అయోధ్యపై ఆర్డినెన్స్‌ ఉండదు

Narendra Modis first interview of 2019 - Sakshi

న్యాయ ప్రక్రియ ముగిశాకే నిర్ణయం

 రుణమాఫీ రైతులందరికీ ప్రయోజనకరం కాదు 

ఉర్జిత్‌ పటేల్‌ ఏడు నెలల క్రితమే రాజీనామా చేస్తానన్నారు

 ప్రజలకు, మహా కూటమికి మధ్యనే రానున్న ఎన్నికలు 

నూతన సంవత్సరం ప్రధాని మోదీ తొలి ఇంటర్వ్యూ 

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ తీసుకు వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కోర్టు కేసు తేలేవరకు, న్యాయప్రక్రియ ముగిసేవరకు ఆర్డినెన్స్‌ గురించి ఆలోచించబోమన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలు ప్రజలకు, విపక్ష  మహాకూటమికి మధ్యనే జరగనున్నాయన్నారు. నోట్ల రద్దు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, దాన్ని ఒక షాక్‌ గా చూడకూడదని, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. నూతన సంవత్సర తొలి ఇంటర్వ్యూను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు ఇచ్చారు. ప్రతిపక్షాలు, మీడియా గత కొన్నాళ్లుగా లేవనెత్తుతున్న అనేక అంశాలపై వివరణ ఇచ్చారు. మీడియా ముందుకు రావడం లేదన్న విమర్శలకు జవాబు అన్నట్లుగా దాదాపు 90 నిమిషాల పాటు ముఖాముఖిలో పాల్గొని పలు ప్రశ్నలకు సదీర్ఘ సమాధానాలిచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

అయోధ్యలో రామ మందిరం 
న్యాయ ప్రక్రియ ముగిసేవరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్‌ తీసుకు రావాలనుకోవడం లేదు. ఈ సమస్యకు రాజ్యాంగ పరిధిలో పరిష్కారం చూస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం. న్యాయ ప్రక్రియ పూర్తి కానివ్వండి. ఒక ప్రభుత్వంగా మా బాధ్యత ఏమిటో అది నిర్వర్తించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ట్రిపుల్‌ తలాక్‌ పై ఆర్డినెన్స్‌ను కూడా సుప్రీంకోర్టు తీర్పు తరువాతే తెచ్చాం. సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ న్యాయవాదులు అడ్డంకులు సృష్టిస్తుండటం వల్లనే తీర్పు ఆలస్యమవుతోంది. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్నవాళ్లు ఈ సమస్యను అపరిష్కృతంగా ఉంచేందుకే కృషి చేశారు.  

సర్జికల్‌ స్ట్రైక్స్‌ 
అది ఒక క్లిష్టమైన నిర్ణయం. అప్పుడు రాజకీయాల కన్నా జవాన్ల భద్రత గురించి ఎక్కువగా ఆలోచించాం. ఆపరేషన్‌ విజయవంతం కావడం కన్నా ఆ ఆపరేషన్‌లో పాల్గొన్న జవాన్ల ప్రాణాలు ముఖ్యమనుకున్నా. అందుకే మెరుపుదాడుల తేదీలను రెండు సార్లు మార్చాం. ఆపరేషన్‌లో పాల్గొనే వారికి కఠోర శిక్షణ ఇచ్చాం. సర్జికల్‌ స్ట్రైక్స్‌ కోసం నియంత్రణ రేఖ దాటి వెళ్లిన ప్రతీ జవాను తిరిగొచ్చే వరకు ఉత్కంఠ, ఆందోళనతో ఎదురుచూశా. మెరుపుదాడుల్లో విజయం సాధించినా, పరాజయం పాలైనా.. అందరినీ సూర్యోదయం లోపే తిరిగిరావాలని ఆదేశించాం. ఉడీ ఉగ్రదాడి మన ఆర్మీ జవాన్లలో కసిని పెంచింది.
 
పాకిస్తాన్‌ 
పాకిస్తాన్‌ అంత తొందరగా మారదు. ఒక్క యుద్ధం వల్ల పాక్‌ వైఖరిలో మార్పు వస్తుందని నేను భావించడం లేదు. అలా ఎవరు అనుకున్నా పొరపాటే. 

ఉర్జిత్‌ పటేల్‌ 
ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా హఠాత్తుగా జరిగినదేమీ కాదు. ఏడు, ఎనిమిది నెలల క్రితమే ఆయన రాజీనామా చేస్తానన్నారు. అందుకు వ్యక్తిగత కారణాలున్నాయన్నారు. ఈ విషయం నేను ఇప్పుడు మొదటిసారి చెబుతున్నా. ఈ విషయంలో రాజకీయ ఒత్తిడులు లేనే లేవు. ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన అద్భుతంగా పనిచేశారు.  

నోట్లరద్దు 
నల్లధనం కారణంగా దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందనే విషయంలో సందేహం లేదు. అందుకే పెద్ద నోట్లు రద్దు చేశాం. ఇది హఠాత్తు నిర్ణయం కాదు. ఏడాది క్రితమే హెచ్చరించాం. మీ దగ్గర నల్లధనం ఉంటే బ్యాంకుల్లో దానిని డిపాజిట్‌ చేయండి. జరిమానాలు చెల్లించండి, అందుకు ప్రభుత్వం మీకు సాయం చేస్తుందని ఏడాది ముందుగానే ప్రజలను హెచ్చరించాం. నోట్ల రద్దు ఫలితంగా మంచాల కింద, అరల్లో దాచిన కట్టల కొద్దీ నగదు బయటపడింది. అదంతా ఇప్పుడు బ్యాంకుల్లోకి వచ్చి చేరింది. పన్నుల వసూళ్లు పెరిగాయి. ఇది గెలుపు కాదంటారా? జీడీపీతో పోలిస్తే కరెన్సీ చెలామణీ తగ్గింది. వచ్చే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. ఈ నిర్ణయాన్ని షాక్‌గానో, ప్రజలపై భారంగానో భావించకూడదు. 

మాల్యా, చోక్సీ 
ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు చర్యకు భయపడే వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ, విజయ్‌ మాల్యా విదేశాలకు పారిపోయారు. మా ప్రభుత్వ హయాంలో పారిపోయిన ఆ ఇద్దరినీ నేడో రేపో తిరిగి తీసుకువస్తాం. దేశ ప్రజల సొమ్ము దొంగిలించిన వారి నుంచి ప్రతిపైసా తిరిగి రాబడతాం.

2019 ఎన్నికలు 
రానున్న లోక్‌సభ ఎన్నికలు దేశ ప్రజలకు, విపక్ష మహా కూటమికి మధ్య జరగనున్నాయి. ఈ సారి బీజేపీకి 180 స్థానాల కన్నా ఎక్కువ రావని కొందరు చెబుతున్నారు. అలాంటి అంచనాలే 2014లోనూ వచ్చాయి. ప్రజలు నావైపే ఉన్నారనుకుంటున్నాను. ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చేవారు.. ఆ ఆకాంక్షలు నెరవేరకుండా అడ్డుకునే వారు.. ఈ ఇద్దరి మధ్యనే రానున్న ఎన్నికలు జరుగుతాయి. వారి 70 ఏళ్ల పాలన ప్రజలకు గుర్తుంది. 

ఫెడరల్‌ ఫ్రంట్‌ 
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రతిపాదిస్తున్న కూటమి గురించి నేను వినలేదు. నాకు తెలియదు.

మోదీ మ్యాజిక్‌ 
అలా అనే వారందరికీ కృతజ్ఞతలు. 2014లోనూ కొందరు మోదీ హవా ప్రభావమేం లేదన్నారు. వాళ్లే ఇప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మోదీ హవా అనేది ఒకటుందని వారు నమ్ముతున్నందుకు నేను హ్యాపీ. దాని గురించి వారికి తెలిసినందుకు సంతోషం. నా దృష్టిలో హవా అంటే ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేవారిని విశ్వసించడమే. 

ప్రజలదే నిర్ణయం 
నా ప్రతి పనిలో నిజం ఉంది, నిజాయతీ ఉంది. నేను ఏం చేశానో, ఎలా చేశానో నిర్ణయించే బాధ్యత ప్రజలకే వదిలిపెట్టా.  ప్రతిపక్షాలు మాపై దుష్ప్రచారం తప్ప మరేం చేస్తాయి? అలా చేయకుంటే వారి కూటమి ఎలా నిలుస్తుంది? మాకు హాని చేసేందుకే అవి చెడు ప్రచారం చేస్తున్నాయి. కానీ, ప్రజా తీర్పుపైనే నా విశ్వాసం. 

రఫేల్‌ ఒప్పందం
రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు నాపై వ్యక్తిగతంగా చేస్తున్నవి కాదు. నా ప్రభుత్వంపై చేస్తున్నవి. నాపై వ్యక్తిగత ఆరోపణలైతే.. ఎవరు, ఎప్పుడు, ఎలా ఇచ్చారు? లాంటి ఆధారాలుంటే బయటపెట్టాలంటున్నా. ఊరికే బురద చల్లి పారిపోవడం కాదు. వాళ్లకు పదేపదే ఒకే విషయాన్ని అరచి చెప్పే జబ్బు ఉంది. ఈ విషయంపై పార్లమెంటులోనూ, బయట చాలాసార్లు వివరణ ఇచ్చాను. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అసలు రక్షణ రంగ ఒప్పందాల్లో మధ్యవర్తులు ఎందుకు ఉంటారు? ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను 70 ఏళ్ల క్రితమే ప్రారంభించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నేనా పని ఇప్పుడు చేస్తుండటమే నా నేరం. మన సాయుధ దళాలకు రక్షణ రంగ ఉత్పత్తులను సమకూర్చడానికి ప్రయత్నించడమే నేను చేస్తున్న నేరంలా ఉంది.

మోదీ–అమిత్‌ షా ద్వయం 
మోదీ, అమిత్‌షాల కారణంగానే బీజేపీ ముందుకు సాగుతోందని అనుకునే వారికి బీజేపీ గురించి తెలియదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. ‘హర్‌ పోలింగ్‌ బూత్, సబ్‌సే మజ్బూత్‌’ అనే నినాదంతో పోలింగ్‌ బూత్‌ నుంచే బీజేపీ పని మొదలవుతుంది. మా కార్యకర్తలు 365 రోజులూ ఇదే లక్ష్యంగా పనిచేస్తుంటారు. బీజేపీని ఒకరిద్దరు నడుపుతున్నారని భావించే వారు బీజేపీ సంస్థలను అర్థం చేసుకోలేదు. పార్టీలోని ప్రతి స్థాయి లోనూ కార్యకర్తల నాయకత్వం ఉంటుంది. అది పైకి చేరేకొద్దీ అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ అన్న సిద్ధాంతంతో ప్రజల మెప్పును పొందుతూ బీజేపీ ముందుకు సాగుతుంది. బీజేపీ పట్టు తగ్గుతుందంటే దానర్థం మేం నష్టపోతున్నామని కాదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం అసోం, హరియాణా, త్రిపురల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.
 
డోక్లాం వివాదం
డోక్లాం సంక్షోభ సమయంలో వ్యవహరించిన తీరును బట్టే భారత్‌ సామర్థ్యాన్ని నిర్ణయించాలి. చైనా చేతిలో నెహ్రూ హయాంలో మాదిరిగా భారత్‌ మోస పోయిందని చెప్పేంత స్థాయిలో ఏదీ జరగలేదు. అయితే, పొరుగు వారితో స్నేహాన్ని కోరుకోవాలన్నదే మన సిద్ధాంతం. మన ప్రభుత్వాలన్నీ అదే విధానాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. 

మహాకూటమి 
తెలంగాణలో వీళ్లు చెబుతున్న మహా కూటమి ఏమైంది? అట్టర్‌ ఫ్లాప్‌ అయింది. ఐదేళ్లుగా మనం చూస్తే,  కచ్చితమైన మహాకూటమి ఏర్పాటుపై ఎవరైనా మాట్లాడారా? వాళ్లు ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఎవరు వీరు?  తమను తాము రక్షించుకునేందుకు, మద్దతు కోరుకుంటూ ‘ఒకరి చేతులు మరొకరు పట్టుకుంటే అందరం సురక్షితంగా ఉంటాం’ అని అనుకునేవారు. వీరందరి ఎజెండా ఒక్కటే.. మోదీ. ఏ వార్తా పత్రికలో పది పేజీలు తిరగేసినా మోదీ ఇది చేయలేదు, మోదీ అలా మోదీ ఇలా అని విమర్శించే పది మంది కూటమి నేతల మాటలే కనిపిస్తాయి. దేశం కోసం వారేం చేయబోతున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారనే దానిపై ఏకాభిప్రాయం లేదు. 

మూక దాడులు 
సభ్య సమాజంలో ఇలాంటి వాటిని ఎవరూ సమర్ధించరు. అయితే, ఇవి 2014లోనే ప్రారంభమయ్యాయా? మన సమాజంలోని చెడు అలా బహిర్గతమవుతోంది. ఇలాంటి ఘటనలను అంతా కలసికట్టుగా ఖండించాల్సిందే. భారత దేశంలో అహింసే సంప్రదాయం. ఇది అలాగే కొనసాగుతుంది. చర్చలు, సంప్రదింపుల పైనే మనకు విశ్వాసం ఉంది. సబ్‌ కాసాథ్‌.. సబ్‌ కా వికాస్‌.. మా నినాదం. 18 వేల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాం. వర్గా ల ప్రాతిపదికన ఆ గ్రామాలను ఎంపిక చేయలేదు.

‘గాంధీ’ కుటుంబం 
ఆ కుటుంబంలోని నాలుగు తరాల నేతలు దేశాన్ని పాలించారు. అందుకే ఆ కుటుంబాన్ని ఒకప్పుడు ‘ప్రథమ కుటుంబం’ అనేవాళ్లు. ఆ ‘ప్రథమ కుటుంబం’లోని వ్యక్తులు ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసుల్లో ఇప్పుడు బెయిల్‌పై ఉన్నారు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మాజీ ఆర్థిక మంత్రి(చిదంబరం) పలు ఆర్థిక అక్రమాల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. 

వ్యవస్థల విధ్వంసం 
ఈ విషయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు. పీఎంకు, పీఎంఓకు వ్యతిరేకంగా ఎన్‌ఏసీ(జాతీయ సలహా మండలి)ని ఏర్పాటు చేసిందెవరు? కేబినెట్‌ ఓ నిర్ణయం తీసుకుంటే.. ఓ పెద్ద నేత ఆ పేపర్లను ప్రెస్‌మీట్లోనే చింపేస్తారు. ఇదేనా వ్యవస్థను గౌరవించడం. న్యాయవ్యవస్థలోనూ తమకు అనుకూలురైన జూనియర్లను జడ్జీలుగా నియమించలేదా? ఎంతమంది ఆర్బీఐ గవర్నర్లను బలవంతంగా పంపించలేదు? వీళ్లు వ్యవస్థల విధ్వంసం గురించి మాట్లాడుతారా? ప్రణాళిక సంఘాన్ని జోకర్ల బృందంగా అభివర్ణించింది వీరు కాదా?

ట్రిపుల్‌ తలాక్‌.. శబరిమల 
ట్రిపుల్‌ తలాక్, శబరిమల రెండు వేర్వేరు అంశాలు. ప్రపంచంలోని చాలా ముస్లిం దేశాలు ట్రిపుల్‌తలాక్‌ను నిషేధించాయి. కాబట్టి, ఇది మతపరమైన అంశం కాదు. పొరుగునే ఉన్న పాకిస్తాన్‌ కూడా ట్రిపుల్‌తలాక్‌ను నిషేధించింది. కాబట్టి, దీనిని లింగ సమానత్వానికి, సామాజిక న్యాయానికి సంబంధించిన విషయంగా గుర్తెరగాలి. ఇది మత విశ్వాసంలో భాగం కాదు. అందుకే, శబరిమల అంశంతో దీనిని పోల్చడం సరికాదు.

రైతు రుణ మాఫీ
రుణమాఫీతో అత్యధిక శాతం రైతులకు ప్రయోజనం కలగదు. రుణమాఫీ రాజకీయ స్టంట్‌. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలవి. రైతులకు సాధికారత కల్పించడమే వారి సమస్యలకు పరిష్కారం. ఆ దిశగానే మేం ఆలోచిస్తున్నాం. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే రైతుల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువగా ప్రైవేటు రుణాలే తీసుకుంటారు. వారికి రుణమాఫీతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. రుణాలు తీసుకోవాల్సి రాకుండా ఉండాల్సిన పరిస్థితి రైతులకు రావాలి. వాళ్లు పూర్తిగా రుణమాఫీ చేశామంటున్నారు. కానీ అది నిజం కా>దు. అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఉద్దేశంతోనే ‘లాలీపాప్‌’ కామెంట్‌ చేశాను. బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఏదైనా రుణమాఫీ పేరుతో ప్రజలను మభ్యపెట్టదు. రుణమాఫీతో నిజంగా ప్రయోజనం ఉంటే.. మే మూ చేసేవాళ్లం. గతంలో దేవీలాల్‌(ఉప ప్రధాని) సమయం నుంచి రుణమాఫీలు చేస్తూ వస్తున్నారు. 2009లో ఎన్నికల్లో గెలవడం కోసం యూపీఏ రుణమాఫీ ప్రకటించింది. 

రాహుల్‌.. గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ 
ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో, అతని మాటలూ అలాగే ఉంటాయి. ప్రణబ్‌ ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పటి నుంచే జీఎస్టీ ప్రక్రియ కొనసాగుతోంది. పార్లమెంట్‌లో జీఎస్టీ బిల్లును అందరూ ఆమోదించారు. జీఎస్టీకి ముందు రోజుల్లో దేశంలో పన్ను రేటు 30 నుంచి 40 శాతం వరకు ఉండేది. దీంతోపాటు కనిపించని పన్నులు, మళ్లీమళ్లీ పన్నులు అదనంగా ఉండేవి. జీఎస్టీతో పన్ను విధానం సరళమైంది. అత్యధిక పన్ను రేటు ఉండే దాదాపు 500 వస్తువులపై జీఎస్టీ వల్ల పన్ను రద్దయింది. రోజువారీ వాడే దాదాపు 1200 వస్తువులపై పన్ను  18శాతం నుంచి దాదాపుగా 5 శాతానికి తగ్గింది. ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తున్నాం.  జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్‌ నేతలు తమను తామే విమర్శించుకుంటున్నారా లేదా తమ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను విమర్శిస్తున్నారా? జీఎస్టీ కొత్త విధానం. సాంకేతిక అంశాల ఆధారంగా పెనుమార్పు తీసుకువచ్చిన విధానం. దీనిపై రాజకీయ దురుద్దేశాలతో విమర్శలు చేయడం సరికాదు. కొందరు చిన్న వ్యాపారుల అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. మా దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌కు పంపుతున్నాం. అందరం కలిసి పరిష్కరిస్తున్నాం. 

తాజా ఎన్నికల్లో ఓటమి..
తెలంగాణ, మిజోరంలలో బీజేపీ గెలుస్తుందని ఎవరూ భావించలేదు. ఆ ఆలోచన మాకూ లేదు. మిగతా మూడు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఓడిపోయింది. కానీ మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల్లో హంగ్‌ అసెంబ్లీ వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ రాష్ట్రాల్లో 15 ఏళ్లు బీజేపీ అధికారంలో ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అనేది సహజంగానే ఉంటుంది. 

స్వోత్కర్ష.. వాగాడంబరమే! 
ప్రధాని ఇంటర్వ్యూపై కాంగ్రెస్, బీజేపీల వాగ్యుద్ధం 
న్యూఢిల్లీ: మోదీ ఇంటర్వ్యూపై కాంగ్రెస్‌ స్పందించింది. ఇంటర్వ్యూలో దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను ప్రస్తావించలేదని, కేవలం వాగాడంబరం అందులో ఉంద ని ఆరోపించింది. నోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకు స్కామ్‌లు, రైతాంగ సంక్షోభం.. తదితరాల వల్ల దేశ పౌరులు ఎదుర్కొన్న కష్టనష్టాలపై ప్రధాని మాట్లాడితే బావుండేదని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సూర్జేవాలా విమర్శించారు. ‘నేను, నా’లకే ప్రధాని ఇంటర్వ్యూ పరిమి తమయిందన్నారు. ఇది ‘ఫిక్స్‌డ్‌ ఇంటర్వ్యూ’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆనంద్‌ శర్మ వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ను ఎదుర్కోవాలని సవాలు చేశారు. 

కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు: బీజేపీ 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలను ప్రధాని మోదీ చీల్చి చెండాడారని బీజేపీ ప్రశంసించింది. ‘ఇది సమగ్రమైన, అద్భుతమైన ఇంటర్వ్యూ. చాన్నాళ్లుగా వార్తల్లో ఉన్న అనేక అంశాలపై ప్రధాని విస్పష్ట సమాధానం, వివరణ ఇచ్చారు. విపక్ష పార్టీల స్వార్ధ ప్రచారాన్ని ప్రధాని సమర్ధంగా తిప్పికొట్టారు’ అని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్‌ పేర్కొన్నారు. ‘గత కొన్ని నెలలుగా విపక్ష పార్టీలు ప్రణాళికాబద్దంగా ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని, అబద్ధాలను ఒకే ఒక ఇంటర్వ్యూలో ప్రధాని ప్రజలకు తేటతెల్లం చేశారు. నిజం, నిజాయితీకున్న శక్తి ఇదే’ అని మరో నేత షానవాజ్‌ హుస్సేన్‌ తెలిపారు. కోర్టు కేసు తేలేవరకు అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించి ఆర్డినెన్స్‌ తీసుకు రాబోమని ప్రధాని స్పష్టం చేయడాన్ని జనతాదళ్‌(యూ) స్వాగతించింది. మోదీ హయాంలోనే రామమందిర నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ పేర్కొంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top