‘టీఎస్‌’ కోడ్‌ ‘టీజీ’గా మారుస్తాం! 

Komatireddy Venkat Reddy comments on Congress Manifesto - Sakshi

     నవంబర్‌ 1న మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు

     మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పింఛన్‌లపై చర్చిస్తున్నాం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పరిపాలన, విధానపరమైన, సం స్థాగతపరంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైనా కాంగ్రెస్‌ మేధోమథనం చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ శనివారం గాంధీభవన్‌లో భేటీయై వివిధ అంశాలపై చర్చించింది. కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహతోపాటు కో చైర్మన్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కన్వీనర్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సభ్యు లు మల్‌రెడ్డి రంగారెడ్డి, మానవతారాయ్, కురువ విజయ్‌కుమార్, ఇందిరా శోభన్, సుధాకర్‌యాదవ్‌లు వివిధ సంఘా లు, మేధావులతో పలు అంశాలపై  చర్చించారు.

తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ కోడ్‌ ‘టీఎస్‌’అంశాన్ని చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పదానికి దగ్గరగా ఉండేలా ‘టీఎస్‌’ను ప్రవేశపెట్టారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దాన్ని ‘టీజీ’గా మార్పు చేసేలా నిర్ణయించారు. దీంతోపాటు తెలంగాణ రాజముద్రలోనూ మార్పులు చేయాలని, తెలంగాణ  కొత్త రాజముద్రను ప్రకటించాలనే అంశంపైనా చర్చించారు. దీంతో పాటే అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’గేయాన్ని రాష్ట్ర గేయంగా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు.  ఈ అన్ని అంశాలపై లోతుగా మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో చర్చించేందుకు ప్రత్యేక కమిటీ వేయాలని మేనిఫెస్టో కమిటీ నిర్ణయం చేసింది. ఇక వీటితోపాటే మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లకు పింఛన్లు ఇచ్చే అంశం ప్రస్తావనకు వచ్చింది. బీపీఎల్‌ కుటుంబాలకు చెందిన వారెవరైనా చనిపోతే, వారికి ఆర్థిక సాయం కింద రూ.5వేలు అందించే అంశాన్ని మేని ఫెస్టోలో చేరుస్తామని దామోదర రాజనర్సింహ గాంధీభవన్‌లో మీడియాకు వెల్లడించారు.  నవంబర్‌ 1న పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయాలని భావిస్తున్నామని తెలిపారు.  

పింఛన్‌లపై యోచిస్తున్నాం: కోమటిరెడ్డి  
మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన మాదిరే మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు పింఛన్‌ అంశాన్ని చర్చిస్తున్నామని కోమటిరెడ్డి తెలిపారు. ప్రతి జిల్లా హెడ్‌ క్వార్టర్‌లో ఓ మెడికల్‌ కాలేజీ, అమరుల త్యాగాల గుర్తుగా స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top