నాది పేదల కులం

I Belong To Caste Of The Poor - Sakshi

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

సంకీర్ణాలతో నిఘా వ్యవస్థలు బలహీనం

దుష్ట కూటమికి ఓటేయకండని ప్రజలకు పిలుపు

సోనెభద్ర: దేశంలోని నిరుపేద ప్రజలందరిది ఏ కులమో అదే తన కులమని ప్రధాని మోదీ తెలిపారు. నిఘా వ్యవస్థలను బలహీన పరిచే దుష్ట కూటమి సంకీర్ణ ప్రభుత్వాలకు అధికారం ఇవ్వరాదని ఆయన కోరారు. శనివారం ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని సోనెభద్ర, ఘాజీపూర్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ కులస్తుడంటూ బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేయడంపై ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘వారంతా కొత్తగా నా కులం విషయం తెరపైకి తెచ్చారు. పేదలందరిదీ ఏ కులమో, మోదీది కూడా అదే కులమని వారికి చెప్పాలనుకుంటున్నా’అని అంటూ పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వివరించారు.

దుష్ట కూటమితో దేశం బలహీనం
గతంలో సమాజ్‌వాదీ పార్టీతో కూడిన సంకీర్ణం హయాంలో నిఘా వ్యవస్థలు నష్టపోయాయన్న ప్రధాని..‘దుష్టకూటమి ప్రభుత్వ హయాంలో దేశ భద్రత ప్రమాదంలో పడింది. నిఘా వ్యవస్థలు బలహీనపడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వాల తప్పిదాలను సరిదిద్దే చర్యల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో సరిగ్గా ఇదే రోజు పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్ష జరిపింది’అని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ సారథ్యంలోని మన్మోహన్‌ సర్కారును బలహీన, రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వంగా ప్రధాని మోదీ అభివర్ణించారు.

ఈ ప్రభుత్వం వల్ల దేశానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇలాంటి దుష్టకూటమి ప్రభుత్వాలకు మద్దతు పలకవద్దని ఆయన ప్రజలను కోరారు. వారంతా కలిసి గతంలో ఉత్తరప్రదేశ్‌ను ధ్వంసం చేశారు. ఇప్పుడు తమను తాము నాశనం కాకుండా కాపాడుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) ఏకమయ్యాయి’అని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో వైమానిక బలగాలు సరిహద్దులు దాటి బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపాయని తెలిపారు.

కాంగ్రెస్‌ది అహంకారం
కాంగ్రెస్‌ హయాంలో 1984లో సిక్కుల ఊచకోతపై ఆ పార్టీ నేత శామ్‌ పిట్రోడా ‘అప్పుడు అలా జరిగింది, అయితే ఏంటి?’ అనడంపై ప్రధాని స్పందిస్తూ...‘ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని, మనస్తత్వాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఎన్ని కుంభకోణాలు జరిగినా వారిలో పశ్చాత్తాపం లేదు. కాంగ్రెస్‌ నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు.

దళిత మహిళకు కాంగ్రెస్‌ ‘అన్యాయం’
రాజస్తాన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విషయం బయటకు పొక్కకుండా అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొక్కిపెడుతోందని ప్రధాని ఆరోపించారు. ఏప్రిల్‌ 26వ తేదీన ఈ ఘటన జరిగిందంటూ 30వ తేదీన బాధితురాలి భర్త ఫిర్యాదు చేసినప్పటికీ తీరిగ్గా మే 7వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్నందునే ఇంత జాప్యం చేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే న్యాయ్‌ పథకం అమలు చేస్తామంటూ కాంగ్రెస్‌ చెప్పుకుంటుండగా..అక్కడి ఆ పార్టీ ప్రభుత్వం మాత్రం దళిత మహిళకు అన్యాయం చేసిందని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top