డామిట్‌..కథ అడ్డం తిరిగింది!

Ongole Local Elections Plans Change With Reservations - Sakshi

రిజర్వేషన్లతో మారిన తలరాతలు

టికెట్‌ ఖరారుగా భావించిన అభ్యర్థులకు స్థానచలనం

తమకు అనుకూలమైన డివిజన్లపై కార్పోరేట్‌ అభ్యర్థుల కన్ను

ఒంగోలు టౌన్‌ :డామిట్‌! కథ అడ్డం తిరిగింది!! ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ డివిజన్‌ నుంచే పోటీ చేస్తానంటూ ఇప్పటి వరకు ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన ప్రధాన రాజకీయ పార్టీల కార్పొరేట్‌ అభ్యర్థుల తలరాతలు మారాయి. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఈ డివిజన్‌ మనదే. మనమే గెలుస్తామంటూ తమ అనుచరులకు గట్టి భరోసా ఇస్తూ వచ్చిన ప్రతిపాదిత అభ్యర్థులు బొక్కబోర్లా పడ్డారు. నాకు, మా పార్టీకి కంచుకోటగా ఉంటుందంటూ చెప్పుకొచ్చినవారు రిజర్వేషన్ల పుణ్యమా అంటూ మరో డివిజన్‌ చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఆదివారం ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ డివిజన్‌ నుంచి పోటీ చేసేది నేనేనంటూ చెప్పుకుంటూ వచ్చిన అభ్యర్థుల్లో కొంత మందికి స్థానచలనం కలిగింది. దీంతో తమకు అనుకూలమైన డివిజన్లపై కార్పొరేట్‌ అభ్యర్థులు కన్ను వేశారు. ఆ డివిజన్‌ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయమై తన వర్గీయులతో చర్చల్లో మునిగిపోయారు. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల్లో ఎక్కువగా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

అనేక చోట్ల ప్రతిఘటన
ఒంగోలు నగర పాలక సంస్థలోని డివిజన్లను రిజర్వేషన్ల ద్వారా మార్పులు చేర్పులు చేసుకున్న నేపథ్యంలో అప్పటి వరకు ఆ డివిజన్‌ తానేదంటూ కర్చీఫ్‌ పరచినట్లుగా ఉన్న ప్రతిపాదిత అభ్యర్థులకు ఇతర డివిజన్లలో ప్రతిఘటన ఎదురుకానుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అన్ని డివిజన్లలో నాయకత్వాలు బలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల కారణంగా మారిన సమీకరణలతో ఆ డివిజన్‌లో స్థానికంగా ఉంటున్న ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కార్పొరేట్‌ పదవిపై కన్నేశారు. అదృష్టం తలుపు తట్టినట్లుగా తన సామాజిక వర్గానికి రిజర్వ్‌ అయితే ఇక్కడి స్థానాన్ని మరో డివిజన్‌కు చెందిన నాయకుడు వచ్చి పాగా వేస్తానంటూ ఎలా కుదురుతుందని తమ నాయకుల వద్ద ప్రశ్నించడం మొదలెట్టారు. రిజర్వేషన్ల పుణ్యమా అంటూ వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదంటూ తమ నాయకులకు తేల్చి చెబుతున్నారు.ఈ పరిస్థితి ఒంగోలు నగర పరిధిలోని పలు డివిజన్లలో చోటు చేసుకుంటుంది. ఈ పంచాయతీని చక్కదిద్దేందుకు రెండు పార్టీలకు చెందిన కొంతమంది ద్వితీయశ్రేణి నాయకులు రంగంలో దిగుతున్నారు.

రంగంలోకి నాయకత్వాలు
ఒంగోలు నగర పాలక సంస్థలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్‌ నుంచి ఒకరు చొప్పున కార్పొరేటర్‌ ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ పోల భాస్కర్‌ రిజర్వేషన్లను ఖరారు చేశారు. మొత్తం ఎస్టీ జనరల్‌కు ఒక డివిజన్, ఎస్సీ మహిళలకు నాలుగు డివిజన్లు, ఎస్సీ జనరల్‌కు ఐదు డివిజన్లు రిజర్వ్‌ చేశారు. బీసీలకు సంబంధించి మహిళలకు ఏడు డివిజన్లు, బీసీ జనరల్‌కు ఎనిమిది డివిజన్లు రిజర్వ్‌ చేశారు. జనరల్‌ కోటాలో మహిళలకు 14 డివిజన్లు రిజర్వ్‌ చేశారు. 11 డివిజన్లను అన్‌ రిజర్వ్‌డ్‌ కింద ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమ సామాజిక వర్గాలకు చెందిన బలమైన అభ్యర్థులను కార్పొరేటర్లుగా నిలబెట్టేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఒక డివిజన్‌ నుంచి మరో డివిజన్‌కు జంపింగ్‌ చేసే బలమైన అభ్యర్థుల విషయంలో ఆ డివిజన్‌కు చెందిన నాయకులను బుజ్జగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఘట్టం దగ్గర పడుతుండటంతో రిజర్వేషన్ల పంచాయతీని చక్కదిద్దుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top