బీజేపీలో మొదలైన రచ్చ

Internal Clashes Between BJP Party Leaders In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: బీజేపీలో రచ్చ మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌పై ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి తిరుగుబావుటా ఎగురవేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో 49 వార్డులు ఉండగా బీజేపీ 11 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఆదిలాబాద్‌లో మెజార్టీ స్థానాలు గెలుపొందే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ జిల్లా నాయకులు టీఆర్‌ఎస్‌తో కుమ్ముక్కై పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్నది ఆరోపణ.

అంతకు ముందు జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా కోర్‌ కమిటీలో నిర్ణయం లేకుండానే టికెట్ల పంపిణీ జరిగిందని అంటున్నారు. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా, మండల కమిటీ నాయకులు ముందుకు వచ్చామని పార్టీలోని కొందరు చెబుతుండగా, పాయల శంకర్‌ అధ్యక్షతనే జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయని, మున్సిపల్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో 11 వార్డుల్లో కౌన్సిలర్లు గెలుపొందారని, అలాంటప్పుడు ఆరోపణలు అసమంజసమని పార్టీకి చెందిన మరికొంత మంది నేతలు జిల్లా అధ్యక్షుడికి వంత పాడుతున్నారు. అంతేకాకుండా త్వరలో జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతోనే వ్యూహాత్మకంగా ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి.            

ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు జరుగుతున్నాయి
జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కోర్‌ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్‌ల కేటాయింపు జరుగుతోంది. ఏకపక్షంగా అందజేస్తున్నారు. ఏక వ్యక్తి పాలన.. పార్టీ ఆఫీసు నామమాత్రం.. సమష్టి నిర్ణయాలు లేవు. రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడి వ్యవహారంపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టీపట్టనట్లు వ్యవహారిస్తున్నారని, రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యనేత అండదండలతోనే జిల్లా నాయకుడు పార్టీ అంటే నేనే అనే విధంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌పై పార్టీ సీనియర్‌ నేత, జెడ్పీమాజీ చైర్‌పర్సన్‌ సుహాసిని రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు.

నాకు అర్థం కావడం లేదు
నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనిపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. ఆదిలాబాద్‌ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నాగురించి తెలుసు. 
– పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top