‘పవన్‌ కల్యాణ్‌వి పనికిమాలిన రాజకీయాలు’

kottu satyanarayana Slams Pawan Kalyan - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : రాజధానికి పేరుతో చంద్రబాబు నాయుడు భారీ భూకుంభకోణానికి పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, తన బంధువులకు, తన పార్టీ కార్యకర్తలకు అమరావతి భూములు ముట్టజెప్పారని విమర్శించారు. గురువారం  తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మూడు నైసర్గిక ప్రాంతాలు కావడంతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మూడు ప్రాంతాలు అభివృద్ధి చెయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తప్పుడు ప్రచారం చేస్తూ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలును రాజధాని చేస్తామని చెప్పిన పవన్‌ కల్యాణ్‌.. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దానిని జూడిషియల్‌ క్యాపిటల్‌ అంటే ఎందుకు ఆందోళన చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పెంపుడు చిలుకలా పవన్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. 

దిశ చట్టం దేశానికే తలమానికం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం మహిళలకు మరింత భద్రతను పెంచే విధంగా ఉందని ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రశంసించారు. దిశ చట్టం యావత్తు దేశానికే తలమానికంగా ఉందన్నారు. మహిళ పట్ల ఏదైనా దుర్మార్గమైన సంఘటన జరిగితే..21రోజుల్లోనే కేసును పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. దిశ చట్టం తెచ్చి సీఎం జగన్‌ మహిళా లోకానికి అండగా నిలిచారన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి చరిత్ర సృష్టించారని కొనియాడారు. ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడానికి చిరుధాన్యాల బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందించాలని ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. కాపు ఉద్యమంలో పాల్గొన్న ఆందోళనకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఎత్తివేయడం శుభపరిణామం అని ఎమ్మెల్యే అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top