
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి.
సాక్షి, మండపేట : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యల కోసం నిరంతర పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. రాష్ట్రం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాలు, ప్రజల సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన చూసి పలువురు నేతలు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహిధర్‌రెడ్డి వైఎస్సార్పీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజక వర్గంలో బుధవారం జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కందుకూరు నియోజక వర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చిన మహిధర్ రెడ్డిని వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మహిధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరైనా సరనే వైఎస్ జగన్‌ను బలపరిచే పరిస్థితులున్నాయన్నారు. రాష్ట్రంలో మార్పును, జగన్ నాయకత్వాన్ని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను సంపూర్ణంగా నెరవేరుస్తానని జగన్ అంటున్నారని, ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడై వైఎస్సార్‌సీపీలో చేరినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కాకుండా తన అభివృద్దినే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితిలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.