అందుకే ప్రియాంకకు పదవి: రాహుల్‌

Rahul Gandhi Comments On Priyanka New Role - Sakshi

అమేథి: తన సోదరి ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించి, కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించడాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమర్థించుకున్నారు. కేంద్రం, యూపీలోనూ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రియాంక సమర్థురాలని ఆయన కితాబిచ్చారు. ‘ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా శక్తివంతులైన నాయకులు. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి యువ నాయకత్వం అవసరమని భావించి వీరిద్దరికీ యూపీ బాధ్యతలు అప్పగించామ’ని రాహుల్‌ తెలిపారు.

తమ పార్టీ అనూహ్యంగా ప్రియాంక గాంధీని తెరపైకి తీసుకురావడంతో బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తనకు ప్రియాంక తోడుగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. జ్యోతిరాదిత్య డైనమిక్‌ యువనేత అని ప్రశంసించారు. వీరిద్దరిపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. బీజేపీని ఓడించేందుకు అవసరమైతే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు సహకరిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేసే విషయంపై రాహుల్‌ సూటిగా సమాధానం చెప్పలేదు. ప్రియాంకను యూపీ తూర్పు, జ్యోతిరాదిత్య సింధియాను పశ్చిమ యూపీకి ఇన్‌చార్జ్‌లుగా కాంగ్రెస్‌ పార్టీ నియమించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top