సీట్లెందుకు రాలేదంటే..

Fighting between the BJP, the Congress and the JDs - Sakshi

ఐదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత లేదని ఎన్నికలకు ముందు అంచనాలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే 2013తో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు తాజా ఎన్నికల్లో 1.4 శాతం ఓట్లు ఎక్కువే వచ్చాయి. గత ఎన్నికల్లో 36.6 శాతం ఓట్లతో ఏకంగా 122 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయకేతనం ఎగరవేసింది. ఇప్పడు మాత్రం 38 శాతం ఓట్లను దక్కించుకున్నప్పటికీ కాంగ్రెస్‌ 78 సీట్లకే పరిమితమవాల్సి వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య త్రిముఖ పోరు నెలకొనడం, గత ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసిన యడ్యూరప్ప, శ్రీరాములు ఈసారి బీజేపీ గూటికి చేరుకోవడం వంటి కారణాలు కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బకొట్టాయి. 2013 ఎన్నికల్లో బీజేపీ, యడ్యూరప్ప, శ్రీరాములు విడివిడిగా పోటీ చేయ డంతో వారి ఓట్లు చీలిపోయాయి. అందరికీ కలిపి 32 శాతం ఓట్లు వచ్చాయి. కానీ ఈ ఎన్నికల్లో అందరూ కలిసిపోవడంతో 4 శాతం అధిక ఓట్లు సాధించడమేగాక, వాటిని సీట్లుగా మార్చుకోవడంలోనూ బీజేపీ విజయం సాధించింది. అతి తక్కువ ఓట్ల తేడాతో కూడా ఎలా విజయం సాధించాలని కమలనాథులు క్షేత్రస్థాయిలో చేసిన కసరత్తు ఫలించి బీజేపీకి ఓట్లు రాకపోయినా సీట్లయినా వచ్చేలా చేసింది.

బీజేపీతో పోల్చి చూస్తే కాంగ్రెస్‌కు పాత మైసూరు, హైదరాబాద్‌ కర్ణాటక, బాంబే కర్ణాటక ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు వచ్చాయి. కానీ మిగతా ప్రాంతాల్లో బీజేపీతో పోటీ పడలేక కాంగ్రెస్‌ చతికిలపడిపోయింది. ఇలా కాంగ్రెస్‌ మూడు ప్రాంతాల్లో అత్యధికంగా ఓట్లు సంపాదించడంతో గెలిచిన అభ్యర్థులు ఎక్కువ ఆధిక్యం పొందారు. కానీ బీజేపీ గెలిచిన స్థానాల్లో అభ్యర్థులకు వచ్చిన మెజార్టీ తక్కువగా ఉంది. ఎస్సీ అభ్యర్థులకు కేటాయించిన స్థానాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కే ఓటు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, సీట్లు గెలవడంలో వెనకపడిపోయింది.  లింగాయత్‌ల ప్రభావం ఉన్న స్థానాల్లో కూడా కాంగ్రెస్‌కు ఓట్లు వచ్చినా సీట్లు మాత్రం రాలేదు. ఇక జేడీఎస్‌ 2013 ఎన్నికల్లో 20.2 శాతం ఓట్లు సాధించింది. ఈ ఎన్నికలకు వచ్చేసరికి 18.3 శాతానికి తగ్గిపోయింది. కానీ కాంగ్రెస్‌తో పోల్చిచూస్తే ఓట్లను సీట్లుగా మార్చుకోవడంలో సఫలమైంది. ఒక్కళిగ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో జేడీ(ఎస్‌)గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం కూడా కాంగ్రెస్‌ను దెబ్బ తీసింది.      

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top