‘నన్ను చంపేందుకు కుట్ర ’

Revanth Reddy Sentailna Comments On KCR - Sakshi

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు

పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే సీఎం కుటిల పన్నాగాలు

నర్సంపేట సభలో దాడికి విఫలయత్నం..  త్రుటిలో తప్పించుకున్నా

హైకోర్టు ఆదేశించినా    భద్రత పెంచలేదు

సాక్షి, వికారాబాద్‌ : రాజకీయంగా ఎదుర్కొనే సత్తాలేక భౌతికంగా తనను అడ్డుతొలగించుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కొడంగల్‌ అభ్యర్థి ఎనుముల రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ పరిపాలనా వైఫల్యాలు, నిర్ణయాల్లో లోపాలు, టెండర్లలో అవినీతి, అక్రమాలు, అక్రమ భూ కేటాయింపులు, కుటుంబ పాలన, రాచరిక పోకడలు, పాలనలో నిర్ణయాలను ప్రశ్నిస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తున్నందుకే తనను అడ్డుతొలగించుకోవాలని సీఎం కుటిల పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని తన నివాసంలో రేవంత్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ అంశాలపై గతంలో శాసనసభలో చర్చల సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ ‘నువ్వు ఇలాగే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేస్తే ఆపరేషన్‌ బ్లూస్టార్‌ ద్వారా అడ్డుతొలగిస్తాం’అని సీఎం చెప్పిన సందర్భాన్ని రేవంత్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ ప్రభాకర్‌గుప్తా వంటి పోలీసు అధికారులను, మాజీ నక్సలైట్లను తనపై దాడులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే గురువారం నర్సంపేటలో తాను పాల్గొన్న సభలో పోలీసులు లాఠీచార్జి చేసి అక్కడ తనపై దాడి జరిగేలా విఫలయత్నం చేశారన్నారు. అయితే దీనిపై తనకు కొందరు మిత్రులు చేసిన సూచనలతో సమయం కంటే ముందుగానే అక్కడి నుంచి నిష్క్రమించి ఆ దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నానన్నారు. 

హైకోర్టు చెప్పినా భద్రత పెంచరా..? 
కేసీఆర్‌ నుంచి తనకు ముప్పు ఉందని కేంద్ర హోంశాఖకు, ప్రధానికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా.. కేంద్ర బలగాలతో భద్రత పెంచాలని హైకోర్టు (సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది) ఆదేశించినా ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తన హోదా పెరిగితే భద్రత పెంచాలి కానీ అందుకు విరుద్ధంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్ర పోలీసు గన్‌మెన్‌ల ద్వారా కూడా కేసీఆర్‌ సమాచారం తెప్పించుకొని తనను అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు 4+4 కేంద్ర బలగాలతో భద్రత పెంచాలని ఆదేశించినా ఎన్నికల కమిషన్‌ అమలు చేయడంలేదని, అందువల్ల కోర్టు ధిక్కరణ కింద మరోసారి హైకోర్టును ఆశ్రయించానని వివరించారు. ఎన్నికల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 3 వేల మంది కేంద్ర బలగాలు, సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని వినియోగిస్తున్నా హైకోర్టు సూచించిన 8 మందిని కూడా తన భద్రతకు కేటాయించలేదన్నారు. ఎన్నికల కమిషనర్‌ రజత్‌ కుమార్‌కు అధికారం ఉన్నా పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో బిహార్‌ లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ల మధ్య అంతర్గత సమన్వయం ఉందన్నారు. 

రాష్ట్రవ్యాప్త ప్రచారం తాత్కాలికంగా వాయిదా... 
తనను అంతమొందించడానికి భౌతిక దాడులు జరిగే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నానని రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఖమ్మంలో జరిగే ప్రచార సభల్లో పాల్గొనాల్సి ఉన్నా.. తాను వెళ్లలేదని, 2–3 రోజులు ప్రచారానికి వెళ్లకుండా తన క్షేమం కోరే కొడంగల్‌ ప్రజల మధ్యే ఉంటానన్నారు. రాష్ట్రమంతా ప్రచారం చేస్తే కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయమని ఆయనకు ఇంటెలిజెన్స్‌ అధికారులు చెప్పడంతోనే తనపై దాడులకు సీఎం ప్రణాళికాబద్ధమైన కుట్రలు చేస్తున్నారన్నారు. ఇందుకు నక్సలైట్ల ఏరివేతలో నిపుణులైన పోలీసు అధికారులు, మాజీ నక్సలైట్లను రంగంలోకి దించారని ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top