మహబూబ్‌నగర్‌లో పోటీ చేద్దాం | revanth reddy once again fire on cm kcr | Sakshi
Sakshi News home page

Revanth reddy once again fire on cm kcr

Nov 23 2018 12:44 AM | Updated on Mar 18 2019 9:02 PM

revanth reddy once again fire on cm kcr - Sakshi

మేడ్చల్‌: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇద్దరం పోటీచేద్దామని, ఎవరు ఓడినా రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమేనా అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న మంత్రి కేటీఆర్‌ ఇప్పుడు చౌరస్తాల వద్ద ప్రజల్ని ఓట్లు అడుక్కుంటున్నాడని విమర్శించారు. టీఆర్‌ఎస్‌లో కారు డ్రైవర్‌లాంటి కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరించే స్థితిలో కాంగ్రెస్‌ లేదన్నారు. 

విద్వేషాలు రెచ్చగొడుతున్నారు
కేసీఆర్‌ తన మాయమాటలతో మరోసారి తెలుగు ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రేవంత్‌ విమర్శించారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తోన్న కేసీఆర్‌.. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లను సెటిలర్లకు ఇచ్చిన సంగతిని గానీ, గతంలో తిరుమల, విజయవాడకు వెళ్ళి కోట్ల రూపాయల ఆభరణాలను దేవుడి పేరిట మొక్కుల రూపంలో సమర్పిం చిన విషయాన్నిగానీ మరువకూడదన్నారు. ఆంధ్ర కంపెనీలకు కాంట్రాక్టులిస్తోన్న కేసీఆర్‌ కాంగ్రెస్‌– టీడీపీ పొత్తుపై ఎందుకు ఉలిక్కి పడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతే ఫాంహౌస్‌కే పరిమితమవుతానని కేసీఆర్, అమెరికా వెళ్లిపోతానని కేటీఆర్‌ చెబుతున్నారని, ఓడిపోతే ప్రతిపక్షం లో ప్రధాన పాత్ర పోషించాల్సిన నాయకులు ఇలా మాట్లాడటం రాష్ట్రంపై వారికున్న బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్‌ వేల కోట్ల అవినీతిని బయటపెడతామన్నారు. కేటీఆర్‌ విదేశాలకు వెళ్లిపోకుండా ముందుగానే ఆయన పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇప్పుడు ఓట్లెలా అడుగుతున్నారు?
ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వకపోతే, ఏడాదికి లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు కట్టకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్‌ వీటిని నెరవేర్చకుండానే ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతున్నారని రేవంత్‌ ప్రశ్నించారు. చింతమడకలోని కేసీఆర్‌ సొంత ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చారా అని ప్రశ్నించారు. మేడ్చల్‌లో సోనియాసభ నిర్వహిస్తున్నారని స్పష్టం కావడంతో కేసీఆర్, కేటీఆర్‌ పిచ్చి పట్టినట్లుగా తిరుగుతున్నారని, దీంతోనే ప్రజాకూట మి విజయం ఖాయం అయిందన్నారు. సమావేశం లో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్‌ఆర్, టీజేఎస్‌ నాయకుడు హరివర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement