ప్రతిపక్షంలోనే కాదు. పాలనలోనూ ముద్ర | Revanth Reddy comments on KCR and KTR | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంలోనే కాదు. పాలనలోనూ ముద్ర

Nov 25 2018 1:15 AM | Updated on Mar 18 2019 9:02 PM

Revanth Reddy comments on KCR and KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీపై విరుచుకుపడటం, ఆరోపణలు చేయడమే తన పనికాదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజాసేవ చేసేందుకు అవసరమైన మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నా నని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి ఎవరైనా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా తాను రూపొందించు కున్న కార్యాచరణను అమలు చేసే విధంగా పాటుపడతానన్నారు. తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన ‘మీట్‌ ది ప్రెస్‌’కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘రాజకీయంగా నాకు అనుభవం లేదని చాలామంది అంటున్నారు. 2006లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా గెలిచాను.

ఇప్పటికే రెండుసార్లు కొండగల్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజాసమస్యలపై నా పోరాటపటిమను గుర్తించే కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని కట్టబెట్టింది’అని అన్నారు. ఒక్కగానొక్క కుమార్తె వివాహ నిశ్చితార్థానికి జైలు నుంచి రాకుండా టీఆర్‌ఎస్‌ పెద్దలు ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను దించి తనకు బెయిల్‌ రాకుండా అడ్డుకున్నటువంటి సంఘటనలు సహజంగానే ఆవేదన కలిగిస్తాయని, ఆ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకు పడటం సహజమని అన్నారు. రాజకీయంగా ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బందిపడనన్నారు. నిశ్చితార్థానికి రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారంటే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ ఎంత దుర్మా ర్గంగా వ్యవహరించారో అర్థం చేసుకోవాల న్నారు. నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్‌ ప్రభుత్వం అమాయక గిరిజనులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తూటాలతో హతమార్చిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు వెళ్లక తప్పదన్నారు. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఐజేయూ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, ఐజేయూ మాజీ సెక్రటరీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూ జే ప్రధాన కా ర్యదర్శి విరాహత్‌ అలీ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే...
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసిన రేవంత్‌ వచ్చే ప్రభుత్వానికి తన తరఫున ఓ మేనిఫెస్టో విడుదల చేశారు. వాటిలోని ముఖ్యాంశాలు...
- తెలంగాణలో సుమారు 18 లక్షల మంది నిరుద్యోగులున్నారని అంచనా. ప్రభుత్వంలో రెండు లక్షల వరకు ఖాళీలున్నాయనేది లెక్క. ఇందులో ప్రభు త్వ ఉద్యోగంతోపాటు ప్రైవేట్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించడం. స్వయం ఉపాధి కల్పించి యువశక్తిని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. ప్రతి ఏడాది డిసెంబర్‌ 31 నాటికి ప్రభుత్వ ఖాళీ పోస్టుల క్యాలెండర్‌ను విడుదల చేయడం. ఆ తర్వాత నెలరోజుల్లో నోటిఫికేషన్లు విడుదల చేసి జూన్‌ 2 కల్లా నియా మకపత్రాలు జారీ చేసేలా ప్రణాళిక తయారు చేయడం. రూరల్‌ ఎకానమీ పెంచి ఉద్యోగ, ఉపాధి కల్పనకు వివిధ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టిం చడం. నైపుణ్యం అవసరంలేని ఉద్యోగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇచ్చేలా టీఎస్‌పీఎస్సీ తరహాలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఉపాధి కోసం స్టేట్‌ లెవల్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ తీసుకురావడం. ‘ప్రతి చేతికి పని–ప్రతి వ్యక్తికి ఉపాధి’తో ముందుకు వెళ్లడం. 
సగటు కుటుంబంలోని పిల్లల విద్యకు అవుతున్న ఖర్చును 30 నుంచి 10 శాతా నికి తగ్గించేలా ప్రణాళిక రూపొందిం చడం. ఉస్మానియాతోపాటు తెలంగాణలో ని అన్ని యూనివర్సిటీలను బలోపేతం చేయడం. రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌కు 30 నుంచి 40 శాతం నిధులు కేటాయించేలా చర్యలు చేపట్టడం. కేంబ్రిడ్జి, స్టాన్‌çఫర్డ్‌ యూనివర్సిటీ తరహా ప్రమాణాలతో ఉస్మానియాను అప్‌గ్రేడ్‌ చేసేందుకు చర్యలు చేపట్టడం. పోటీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడం, బోర్డులు, సంస్థల్లో రాజకీయ జోక్యం లేకుండా పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేయడం.
ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిస్థాయిలో పున రుద్ధరించడం. అర్హులందరికీ లక్షల రూపా యల ఖర్చయ్యే వైద్యాన్ని అందుబాటు లోకి తీసుకురావడం. మధ్యతరగతి కు టుంబాల్లో షుగర్, బీపీతో బాధపడేవారికి సబ్సిడీ ధరలతో మందులు అందించడం. హైదరాబాద్‌లో మూడు, జిల్లాల్లో మూడు ప్రపంచస్థాయి సౌకర్యాలతో ప్రభుత్వ వై ద్యశాలలను నిర్మించడం. ఈ ఆరు ఆస్పత్రుల నిర్వహణకు ప్రత్యేక విభాగా న్ని ఏర్పాటు చేయడం. ప్రతి మండలంలో 50 పడకల ఆసుపత్రితోపాటు నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయడం. 

బ్యాక్‌ టు ఫార్మింగ్‌ పేరుతో రైతుకు గౌరవం దక్కేలా రూ.2 లక్షల రుణమాఫీ. రైతు స్వావలంబన, ఇంటిగ్రేటెడ్‌ ప్లానింగ్‌ రూపొందించడం. విత్తనం వేయడం నుంచి పంట అమ్ముకునే వరకు ఇంటిగ్రేటెడ్‌ ప్లాన్‌ అమలు చేయడం. వ్యవసాయ సహకార సంఘాల పునురుద్ధరణ. పంట రుణాల తోపాటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టుకునే రైతులకు ఆర్థిక సహాయం అందించడం. పండేపంటలు, మార్కెట్‌ సదుపా యాలు, డిమాండ్‌–సప్లయి అంచనా వేసి రైతుకు, వినియోగదారు డికి లాభం చేకూర్చేలా ప్రత్యేక కార్పొరేషన ఏర్పాటు. వీటిలో విత్తన తయారీ కేంద్రాలు, అనుబంధ విభాగాలు ఏర్పాటు చేయడం. కౌలు రైతులు, రైతుకూలీ లందరికీ విడివిడిగా పథకాలు రూపొందించడం.

నదీజలాల విషయంలో ట్రిబ్యునళ్లు, కోర్టుల కంటే సామరస్యపూర్వక పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వడం. విలేజ్‌ విజన్‌ పేరుతో పంచాయతీల విశిష్ట అధికారాలను సర్పంచ్‌లు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవడం. డ్వాక్రా సంఘాలకు పూర్వవైభవం తేవడం, ఆర్థిక స్వావలంబనదిశగా మహిళల కోసం పథకాలు రూపొందించడం, సేఫ్టీ కోసం టెక్నాలజీ సహకారంతో వ్యవస్థ రూపొందించడం. చట్టసభల్లో మహిళలకు 25 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించడం. ఆస్తులను మహిళల పేరుతో రిజిస్టర్‌ చేసుకుంటే కేవలం 2 శాతం స్టాంప్‌ డ్యూటీ ఉండేలా చర్యలు చేపట్టడం. ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం. ఈ విభాగాల్లోని ఉద్యోగుల పిల్లల విద్య, ఉపాధి, వైద్యం కోసం ప్రభుత్వాలే బాధ్యత తీసుకునేలా చర్యలు. సైనిక్‌ స్కూల్‌ తరహాలో ఒక్కో విభాగంలోని పిల్లల కోసం వంద ఎకరాల్లో తెలంగాణలో మూడు చోట్ల విద్యాసంస్థలను ఏర్పాటు చేయడం. ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యా వసతి కల్పించడం.

క్షేత్రస్థాయిలో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం. అన్ని ఎకనామిక్‌ జోన్స్‌కు ఇంటిగ్రేటెడ్‌ రోడ్ల నిర్మాణం. పంట ఉత్పత్తులు, కూరగాయల రవాణా అనుసంధానం పెంచడం. ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించి ప్రభుత్వ రంగంలోకి తీసుకోవడం. బస్టాండ్లను మినీ ఎయిర్‌పోర్టుల తరహాలో అభివృద్ధి చేయడం. హైదరాబాద్‌ రోడ్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం, వరంగల్, కరీంనగర్‌ లాంటి ద్వితీయశ్రేణి నగరాలకు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేయడం. 

రాష్ట్రంలోని పెండింగ్‌ ప్రాజెక్టులను మూడు విభాగాలుగా విభజించడం. 1.ఐదు లక్షల ఎకరాలకుపైబడి సాగునీరు ఇచ్చే ప్రాజెక్టులు 2.లక్ష నుంచి ఐదు లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టులు 3.లక్ష లోపు ఎకరాలకు నీరిచ్చే ప్రాజెక్టులుగా విభజించి చిన్న తరహా ప్రాజెక్టులను ఆరు నెలల్లో, మధ్యతరహా ప్రాజెక్టులను రెండేళ్లలో, భారీ ప్రాజెక్టులను ఐదేళ్ల లోపు పూర్తి చేసేలా సాగునీటి రంగాన్ని ప్రోత్సహించడం. సాగు, తాగునీటి ఇంట్రిగేటెడ్‌ ప్రాజెక్టులు రూపొందించడం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement