ఎన్నికలకు భయపడుతున్నట్టేనా?

Jagadish Reddy Fire on Congress - Sakshi

కాంగ్రెస్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి ఫైర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఉపఎన్నికలకు భయపడి శాసనసభ్యత్వం రద్దుపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోర్టుకు వెళ్తున్నారా అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో కలిసిన విలేకరులతో ఆయన గురువారం మాట్లాడుతూ ఇద్దరు శాసనసభ్యుల బహిష్కరణపై ప్రజాక్షేత్రానికే వెళ్తామన్న కాంగ్రెస్‌ నేతలు కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు భయపడటమంటే జానారెడ్డి ఓటమిని అంగీకరించినట్లేనన్నారు. ఉపఎన్నికల్లోనే గెలవలేని వాళ్ళు సాధారణ ఎన్నికల్లో ఇంకేమి గెలుస్తారని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుంటే సభలో బోర్‌ కొడుతుందని, 2019 ఎన్నికల తర్వాత శాసనసభలో ఉండేవి టీఆర్‌ఎస్, మజ్లిస్‌లేనని జోస్యం చెప్పారు. కొన్ని పార్టీలతో ఫ్రంట్‌ ఏర్పాటనేది సీఎం కేసీఆర్‌ ఉద్దేశం కాదని, దేశంలో గుణాత్మక మార్పు రావాలన్నదే ఆయన ప్రధాన ధ్యేయమని జగదీశ్‌రెడ్డి చెప్పారు. ప్రజల కనీస అవసరాలు, మౌలిక వసతులకోసం 70 ఏళ్ల భారతంలోనూ ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏమిటన్నదే ఆయన ప్రశ్న అని చెప్పారు. తెలంగాణ ప్రజలను ఉద్యమంలో ఏకతాటి పైకి తెచ్చినట్టే దేశ ప్రజలను ఐక్యంగా నడిపించే శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top