అయోధ్య తీర్పు: అద్వానీకి జైలుశిక్ష తప్పదా?

LK Advani Face Babri Masjid Demolition CBI Case - Sakshi

మసీదు కూల్చివేతపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

బాబ్రీ కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న అద్వానీ

తుది దశకు చేరుకున్న విచారణ

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా సాగుతున్న అయోధ్య రామమందిర-బాబ్రీ మసీదు వివాదాస్పద భూ వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించడంతో దేశ వ్యాప్తంగా హిందూసంఘాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య నలుగుతూ వస్తున్న వివాదానికి ముగింపు పలికి.. న్యాయ వ్యవస్థ సరికొత్త చరిత్రను సృష్టించిందని సంబరపడుతున్నారు. అయోధ్య వివాదంపై తీర్పును వెలువరిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం చేసిన వాఖ్యలు పలువురి  గుండెల్లో రైలు పరిగెత్తుస్తున్నాయి. ‘1992 డిసెంబర్‌ 6న కరసేవకులు వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఇది ముమ్మాటికి చట్ట విరుద్ధం. మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్‌ మూలాలను దెబ్బతీయడానికి ‍ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది’ అంటూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టులో 27 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీబీఐ కేసుపై పడింది. బాబ్రీ మసీదు కూల్చివేశారన్న ఆరోపణలతో 40 మంది సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత మరికొంత మందిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. (‘అయోధ్య’ రామయ్యదే..!)

సీబీఐ కేసులో అద్వానీ..
1992 డిసెంబర్‌ 6న సాయంత్రం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో 198/92 నెంబర్‌తో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. వీరిలో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, అశోక్‌ సింఘాల్‌, మురళీ మనోహర్‌ జోషీ, ఉమాభారతి, వినయ్‌ కటియార్‌, గిరిరాజ్‌ కిషోర్‌, నాటి యూపీ సీఎం కళ్యాణ్‌సింగ్‌ కూడా ఉన్నారు. అయితే 2003 సెప్టెంబర్‌ 19న రాయ్‌బరేలీలోని స్పెషల్‌ మెడిస్ట్రేట్‌ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. అయితే దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2017లో తీర్పును వెలువరిస్తూ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్వానీ, జోషీ, ఉప భారతి, కళ్యాణ్‌ సింగ్‌లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే తాజాగా అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తూ.. మసీదు కూల్చివేతను చట్టవిరుద్ధమైనదిగా వర్ణించింది. ఈ నేపథ్యంలో కేసును విచారిస్తున్న సీబీఐ విచారణను మరింత వేగవంతం చేసింది. దీనిపై పూర్తి నివేదికను త్వరలోనే సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

దీంతో మసీదు కూల్చివేత కేసు ఎదుర్కొంటున్న అద్వానీ మరోసారి సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందని పలువురు పరిశీలకు అభిప్రాయపడుతున్నారు. కేసు విచారణ తుది దశతో ఉన్న నేపథ్యంలో.. నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అద్వానీతో పాటు మురళీ మనోహర్‌ జోషీ, కళ్యాణ్‌ సింగ్‌, ఉమ భారతీ కూడా విచారణను ఎదుర్కొన్నారు. దీనిలో భాగంగానే మొన్నటి వరకు రాజస్తాన్‌ గవర్నర్‌గా ఉన్న కళ్యాణ్‌ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా తీర్పు నేపథ్యంలో విచారణను సీబీఐ ఎలా డీల్‌ చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

లిబర్‌హాన్‌ కమిషన్‌..
అయితే 1992 డిసెంబర్‌ 6న జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటనపై విచారణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం లిబర్‌హాన్‌ కమిషన్‌ను అదేనెల 16న ఏర్పాటు చేసింది. హర్యానా హైకోర్టులో సిట్టింగ్‌ జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్‌ ఎంఎస్‌ లిబర్‌హాన్‌ సారథ్యంలో ఏర్పాటయిన ఈ కమిషన్‌ను... మసీదు కూల్చివేతకు దారితీసిన ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. కమిషన్‌కు తుది నివేదిక ఇవ్వటానికి ఏకంగా 16 ఏళ్ల ఆరు నెలలు పట్టింది. చివరకు 2009 జూన్‌ 30న కమిషన్‌ తన 998 పేజీల నివేదికను కేంద్రానికి సమర్పించింది. విచారణలో భాగంగా కమిషన్‌ పలువురు అగ్రశ్రేణి రాజకీయ ప్రముఖులను విచారించింది.

కమిషన్‌ ఏం చెప్పిందంటే...
ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీతోపాటు బీజేపీకి, హిందూసంస్థలకు చెందిన దాదాపు 68 మందిని ఈ నివేదిక అభిశంసించింది. అప్పటి యూపీ ముఖ్యమంత్రి కళ్యాణ్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని దుయ్యబట్టింది. ఇలా మత ఆధారిత రాజకీయాలు జరిపే ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేయాలని కూడా కమిషన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాజ్‌పేయి, అద్వానీ లాంటి వాళ్లను మిధ్యా ఉదారవాదులుగా అభివర్ణించింది. వీరంతా మూకుమ్ముడిగా బాబ్రీ కూల్చివేతకు ప్రత్యక్ష, పరోక్ష బాధ్యులని స్పష్టంచేసింది. వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. బాబ్రీ ఘటనలో అప్పటి కేంద్ర ప్రభుత్వానిది ఏమాత్రం దోషం లేదని కూడా కమిషన్‌ తెలిపింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top