‌ డివైజ్‌ల కాలం వచ్చేసింది. పైగా ఇప్పుడు ఆరోగ్యస్పృహ విపరీతంగా పెరిగిపోవడంతో చేతికి వేసుకునే ఆ మోడ్రన్‌ బ్యాండ్‌ లాంటి గడియారాలకు తెగ గిరాకీ పెరిగిపోయింది. అందరూ తలో వాచీ పెట్టేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. 

మా రాంబాబుగాడు ఈ ట్రెండ్‌ను జాగ్రత్తగా గమనించడం నేను గమనించాను. ‘‘అయినా నీకింత మెకానికాలిటీ నచ్చదు కదరా. మరి ఎందుకీ గాడ్జెట్లను ఇంతగా పరిశీలిస్తున్నావ్‌?’’ ఉండబట్టలేక అడిగా.  
‘‘ఈ తరహాలోనే మనం గనక కొన్ని కొత్త కొత్త గాడ్జెట్లు కనిపెట్టామనుకోరా. అప్పుడు వాటికి తెగ గిరాకీ ఉంటుంది. మనం కనిపెట్టిన వాటిని ఒక్క పార్టీ కొనేసినా చాలు.. మనం కోటీశ్వరులమైపోవడం గ్యారెంటీ’’ అన్నాడు వాడు. 

‘‘వీటిల్లోంచి కొత్తగా ఏం కనిపెడతావ్‌రా నువ్వు?’’  
‘‘సపోజ్‌... ఫర్‌సపోజ్‌.. అచ్చం సెల్‌ఫోన్‌లాగే ఉండేలా మనం ‘అభిప్రాయోమీటర్‌’ అనేది కనిపెడదాం. అప్పుడు దాన్ని ఆపరేట్‌ చేయగానే ఎదుటివాడు ఏ పార్టీని అభిమానిస్తున్నాడు, వచ్చే ఎన్నికల్లో వాడు ఎవరిని సమర్థిస్తాడనే వాడి అభిప్రాయాలు మనకు తెలిసిపోతాయన్నమాట’’ చెప్పాడు రాంబాబు గాడు.  
‘‘ఒరేయ్‌ నీ బుర్ర సామాన్యం కాదురా’’ అంటూ కితాబిచ్చేలోపే మళ్లీ చెలరేగిపోయాడు వాడు. 

‘‘అప్పుడే పొగడకు. ఇదేగాక మళ్లీ ఇంకో డివైజ్‌ కూడా డెవలప్‌ చేస్తాం. దానిపేరే చేంజోమీటర్‌. ఇది వాడగానే ఎదుటాడి అభిప్రాయం టక్కున మారిపోతుంది. వాడు కాస్తా ఇలా మన వైపునకు వచ్చేస్తాడు. మనకే ఓటేసేస్తాడు. ఇక చూడ్రా. సింపుల్‌గా ఇలాంటి రెండు పరికరాలను తయారు చేస్తే చాలు. ఇక్కడ మన రాష్ట్రాల్లోనూ, మన దేశంలోని పార్టీలే కాదు.. అమెరికాలోని రిపబ్లికన్లూ, డెమోక్రాట్లు మొదలుకుని ప్రపంచంలోని అందరూ మన గాడ్జెట్లే కొనుక్కుంటార్రా. అప్పుడు మనకు డబ్బులే డబ్బులు’’ అన్నాడు వాడు. 

మొదట.. వాడు చెప్పిందేదో బాగానే ఉన్నట్టు అనిపించిందిగానీ, ఆలోచించగా ఆలోచించగా ఇక్కడేదో తిరకాసున్నట్టు నాకు అనిపించింది.  
‘‘అవున్రా.. అంతా బాగానే ఉందిగానీ ఇక్కడో సమస్య ఉంది. ఈ మీటర్లనీ ఏదో ఒక్క పార్టీ దగ్గరే ఉంటే వీటితో ప్రయోజనం గానీ.. మన పార్టీ దగ్గరా ఇవే ఉండి, మళ్లీ ఎదుటాడిదగ్గరా ఇవే ఉంటే.. అప్పుడందరూ వాటిని ఎదుటాడిమీద యధేచ్ఛగా ప్రయోగిస్తూ ఉంటే ప్రయోజనమేముంటుందిరా. మళ్లీ అంతా నార్మల్‌గానే నలిఫై అయిపోతుంది కదా?!.. అంటే ఒకదాన్నొకటి రద్దు చేసేసుకుంటాయి కదా’’  
‘‘ఛీ నువ్వో అపశకున పక్షివి. ఆలోచనల్లో కూడా అనుక్షణం అడ్డుపడటమే. కనీసం కాన్సెప్టులను కూడా డెవలప్‌ కానివ్వవు. కొనేవాడు కొంటాడు... లేకపోతే లేదు. ఈ లాజిక్‌లన్నీ నీకెందుకోయ్‌ ’’ అంటూ నన్నాడిపోసుకున్నాడు వాడు.  –యాసీన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top