నాటి దేవతా వస్త్రాల్లాంటివే ఇవన్నీ..

Satirical Story On Andhra Pradesh Politics - Sakshi

ఎప్పటిలాగే శ్మశానం వైపునకు నడుస్తున్నవిక్రమార్కుడికి బేతాళుడు మళ్లీ ఓ కథ చెప్పడం మొదలు పెట్టాడు. అదేమిటంటే...మనం ఏదో అవన్నీ కల్పిత గాధలనుకుంటాం గానీ... ఎంత కల్పనలోనైనా కాస్తో కూస్తో నిజం ఉంటుంది. ఇది అప్పుడెప్పుడో మనం చిన్నప్పుడు చెప్పుకున్న దేవతా వస్త్రాల కథ. ఓ రాజు పూర్తిగా నగ్నంగా ఉండి... తాను దేవతావస్త్రాలు ధరించానని చెప్పుకుంటూ ఊరేగుతూ ఉండేవాడట. ఆ నగ్న స్వరూపాన్ని కన్నులారా గాంచిన వాళ్లు కూడా ‘‘అబ్బ... చీనీ చీనాంబరాల దుస్తుల జరీ ఎంత బాగుంది. ఆహా... దాని కుచ్చుల కుచ్చుల అంచు ఎంత అద్భుతంగా ఉందీ’’ అంటూ ప్రశంసిస్తూ తరిస్తూ ఉండేవారట. 

అదే కథ మళ్లీ ఇంతకాలానికి ఇలా పునరావృతమవుతుందనుకోలేదు. అదేదో కథ కదా... అప్పటి అమాయకులే ఇప్పటికీ ఉన్నారా... ఉంటారా... అని ఒక్కోసారి మనకనిపిస్తుంటుంది గానీ, ముందే చెప్పుకున్నట్టు ఎంత కథలోనైనా వాస్తవం ఉంటుంది కదా. 

అనగనగా ఓ రాజు. నభూతో నభవిష్యతి అనేలా రాజధాని నిర్మిస్తానన్నాడు. ప్లాన్లు గీశాడు. నమూనాలు తీశాడు. వాటినే చూపిస్తూ... ఆహా ఓహో అనమన్నాడు. దేవతల రాజధాని పేరేమిటి? అమరావతి. తన రాజధాని పేరు కూడా అదే కాబట్టి... దేవతా వస్త్రాల్లాగే సదరు రాజధాని కూడా దేవతాంశ ఉన్నవారికే కనిపిస్తుందంటూ రాజపత్రాలు విపరీతంగా ప్రచారం చేశాయి. అది కనిపించలేదంటే వాడు కచ్చితంగా పాపాత్ముడే అవుతాడంటూ తీర్మానించేశాయి. 

ప్రజలు కామోసనుకున్నారు. ఎందుకొచ్చిన గొడవలే అనుకున్నారు. ‘‘ఆహాహ... ఎంత బాగా కనిపిస్తుందేమండీ మన రాజధాని! ఆ ఉద్యానవనాలూ, ఆ సరస్సులూ’’ అని ఒకడంటే... ‘‘ఇక్కడ చూడండి... ఈ పచ్చిక బయళ్లు సాక్షాత్తూ పచ్చటి పట్టు తివాచీలు కదండీ’’ అంటూ మరొకడు ప్రస్తుతించాడు. మనమందరమూ ఆ యొక్క దేవతాంశ ఉన్నవాళ్లం సుమండీ అనుకుంటూ ఒకరి జబ్బలు మరొకరు చరచుకున్నారు. 

తర్వాతి వంతు దేవతాకర్మాగారంలో తయారైన కారుది. దాని పేరు ‘కియా’ అన్నారు. దేవతా కారంటూ ఒక దాన్ని రోడ్ల మీద నడిపారు. కానీ చిత్రమేమిటంటే... ఎంత ఏబ్రాసీ వాడైనా కొత్తకారు కొంటే దాని రంగూ, హంగూ, తళతళా, మిలమిలా లోకానికి చూపాలనుకుంటాడు. అదేమిటో గానీ సదరు వాహనానికి అన్ని వైపులా నల్ల పరదాలు కట్టారు. అదేమిటంటే... పాపాత్ముల కన్ను పడి దిష్టి తగులుతుందేమో లాంటి కథలు చెప్పారు. అప్పటికీ పాపం... అన్నెం పున్నెం ఎరగని పిల్లాడిలాంటి వాస్తవవాదులు కొందరు చెవులుకొరుక్కున్నారు. అక్కడ తయారైన కారు కాదని కనిపెట్టేశారు. కానీ మనం పాపాత్ములమని ఎందుకనిపించుకోవాలంటూ గమ్మునుండిపోయారు. 

ఇక ఇప్పుడు తాజాగా ఓట్ల వంతు వచ్చింది. రాజును ఎన్నుకునేందుకు ప్రజలక్కడ ఓట్లు వేస్తారు. కానీ చిత్రమేమిటంటే... పుణ్యాత్ముల ఓట్లు మాత్రమే జాబితాలో ఉంటాయనీ, పాపాత్ముల ఓట్లు కనిపించవంటూ రాజు మళ్లీ బుకాయించడం మొదలు పెట్టాడు.  దీనికి విరుగుడెలా అని ప్రజలు ఆలోచించారు. వాళ్లకో ఐడియా తట్టింది.

... అంటూ ఇంతవరకు కథ చెప్పి ఆ ఐడియా ఏమిటో తెలిసి కూడా చెప్పకపోతే నీ ఓటు కూడ గల్లంతవుతుందన్నాడు బేతాళుడు. అప్పుడు విక్రమార్కుడు చెప్పిన ఆన్సరిది.ప్రజలు ఓట్లేశారు. రాజును గద్దె దించేశారు. రాజు లబోదిబో అన్నాడు. అప్పుడా ప్రజలు రాజుతో... ‘‘హే రాజన్‌. పద వీచ్యుతుడినయ్యావని నువ్వెందుకనుకుంటున్నావ్‌. నీకు పడ్డ ఓట్లన్నీ దేవతాఓట్లు. నీకు కనిపించడం లేదంటే బహుశా నువ్వు పుణ్యాత్ముడివి కావేమో అని మాకనిపిస్తోంది’’ అంటూ తగిన శాస్తి చేశారంటూ జవాబు చెప్పాడు. అది సరైన సమాధానం కావడంతో, విక్రమార్కుడికి మౌనభంగం కావడంతో బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు.– యాసిన్, ప్యామిలీ డెస్క్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top