రాహుల్, మోదీ మధ్య ఆమె ఎందుకు!

Rahul Gandhi Was Wrong To Call Journalist Who Conducted Modi Interview - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మోదీకి మీ ముందుకు వచ్చి కూర్చునే దమ్ము లేదు. నేను వచ్చాను. ప్రతి ఏడు రోజులకోసారి వస్తాను. మీరు నన్ను ఏ ప్రశ్నయినా అడగవచ్చు. మీరు ప్రధాన మంత్రి ఇంటర్వ్యూ చూశారు గదా! ఓ సానుకూల జర్నలిస్ట్‌ మోదీని ఓ పక్క ప్రశ్న అడుగుతూ మరో పక్క ఆమే సమాధానం ఇస్తోంది’ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం నాడు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీని జనవరి ఒకటవ తేదీన ఏఎన్‌ఐ (ఏషియన్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌) వార్తా సంస్థ ఎడిటర్‌ స్మితా ప్రకాష్‌ చేసిన ఇంటర్వ్యూ గురించి రాహుల్‌ ప్రస్తావిస్తూ స్మితా ప్రకాష్‌ను ఉద్దేశించి ‘సానుకూల’ జర్నలిస్ట్‌ అని విమర్శించారు.

పాలకపక్ష బీజేపీ అనుసరిస్తున్న దురుసుతనం, మెజారిటీవాద దృక్పథానికి తమ పార్టీ దూరమని, ఆ పార్టీ పాలనలో మీడియా స్వేచ్ఛ హరించుకు పోయిందని గతంలో పలుసార్లు విరుచుకుపడిన రాహుల్‌ గాంధీ నుంచి ఈ సానుకూల జర్నలిస్ట్‌ అన్న విమర్శ వస్తుందని ఊహించలేదు. మీడియా బయాస్‌గా ఉండడం ఇప్పుడే కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఇంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీని అర్నాబ్‌ గోసామి ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు అయన మోదీని ఎలాంటి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయలేదు. క్రాస్‌ క్వచ్చనింగ్‌ జోలికి పోలేదు. పైగా తాను అడగదల్చుకున్న ప్రశ్నలను ఆయన పీఎంవో కార్యాలయానికి ముందే పంపించారు. వాటికి పీఎంవో కార్యాలయం కూడా కొన్ని ప్రశ్నలను జోడించింది. అదే అర్నాబ్‌ గోసామి నాలుగేళ్ల క్రితం రాహుల్‌ గాంధీని ఇంటర్వ్యూతో ముచ్చెమటలు పోయించారు. ఆ ఇంటర్వ్యూ ద్వారానే రాహుల్‌ గాంధీకి ‘పప్పూ’ అనే పేరు వచ్చింది.

ఇలాగే ‘డెవిల్స్‌ అడ్వకేట్‌’ కార్యక్రమంలో నరేంద్ర మోదీని ప్రముఖ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌ 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల గురించి గుచ్చి గుచ్చి అడిగి ఇబ్బంది పెట్టారు. దాంతో నరేంద్ర మోదీ కార్యక్రమం మధ్యలోనే కాలర్‌ మైక్‌ను విదిలించి బయటకు వెళ్లి పోయారు. అర్నాబ్‌ గోసామి లాగా ఏఎన్‌ఐ జర్నలిస్ట్‌ స్మితా ప్రకాష్‌ ముందుగా రాసుకున్న స్క్రిప్టు ప్రకారం మోదీని ఇంటర్వ్యూ చేసినట్టులేదు. ఆమె అడిగిన ప్రశ్నల్లో కొన్ని కఠిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ‘శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మత విశ్వాసాన్ని గౌరవించిన మీరు, ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ఎందుకు మత విశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్నారు ?’ లాంటి ప్రశ్నలు. కాకపోతే సరైన సమాధానం వెతుక్కొని రావడానికి వీలుగా ముందుగానే పీఎంవో కార్యాలయానికి అడిగే ప్రశ్నలను పంపించినట్లు స్పష్టం అవుతోంది.

మీడియా తప్పొప్పులను ప్రశ్నించాల్సిందే! అయితే అది ఎవరు చేయాలి? మీడియా సంస్థలు, మీడియా కమిటీలు, మొత్తంగా సమాజం చేయాలి. రాజకీయ నాయకులు మాత్రం కాదు, కాకూడదు! వ్యవస్థ మంచి, చెడులకు వారే బాధ్యులవుతున్నందున వారు చేయడం సబబు కాదు. ఇంకా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీలు మీడియాను నిలదీయవచ్చు. విమర్శంచవచ్చు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top