మోర్బీ: గుజరాత్‌లో శాసనసభ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదునైన విమర్శలతో విరుచుకుపడ్డారు. తొలిదశలో పోలింగ్ జరగనున్న సౌరాష్ట్ర ప్రాంతంలోని పటీదార్లకు పట్టున్న మోర్బీ పట్టణంలో మోదీ బుధవారం ఓ ర్యాలీలో ప్రసంగించారు. 22 ఏళ్లుగా గుజరాత్‌లో అధికారంలోనే ఉన్న తమ పార్టీ... నర్మదా నది నుంచి కరువు ప్రాంతాలైన సౌరాష్ట్ర, కచ్‌లకు పైపులైన్లు నిర్మించి, అక్కడి ఆనకట్టలు నింపి నీరు అందించి ఎంతో మంచి చేసిందన్నారు.
‘ఇక్కడి వారి కోసం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించిన వారిని గౌరవించడం ఈ నేల సంప్రదాయం. మేం ఎంతో చేశాం. మరో 100 ఏళ్లపాటు ప్రజలు బీజేపీకే ఓటేసి అధికారమివ్వాలి’ అని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను రాహుల్‌గాంధీ షోలే సినిమాలోని బందిపోటు దొంగ పాత్రతో పోలుస్తూ అది ‘గబ్బర్ సింగ్ ట్యాక్స్’ అని విమర్శిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, రాహుల్‌పై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎవరైతే జీవితమంతా ప్రజలను దోచుకోవడంలోనే నిమగ్నమై ఉంటారో వారికి బందిపోటు దొంగలు మాత్రమే గుర్తుంటారు’ అంటూ విరుచుకుపడ్డారు.
కొత్త ఆర్థిక వేత్త పుట్టుకొచ్చాడు
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఒకే జీఎస్టీ శ్లాబ్ పెట్టి పన్ను రేటును 18 శాతంగా నిర్ణయిస్తామంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మోదీ వ్యంగ్యంగా స్పందించారు. ‘జీఎస్టీపై ఆయన ‘అత్యంత చెత్త ఆలోచన’ (గ్రాండ్ స్టుపిడ్ థాట్–జీఎస్టీ)ను వ్యాప్తి చేస్తున్నారు.
అందరూ వాడే నిత్యావసరమైన ఉప్పు నుంచి కోటీశ్వరులు మాత్రమే కొనే రూ.5 కోట్ల విలువైన కార్ల వరకు అన్నింటికీ 18% పన్నునే వేస్తారట. ఆయనకు ఎంతటి తెలివి? అంటే ఆహారం, బట్టలు, చెప్పుల వంటి అందరికీ అవసరమైన వస్తువుల రేట్లను పెంచి... మద్యం, సిగరెట్ల ధరలను తగ్గించాలని అనుకుం టున్నారా. అలాగైతే ప్రతి ఇంట్లో ఓ కేన్సర్ రోగిని తయారు చేసినట్లే. మద్యం ధరలు తగ్గించడం ద్వారా ఆయన ఏ వ్యాపారికి లబ్ధి చేకూర్చాలని అనుకుంటున్నారు?’ అంటూ చురకలంటించారు.
సర్దార్ పటేల్ వల్లే ఆలయ పునర్నిర్మాణం
గిర్ సోమ్‌నాథ్ జిల్లాలోని సోమ్‌నాథ్ ఆలయాన్ని రాహుల్ బుధవారం సందర్శించగా, ఆ ఆలయ పునర్నిర్మాణాన్ని అప్పట్లో తొలి ప్రధాని నెహ్రూ అడ్డుకున్నారని మోదీ ఆరోపించారు. మహ్మద్ గజినీ సుల్తాన్ ఆలయాన్ని ధ్వంసం చేయగా దేశ తొలి హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చొరవ వల్లే పునర్నిర్మాణం పూర్తయిందన్నారు. మరోవైపు సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన సమయంలో తాను హిందువును కాదంటూ రాహుల్ రిజిస్టర్‌లో పేర్కొన్నారంటూ కొత్త వివాదం పుట్టుకొచ్చింది. రాహుల్ హిందువే ననీ, ఇంకా కచ్చితంగా చెప్పాలంటే బ్రాహ్మణుడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే ఇదంతా బీజేపీ కుట్ర అని కాంగ్రెస్ మండిపడింది.
నేను శివ భక్తుణ్ని: రాహుల్
జునాగఢ్ జిల్లాలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాట్లాడుతూ తాను శివభక్తుడినని స్పష్టం చేశారు. అక్కడ ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో మోదీ మౌనం వహిస్తుండటాన్ని ప్రశ్నించారు. ఈ ఒప్పందానికి సంబంధించి తాను మోదీకి మూడు ప్రశ్నలు వేశాననీ, ఆయన ఒక్కదానికీ సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇందిర ఇలా ముక్కు మూసుకున్నారు
మోర్బీలో 1979లో సంభవించిన మచ్చు ఆనకట్ట వరద విషాదాన్ని మోదీ తన ప్రసంగంలో గుర్తు చేశారు. అప్పుడు తాను ఇక్కడ ఆరెస్సెస్, జన్‌సంఘ్‌ల కార్యకర్తగా సహాయ కార్యక్రమాలు చేపట్టాననీ, నాటి ప్రధాని ఇందిరా గాంధీ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారని మోదీ చెప్పారు. ‘ఇందిరా గాంధీ ఇక్కడకు రావడం నాకు గుర్తుంది.
మరుసటి రోజు ఓ స్థానిక పత్రిక ఇందిర పర్యటనకు సంబంధించిన ఫొటోను మొదటి పేజీలో ప్రచురించింది. అందులో ఇందిర దుర్వాసన దరిచేరకుండా కర్చీఫ్‌తో ముక్కు మూసుకున్నారు. ఆ ఫొటో కిందే మరో ఫొటో ఉంది. అందులో ఆరెస్సెస్ కార్యకర్తలు మృతదేహాలను తరలిస్తున్నారు’ అని మోదీ వివరించారు. కష్టకాలంలో సహాయం చేసిన వారిని మీరు గుర్తుంచుకోవాలి అంటూ తమ పార్టీకే ఓట్లేయమని ప్రజలను మోదీ పరోక్షంగా కోరారు.


