
సాక్షి, హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్ణాటకలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... బీజేపీపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదో విధంగా అన్ని రాష్ట్రాలలోనూ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు.
అధికారమే పరమావధిగా అక్రమ మార్గం గుండా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని భట్టి ఆరోపించారు. కర్ణాటకలో మెజారిటీ కలిగిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కాకుండా.. సాధారణ మెజారిటీ లేకపోయినా.. అతి పెద్ద పార్టీ పేరుతో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం అత్యంత హేయనీయమన్నారు. గవర్నర్ తీసుకున్న చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడంతో పాటు.. ఖూనీ చేసినట్లు ఉన్నాయని విమర్శించారు.
లౌకికవాద ప్రభుత్వాలతోనే దేశ సమగ్రతకు హానీ జరగకుండా ఉంటుందనే భావనతో జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిందని తెలిపారు. వారంరోజుల సమయంలో ఎమ్మెల్యేలను భయపెట్టి, లేదా కొనుగోలు చేసి, వారిని ప్రలోభపెట్టి తమవైపుకు తిప్పుకునే ఆలోచనకు ఇది నిదర్శమని అన్నారు. కర్ణాటకలో రేపు శాసనసభలో జరిగే బలపరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు విజయం సాధిస్తాయనే ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక వెళ్లి జేడీఎస్‌కు ఓటేయమని ప్రజలకు పిలుపు ఇచ్చిన కేసీఆర్ తాజా పరిణామాలపై ఎందుకు స్పందించడం లేదని విమర్శించారు. కేసీఆర్ మద్దతు ప్రకటించిన పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఆయన చెప్పిన వ్యక్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందన్నారు.