మైకులు కట్‌..

The Huzurnagar Bypoll Campaign Came To An End - Sakshi

హుజూర్‌నగర్‌ నుంచి ప్రచార బృందాల తిరుగుముఖం

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం గడువు శనివారం సాయంత్రం ముగిసింది. సుమారు 20 రోజులుగా నియోజకవర్గంలో పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయా పార్టీల నేతలు తిరుగుముఖం పట్టారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ నడుమ ప్రధాన పోటీ నెలకొంది. బీజేపీ, టీడీపీతో పాటు పలు పార్టీలు, స్వతంత్రులు పోటీ పడుతున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తుండటంతో.. ప్రచార పర్వంలో ఆయనే అంతా తానై వ్యవహరించారు. అలాగే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక టీఆర్‌ఎస్‌ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని 70 మంది ఇన్‌చార్జీలు శానంపూడి సైదిరెడ్డి పక్షాన ప్రచార, సమన్వయ బాధ్యతలు నిర్వర్తించారు.

మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌ నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రచారం నిర్వహించారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యత అప్పగించినా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఒక్కరోజు మాత్రమే పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 17న హుజూర్‌నగర్‌ బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉండగా, వర్షం మూలంగా చివరి నిమిషంలో రద్దయింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఈ నెల 4న నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రోడ్‌షో నిర్వహించారు. 

బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌.. 
రాష్ట్రంలో బలోపేతమయ్యేందుకు శ్రమిస్తున్న బీజేపీ కూడా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంది. పార్టీ అభ్యర్థి కోట రామారావు తరఫున కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రచారం నిర్వహించారు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు మూలంగా పోటీకి దూరంగా ఉన్న తెలుగుదేశం కూడా ప్రస్తుత ఉప ఎన్నికలో పోటీ చేస్తుండగా,నందమూరి హరికృష్ణ కుమార్తె చుండ్రు సుహాసిని ప్రచారంలో పాల్గొన్నారు.28 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో..ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో రెండేసి బ్యాలెట్‌ యూనిట్లను వినియోగించనున్నారు. ఇదిలాఉంటే సోమవారం జరిగే ఉప ఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఉప ఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top