మీ బతుకు చెడ.. చంద్రబాబుతో పొత్తా!

KCR Speech At Nizamabad Sabha - Sakshi

రూ. 500 కోట్లు, 3 హెలికాప్టర్లు ఇస్తానంటే కాళ్లు మొక్కుతరా?

కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు

తెలంగాణ కరెంట్‌ లాక్కుని రాక్షసానందం పొందిన రాక్షసుడు

ఎన్‌కౌంటర్ల పేరుతో ఉద్యమకారుల ప్రాణాలు తీసిన తెలంగాణ ద్రోహి

అలాంటి వ్యక్తితో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలి

విజయవాడ, అమరావతికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని పెడతరా?

తెలంగాణ ప్రజలే నిర్ణయించుకోవాలన్న గులాబీ దళపతి

∙కాంగ్రెస్‌–టీడీపీ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలని పిలుపు

ఉత్తమ్, జానా, జైపాల్‌పైనా తీవ్రస్థాయిలో ధ్వజం

రాష్ట్రంలో బీజేపీ యాడున్నదో తెలియదని ఎద్దేవా

మోదీ, అమిత్‌షా ‘రూ. 15 లక్షల జమ’ హామీ ఏమైందని నిలదీత

నిజామాబాద్‌ భారీ బహిరంగ సభలో ప్రసంగం

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ‘‘చంద్రబాబుతో పొత్తా.. థూ మీ బతుకులు చెడా.. అడుక్కుంటే మేమే నాలుగు సీట్లు పడేస్తుంటిమి కదా. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం ఇస్తరా? విజయవాడ, అమరావతికి గులాంగిరి చేస్తరా? ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా? సిగ్గు పోతది. వందల మంది చచ్చిపోయి తెలంగాణ సాధించిన గడ్డ ఇది. మూడు హెలికాప్టర్లు, రూ. 500 కోట్లిస్తే కాళ్లు మొక్కి దండం పెట్టి మళ్లా మా నెత్తిమీద తెచ్చి పెడతరట. తెలంగాణ కోసం ఇంత మంది చచ్చిపోయింది ఇందుకేనా?’’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. నిజామాబాద్‌ గిరిరాజ్‌ కళాశాల మైదానంలో బుధవారం టీఆర్‌ఎస్‌ భారీ ఎన్నికల ప్రచార బహిరంగ సభను నిర్వహించింది. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఎంపీ కవిత, తాజా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్‌ గుప్తా, హన్మంత్‌ షిండే, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి ప్రసంగించారు. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటి ల్, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తుల ఉమ, తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. 

మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారమా? 
‘‘తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. సీలేరు పవర్‌ ప్రాజెక్టు తీసుకొని తెలంగాణకు కరెంట్‌ రాకుండా అడ్డుపడి రాక్షసానందం పొందిన రాక్షసుడు. గోదావరి, కృష్ణా నదులపై కడుతున్న ప్రాజెక్టులు ఆపాలని 36 లేఖలు రాశాడు. అలాంటి దుర్మార్గుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటారా? తెలంగాణను గుండు కొట్టి నాశనం చేసిన వాడితోనా.. ఎన్‌కౌంటర్ల పేరుతో తెలంగాణ ఉద్యమకారుల ప్రాణాలు తీసిన తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తా? రాష్ట్రంలో రాజకీయాలను అస్థిరపరిచేందుకు ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్‌ నేతలకు సిగ్గుండాలి. తెలంగాణ పెద్దలు, మేధావులకు మనవి చేస్తున్నా. సిగ్గు పోతది.. మళ్లీ ఆంధ్రోళ్లకు అధికారం అప్పగిస్తరా.. నవ్వేటోడి ముందు జారిపడతరా.. విజయవాడ, అమరావతికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతరా? తెలంగాణ ప్రజలే నిర్ణయించాలి. కాంగ్రెసోళ్ల నిర్ణయం ఇక్కడ ఏమైనా ఉంటుందా? అంతా ఢిల్లీలోనే. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం. ఢిల్లీకి గులాంగిరీ చేయొద్దని చెబుతున్నా. నిజామాబాద్‌ జిల్లా ప్రజలు ఈ దుర్మార్గులకు బుద్ధి చెప్పాలి. మళ్లీ 9 స్థానాలను టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టాలి. టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి’’అని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్‌లో ఆరు గ్రూపులు... 
కాంగ్రెస్‌ తీరును కూడా కేసీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో నిర్ణయం తీసుకునే శక్తి ఢిల్లీకే (పార్టీ అధిష్టానం) ఉందన్న కేసీఆర్‌.. ఉచ్చ పోవాలన్నా ఢిల్లీకే పోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్‌లో ఆరు గ్రూపులుంటాయి. ఢిల్లీలో గాడ్‌ఫాదర్‌ ఉంటరు. ఆనాడు అనేక పోరాటాలు చేసి ఢిల్లీ పెద్దలను నిలదీసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు మళ్లీ ఢిల్లీకి గులాములు కావద్దు. గులాములకు బుద్ధి చెప్పండి’’అని కేసీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘1956లో తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో కలిపింది కూడా కాంగ్రెస్‌ నేతలే. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసింది కూడా కాంగ్రెస్సే. రైతు ఆత్మహత్యలకు, కరెంట్, వ్యవసాయ సంక్షోభానికి కారణం కూడా ఆ పార్టీయే. అలాంటి కాంగ్రెస్‌ ఏ ముఖం పెట్టుకుని రాష్ట్ర ప్రజలను ఓట్లు అడుగుతుంది’’అని కేసీఆర్‌ నిలదీశారు. ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే ప్రగతి ఆగకూడదని ప్రజల తీర్పు కోరదామని ఎన్నికలకు వెళితే కాంగ్రెస్‌ నాయకులకు చీకట్లు కమ్మాయని, ఎన్నికలంటే గిలగిలా కొట్టుకుంటూ హైదరాబాద్‌లో గోడలు గిల్లుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు పదవులు ఎడమ కాలి చెప్పుతో సమానమని, రాష్ట్రాభివృద్ధి కోసమే 9 నెలల అధికారాన్ని వదులుకొని ముందస్తు ఎన్నికలకు సిద్ధపడ్డామని కేసీఆర్‌ తేల్చి చెప్పారు.

ఉత్తమ్‌.. నువ్వు మగాడివైతే..
పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డిలపైనా కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టును 1974లోనే కాంగ్రెస్‌ నిర్మించాలని అనుకున్నట్లుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేసుకున్నారు.  అయ్యకు.. అవ్వకు పుడితే.. మగాడివైతే.. ఆ ఒప్పందం పత్రాలతో రావాలని సవాల్‌ చేసిన. ఆయన రాలేదు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్‌ ఇస్తే టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుని ప్రచారం చేస్తానన్న జానారెడ్డి మాట మార్చిండు. ఏనాడూ పదవిని వదలని జైపాల్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తడు’’అంటూ మండిపడ్డారు. ‘‘నన్ను బట్టేబాజ్‌ అంటూ తిడుతున్నరు.. నా ప్రసంగంలో ఊపు తగ్గిందని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని బట్టేబాజ్‌ అని తిట్టొచ్చా? ఉద్యమంలో మాట్లాడింది వేరు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బాధ్యతతో మాట్లాడుతున్నది వేరు. తిక్క రేగి నేను నోరు తెరిస్తే తెల్లారే వరకు తిట్టగలుగుతా. కానీ చిల్లరగాళ్లతో పంచాయితీ లేదు’’అని గులాబీ బాస్‌ పేర్కొన్నారు. 

తెలంగాణ సాధనలో నీ అయ్య పాత్ర ఉందా...? 
కాంగ్రెస్‌లో రెండు రకాల గులాంలు ఉన్నారన్న కేసీఆర్‌... ఆ పార్టీ జాతీయ నాయకుడు గులాం నబీ ఆజాద్‌పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర సాధనలో టీఆర్‌ఎస్‌ పాత్ర లేదని గులాం నబీ ఆజాద్‌ అంటున్నడు. కేసీఆర్‌ పాత్ర లేకపోతే నీ అయ్య పాత్ర ఉందా? కాంగ్రెస్‌లో హామీలు ఇచ్చేది ఎవరో.. గెలిస్తే సీఎం సీటు మీద ఎక్కేవారెవరో తెలియదు. కనీసం అభ్యర్థులకు టికెట్‌ ఇచ్చే ముఖం కూడా రాష్ట్ర నాయకులకు లేదు. ఉచ్చ పోయడానికి కూడా ఢిల్లీకి పోవాలె. ఈ కాంగ్రెస్‌ నేతలవన్నీ సొల్లు పురాణాలు, అసత్య ప్రచారాలే’’అని కేసీఆర్‌ విమర్శించారు. 

మీ ఇంటి కిరాయే ప్రజలు కడతరు...
బీజేపీపైనా టీఆర్‌ఎస్‌ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఎక్కడ ఉందో తెలియదని ఎద్దేవా చేశారు. ‘‘ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇంటి కిరాయి కడతామని అంటున్నరు. నల్లధనాన్ని తెచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హామీనిచ్చారు. ఆ రూ. 15 లక్షలు జమ చేస్తే బీజేపీ నేతల ఇండ్లకు ప్రజలే కిరాయి కడతరు’’అంటూ చురకలంటించారు. 

ప్రతిపక్షాల హామీలు హాస్యాస్పదం..
ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు ఇస్తున్న హామీలు హాస్యాస్పదంగా ఉన్నాయని కేసీఆర్‌ విమర్శించారు. ‘‘అర్రస్‌ పాట పాడినట్లే టీఆర్‌ఎస్‌ పింఛను రూ. వెయ్యి ఇస్తామంటే కాంగ్రెస్‌ వాళ్లు రూ. 2 వేలు ఇస్తామంటున్నరు. స్నానం చేస్తే వీపు అందకపోతే గోకుతామంటున్నరు. గీసినోడిదే గుండు, దున్నినోడిదే భూమి.. ఇలా చెప్పే వాడికి లేకపోతే వినే వాడికైనా ఇజ్జత్‌ ఉండాలి’’అంటూ తనదైన శైలిలో మండిపడ్డారు. మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  

ఊ అంటే కేసు.. ఉచ్చబోస్తే కేసు..
కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాష్ట్రంలో జరుగు తున్న ప్రగతిని అడ్డుకుంటున్నారన్న కేసీఆర్‌.. కాళేశ్వరం ప్రాజెక్టుపై 196 కేసులు వేశారని మండిç ³డ్డారు. ఊ.. అంటే కేసు.. ఉచ్చబోస్తే కూడా కేసు పెట్టారని నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర అడ్డగోలుగా ప్రాజెక్టులు కడుతుంటే నాడు అధి కారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. టీ కాంగ్రెస్‌ నేతలు 60 ఏళ్లు చేతులు ముడుచుకొని కూర్చున్నారని, గులాబీ జెండా ఎగిరిన తరువాతే తెలంగాణ ఉద్య మం ఉధృతమైందన్నారు. ఉమ్మడి ఏపీలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనని అంటే కాంగ్రెస్‌ సన్నాసులు మంత్రి పదవుల్లో ఉండి ఒక్కరూ నోరు తెరవలేదని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ది ప్రజల నోట్లో మట్టికొట్టే ఎజెండా అని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెబుతున్నారని, తాము అధికారంలోకి వచ్చాకే కాళేశ్వరం నిర్మాణం కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నామన్నారు. తొలి విడత రైతు బంధు చెక్కులను రైతులకు పంపిణీ చేశామని, రెండో విడత చెక్కులను పంపిణీ చేస్తా మంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు సిగ్గుండాలని, అలాంటి దుర్మార్గుల కు ఏ శిక్ష వేయాలో ప్రజలే ఆలోచించాలన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top