దళిత శక్తి రాజకీయ శక్తిగా మారాలి 

MRPS Vangapally Srinivas Cycle Yatra Completed - Sakshi

బీసీ వర్గాలతో కలసి అధికారం చేపట్టాలి: గద్దర్‌ 

పేదలకు విద్య, వైద్యం ఉచితంగా అందజేయాలి 

ముగిసిన వంగపల్లి సైకిల్‌ యాత్ర.. సరూర్‌నగర్‌లో బహిరంగ సభ 

సాక్షి, హైదరాబాద్‌ : దళిత శక్తి రాజకీయ శక్తిగా మారి బీసీ వర్గాలను కలుపుకుని రాబోయే రోజుల్లో అధికారం చేపట్టాలని ప్రజా గాయకుడు గద్దర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల బతుకులు మారాలంటే విద్య, వైద్యం ఉచితంగా అందచేయాలన్నారు. జనం వీటి కోసమే రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగాలు చేసే వారు కూడా తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్‌ వెల్ఫేర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 25న ఖమ్మం జిల్లా నుంచి చేపట్టిన సైకిల్‌ యాత్ర ముగింపు బహిరంగ సభ గురువారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగింది.

ఇందులో గద్దర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ ఉప కులాల బతుకులు మారలేదని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు డబ్బు బ్యాంక్‌లో జమ చేయాలి. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టి ఇవ్వనందుకు వాటి కిరాయిలను ప్రభుత్వమే బ్యాంక్‌ అకౌంట్‌లో వేయాలి. మాల మాదిగలు కలసి ఉండాలి. ఇరువర్గాల మధ్య నేను వారధిగా ఉంటా. దళితులంతా ఐక్య రాజకీయ శక్తిగా మారాలి’’అని అన్నారు. రాబోయే సర్పంచ్, సార్వత్రిక ఎన్నికల్లో పల్లెల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. 

అక్షరంతోనే జాతి మనుగడ 
అణగారిన బతుకులు మారాలని, మాదిగ ఉప కులాలను అక్షర చైతన్యం వైపు నడిపించాలన్న బాధ్యతతో సైకిల్‌ యాత్ర చేపట్టినట్లు వంగపల్లి శ్రీనివాస్‌ అన్నారు. అక్షరాలే జాతి మనుగడకు మూలమని, బతుకులు మారాలంటే విద్య వైపు మళ్లాలని అన్నారు. దళిత వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, చదువుల్లో రాణించాలన్నా ప్రత్యేక సోషల్‌ వెల్ఫేర్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో మాదిరే ప్రత్యేక రాష్ట్రంలోనూ దళితుల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు. ప్రైవేట్‌ యూనివర్సిటీల వల్ల పేద విద్యార్థులు చదువుకునే హక్కు కోల్పోతారని, ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీలపై సమగ్ర సర్వే జరిపించాలని, డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పింఛన్‌ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు.

తమ సమస్యలు పరిష్కరిస్తేనే బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటు చైతన్యంతో రాజకీయ శక్తిగా సత్తా చాటుతామని చెప్పారు. పేద వర్గాలకు చదువును దూరం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్‌ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని ఎమ్మార్పీస్‌ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌ ఆరోపించారు. త్వరలోనే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో దళితుల రాజ్యాంగ అధికార బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాట్లాడుతూ.. సీఎం గతంలో డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పెన్షన్‌ ఇస్తామని చెప్పినా ఇంత వరకు దాని ఊసే లేదన్నారు. సభలో మోచి సంఘం రాష్ట్ర నాయకులు డా.రాజమౌళిచారి, చింతల మల్లికార్జున్‌ గౌడ్, బెడగ సంఘం నేతలు చింతల మల్లికార్జున్, సండ్ర వెంకటయ్య, హోళియ, దాసరి నాయకులు వీరేశం, హనుమంతు, సంఘం మహిళ విభాగం జాతీయ అధ్యక్షులు అందె రుక్కమ్మ, రాష్ట్ర అధ్యక్షులు పిడుగు మంజుల, మామిడి రాంచందర్, జి.డి.నర్సింహ, కొల్లూరి వెంకట్, చందు, కొంగరి శంకర్, అశోక్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top