
సాక్షి, భీమవరం : పగిలిపోయే గ్లాసుకు, తుప్పు పట్టి పోయే సైకిల్‌కు ఓటు వేయవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ప్రజలను కోరారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లకు ఓటు వేస్తే నష్ట పోయేది ప్రజలేనన్నారు. భీమవరంలో ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు భయపడి చంద్రబాబు నాయుడు పద్దెనిమిది మంది పోలీసులను తీసుకుని ఏపీకి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. తనను చూస్తే కేసీఆర్ పారిపోతాడన్నారు.
కేసీఆర్ ముక్కు పిండేస్తానని, కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందని చెప్పారు. రాష్ట్రానికి నిధులు తేవాలంటే చంద్రబాబు, పవన్‌లతో సాధ్యం కాదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు తన ముందు నిలబడి అడుక్కున్నారన్నారు. జనసేన గురించి మాట్లాడుతూ.. గుండు గీయించుకునే కాపుకు ఓటేస్తారా?, గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని ప్రశ్నించారు. ‘పవన్, నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారు ఎలా ఇస్తారు? వాళ్లు ఒక్క రూపాయి అయినా తేగలరా? ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకుని కట్నంగా తీసుకొచ్చి ఇస్తారా?’ అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.