
వైఎస్‌ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా రెండో మారు ఘన విజయం సాధించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హవాతోపాటు రాచమల్లు సొంత ఇమేజ్ కూడా ఆయన విజయానికి కారణమైంది. టీడీపీ తరఫున నియోజకవర్గంలో నేతలు ఎక్కువగా ఉన్నారు. వారందరూ కలసి వచ్చినా వైఎస్‌ఆర్‌సీపీ తరఫున రాచమల్లు అవిశ్రాంత పోరాటం చేశారు. ఆయనను ఓడించడానికి టీడీపీ నేతలు పన్నిన వ్యూహాలు ఫలించలేదు. ఈ కారణంగా రాచమల్లు మరో మారు పట్టు నిలుపుకొన్నారు. దీంతో ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాక టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారు. 2014 ఎన్నికల్లో తొలిమారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాచమల్లు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లొంగకుండా.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. అనతి కాలంలోనే సొంత ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాటం చేసిన ఎమ్మెల్యే రాచమల్లుపై.. పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఆయన మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ వచ్చారు. పార్టీ మారాలని కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయి. తన ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని పలు సందర్భాల్లో రాచమల్లు ప్రకటించారు. ఈ కారణంగా ఆయన ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాచమల్లు విజయం ఎన్నికల కంటే ముందే ఖరారైనట్లు భావించవచ్చు. స్వయంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థులతో చర్చించిన సందర్భంలో.. ప్రజల మద్దతు రాచమల్లుకే ఉందని, ఆయన ఓటమి కోసం మనమంతా కష్టపడాలని సూచించారు.
తెరపైకి వచ్చిన పలువురి పేర్లు
ప్రజల మద్దతు కూడగట్టుకున్న రాచమల్లును ఓడించడానికి.. టీడీపీ అధిష్టానం చేయని ప్రయత్నాలు లేవు. ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలకు పట్టు లేదని, కొత్తగా పలువురి పేర్లను తెరపైకి తెచ్చింది. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్‌ను తొలుత ప్రొద్దుటూరులో పోటీ చేయించాలని ప్రతిపాదించారు. మరో మారు మంత్రి ఆదినారాయణరెడ్డి కుమారుడిని పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. మరో వైపు ఆప్కో చైర్మన్ బండి హనుమంతు, సినీ హబ్ రాజేశ్వరరెడ్డి, డాక్టర్ వైవీ స్వరూప్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, వీరశివారెడ్డి ఇలా అనేక మందిని తెరపైకి తెచ్చారు. చివరగా మాజీ ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. టీడీపీ విజయం సాధించే దిశలో భాగంగా వరదరాజులరెడ్డి, లింగారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చారు. ఇందులో భాగంగానే వరదరాజులరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ విజయం కోసం ఓ వైపు లింగారెడ్డి, మరో వైపు వరదరాజులరెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేశారు. ప్రొద్దుటూరులో అనుచర గణం కలిగి ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి రాచమల్లును ఎలాగైనా ఓడించాలని పట్టుబట్టారు. బహిరంగ వేదికల్లో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. అయినా రాచమల్లు విజయాన్ని నిలువరించలేకపోయారంటే ఆయనకు ఉన్న ప్రజల మద్దతు ఏ పాటిదో అర్థమవుతోంది.
కలిసొచ్చిన పార్టీ కార్యక్రమాలు
ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కూడా అదనంగా కలిసి వచ్చాయి. ఆయన ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయగా.. పార్టీ కార్యక్రమాలను కూడా వాడవాడలా తిరిగి ప్రజల్లోకి తీసుకెళ్లారు. గడపగడపకు వైఎస్సార్, కావాలి జగన్– రావాలి జగన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన నియోజకవర్గంలోని ప్రతి గడప తొక్కారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో ప్రజలకు వివరించడంతోపాటు ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రాచమల్లు శివప్రసాదరెడ్డి విజయం సాధించారు. సింహం సింగిల్‌గా వస్తుందని రాచమల్లు నిరూపించారు.