ఏమిటీ.. ఈ రెండు డైలాగులకే?

Political Satirical Story on AP Lok Sabha Elections - Sakshi

న‘యాసీన్‌’

‘‘ఏదీ.. కాస్త ఫేసు టర్నింగ్‌ ఇచ్చుకో’’ టీవీ స్క్రీన్‌ మీద చిరంజీవి సినిమాలోని ఈ డైలాగ్‌ వినీవినగానే యోగా చేసుకుంటున్న బాబుగారు ఉలిక్కిపడ్డారు.
‘‘ఎవడ్రా ఈ డైలాగున్న సినిమా పెట్టింది. తీసిపారేయండి’’ అంటూ కోప్పడ్డారు అయ్యగారు.
‘‘సార్‌.. అది ‘రిటర్న్‌’ కాదు సార్‌. ‘టర్నింగ్‌’ ఇచ్చుకో అన్న మాట సార్‌’’ అంటూ పనివాళ్లు ఏదో సర్దిచెప్పబోయారు. అయినా ఇంకా ఆయన అగ్గి మీద గుగ్గిలం అయిపోతుండటంతో ‘తీసేస్తాం సార్‌...’ తీసేస్తాం సార్‌’ అంటూ టీవీ ఆపేశారు. అయ్యగారు అంతగా చేస్తున్న యోగా కూడా ఆయన యాంగర్‌ మేనేజ్‌మెంట్‌కు ఏమీ ఉపయోగపడకపోవడం చూసి ఆశ్చర్యపడుతున్నారు వారు.

‘‘ఈ డిజైన్లేమీ నచ్చలేదు.. అన్నీ ‘రిటర్న్‌’ చేసేయండి’’ నౌకర్లను ఆదేశిస్తున్నారు అమ్మగారు. ఆ మాట ఆమె నోట అలా వచ్చిందో లేదో...
‘‘ఎవర్రా అక్కడ? ఏదో అనకూడని మాట అంటున్నారు’’ అంటూ రంకెలేశారు అయ్యగారు.
‘‘అమ్మగారేలెండి. చీరలేవో కొత్త డిజైన్లు వచ్చాయంటే ‘కంగనా కజిన్స్‌’ నుంచి తెప్పించారు. నచ్చలేదట..  వాళ్లవి వాళ్లకు ‘రిటర్న్‌’ ఇచ్చేయమంటున్నారు’’ అంటూ నిశ్చింతగా చెప్పారు నౌకర్లు. ఆ మాట అన్నది అమ్మగారు కావడమే వాళ్ల నిశ్చింత.
‘‘వద్దంటే మళ్లీ అదే మాట’’ అంటూ కూకలేశారు బాబుగారు.

ప్రచారానికి బయటకు వెళ్లబోతుంటే ‘‘సాయంత్రానికల్లా రిటర్న్‌ అవుతారా?’’ అసలు విషయం మరచిపోయి మళ్లీ ఆ మాట అననే అన్నారు అమ్మగారు.
అమ్మగార్ని ఏమీ అనలేక ‘‘హు’’ అంటూ బలంగా ఒక హూంకరింపు, నిస్సహాయంగా ఒక నిట్టూర్పు విడిచారాయన.

ప్రచారం కోసం కార్లో బయటకు వెళ్తుండగా రోడ్డు మీద ఎవరో కుర్రాడి బైక్‌ వెనకాల ‘డాడ్స్‌ గిఫ్ట్‌’ అనే మాట కనిపించింది. వాహనం ఇలా మళ్లీ ఓ మలుపు తిరిగిందో లేదో మరో కారు వెనకాల ‘మామ్స్‌ గిఫ్ట్‌’ అనే మాట ఉంది.
‘‘అన్నట్టు... ఈ బైకుల మీద... కార్ల మీద ఫలానా వారి గిఫ్ట్‌ అని రాసుకుంటూ ఉంటారు కదా. అలా రాయకూడదంటూ ఓ ఆర్డర్‌ ఇచ్చేద్దామా?’’ అడిగారు బాబుగారు సెక్రటరీని.
‘‘అలా కుదరదేమో సార్‌’’ నసిగాడు సెక్రటరీ.
‘‘ఎందుక్కుదరదు? అప్పట్లో ఆటోలన్నింటి వెనకాలా ‘‘థ్యాంక్యూ సీఎం సార్‌’’ అంటూ మనకు మనమే సార్‌ అని పిలుచుకుని, మనకు మనమే థ్యాంక్యూ అనీ చెప్పుకోలేదా?’’ మళ్లీ సెక్రటరీని గసిరారు.

‘‘ఏమిటిది? రిటర్న్‌ అన్న మాట వినబడ్డా, గిఫ్ట్‌ అన్న పదం కనబడ్డా సార్‌ అలా చిందులేస్తున్నారు?’’ అడిగాడు బంట్రోతు పక్కనే ఉన్న డ్రైవర్‌ని.
‘‘ఏమోరా.. ఆ పక్క రాష్ట్రం ఆయన అప్పుడెప్పుడో ‘‘రిటర్న్‌ గిఫ్ట్‌’ అన్న దగ్గర్నుంచీ ఇదే వరస. ఈ రాష్ట్రం నేతలు కూడా ‘యూ టర్న్‌’ అన్న దగ్గర్నుంచీకూడా. అప్పట్నుంచి... ‘టర్న్‌’... ‘రిటర్న్‌’... ‘టర్నింగ్‌’... అనే మాట వింటే చాలు అదే ధోరణి. ఇప్పుడాయనకు ఇంగ్లిష్‌ భాషలో నచ్చనివి రెండే రెండు పదాలు’’ కారణాలు వివరిస్తూ చెప్పాడు డ్రైవర్‌.
‘‘ఏమిటవి...?’’
‘‘మొదటిది ‘రిటర్న్‌!’... రెండోది ‘గిఫ్ట్‌!!’’ – యాసీన్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top