టీఆర్‌ఎస్‌కే పోస్ట్‌పోల్‌ మొగ్గుతో.. జాతీయ పార్టీల్లో అంతర్మథనం 

Exit Polls Says Congress And BJP Are Not Giving Tough Fight To TRS - Sakshi

రాష్ట్రంలో రెండోస్థానంపై అంచనాల్లో బీజేపీ, కాంగ్రెస్‌.. ఐదారుచోట్ల గట్టి 

పోటీపై లెక్కలేసుకుంటున్న ఇరుపార్టీలు 

తేడా వస్తే.. పార్టీ అస్తిత్వానికే దెబ్బ అంటున్న కొందరు కాంగ్రెస్‌ నేతలు

కేంద్రంలో అధికారంలోకి వస్తారన్న వార్తలతో బీజేపీకి స్వల్ప ఊరట 

సాక్షి, హైదరాబాద్‌ : ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాలను కలవరపెడుతున్నాయి. తాము ఆశించిన దానికి ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలకు తేడా ఉండటం, అధికార టీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లోనూ తిరుగులేదని తేలడంతో ఆ రెండు పార్టీల నేతలకు గుబులు పట్టుకుంది. కనీసం ఐదారు స్థానాల్లోనైనా విజయం సాధిస్తామని కాంగ్రెస్, మూడు స్థానాలు తమ ఖాతాలో చేరుతాయని కమలనాథులు గంపెడంత ఆశలు పెట్టుకోగా, ఎగ్జిట్‌ ఫలితాలు ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు 14–16 స్థానాలను కట్టబెడుతుండటం వారికి రుచించడం లేదు. అటు అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్, లోక్‌సభ ఫలితాల్లోనూ జోరు కొనసాగిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు తేల్చడంతో తమ భవిష్యత్తు ఏంటనే దానిపై ఆ రెండు పార్టీల నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. 

నల్లగొండపై కాంగ్రెస్‌.. కరీంనగర్‌పై బీజేపీ 
తాము ఆశించిన మేర ఫలితాలు రావన్న అంచనాల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ నేతలు రెండో స్థానం కోసం లెక్కలు కట్టుకుంటున్నారు. వాస్తవానికి నల్లగొండ, భువనగిరి, చేవెళ్ల, ఖమ్మం, మల్కాజ్‌గిరి స్థానాల్లో తాము విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని కీలక నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రేణుకాచౌదరి, రేవంత్‌రెడ్డిలు ఈ నియోజకవర్గాల్లో బరిలో దిగడంతో వారి వ్యక్తిగత ఇమేజ్‌కు తోడు జాతీయపార్టీ ఇమేజ్‌ కూడా తోడవుతుందని భావించారు. బీజేపీ విషయానికి వస్తే సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ, కరీంనగర్‌లో బండి సంజయ్‌లు అధికార టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చారని పోలింగ్‌ సరళిని బట్టి అంచనా వేశారు. కానీ, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్కో స్థానానికి మించి రావడం లేదని, కొన్ని చోట్ల గట్టిపోటీ ఇచ్చిందని ఎగ్జిట్‌ లెక్కలు చెపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలున్నాయనే దానిపై ఆ రెండు పార్టీల నేతలు మళ్లీ కుస్తీ పడుతున్నారు. ఎగ్జిట్‌ ఫలితాలు ఒకటి, రెండు స్థానాలకే పరిమితం చేయడంతో నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తామని, భువనగిరి, మల్కాజ్‌గిరి, ఖమ్మం, మహబూబాబాద్, చేవెళ్లలో రెండింట గెలుస్తామని కాంగ్రెస్‌ ఆశిస్తోంది. బీజేపీ మాత్రం కరీంనగర్‌ తమదేనని, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఒకటి గెలుస్తామని ఆశిస్తోంది. ఇందుకోసం పోలింగ్‌స్టేషన్లు, మండలాలు, నియోజకవర్గాల వారీగా తమకున్న సానుకూలతలు, పోలింగ్‌ జరిగిన తీరును విశ్లేషిస్తూ రెండు పార్టీల నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. 
 
రెండో స్థానమైనా..! 
పోలింగ్‌ సరళిని బట్టి ఐదారు చోట్ల టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలబడతామని, భవిష్యత్తులో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షం కోసం పోటీపడతామని ఆశించిన కమలనాథులు ఇప్పుడు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఉంటుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక స్థానంలోనైనా గెలిచి.. ఐదారు చోట్ల రెండోస్థానంలో నిలిస్తే బాగుంటుందంటున్నారు. ఎలాగూ కేంద్రంలో అధికారం దక్కుతుంది కనుక జాతీయపార్టీ హోదాలో ప్రతిపక్ష రేసులో నిలవచ్చన్నది ఆ పార్టీ నేతల అంచనా. బీజేపీకి తోడు కాంగ్రెస్‌ కూడా.. తాము గెలిచే స్థానాలేంటి? ఎన్ని చోట్ల రెండో స్థానంలో నిలుస్తామన్న దానిపై లెక్కలు కట్టుకుంటోంది. కేంద్రంలో అధికారం దక్కకపోగా, ఇక్కడ కూడా ప్రతికూల ఫలితాలు వచ్చి బీజేపీ కన్నా పేలవ స్థాయిలో నిలిస్తే కాంగ్రెస్‌ శాసన సభాపక్షాన్ని విలీనం చేసే ప్రక్రియను టీఆర్‌ఎస్‌ వేగవంతం చేస్తుందని, దెబ్బమీద దెబ్బతో రాజకీయంగా మనుగడ సాగించలేని స్థితికి చేరుకుంటామోననే ఆందోళన కాంగ్రెస్‌ నేతల్లో వ్యక్తమవుతోంది. మొత్తంమీద ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు రాష్ట్రంలోని రెండు జాతీయపార్టీల నేతలు ఓ వైపు విజయం కోసం, మరోవైపు రెండో స్థానం కోసం అంతర్మథనంలో పడేశాయని రాజకీయ వర్గాలంటున్నాయి. 
 
రెంటికీ చెడ్డామా? 
కాంగ్రెస్, బీజేపీల మధ్య, ఆ పార్టీల నేతల స్థైర్యం విషయంలో ఒక్క తేడా మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందని, బీజేపీ గతం కన్నా దేశవ్యాప్తంగా లాభపడుతోందన్న ఎగ్జిట్‌ అంచనాలు రాష్ట్ర బీజేపీ నేతలకు, ఆ పార్టీ కేడర్‌కు ఉపశమనం కలిగిస్తుండగా, మరోసారి అధికారానికి దూరంగా ఉంటామన్న వాస్తవాన్ని కాంగ్రెస్‌ కేడర్‌ జీర్ణించుకోలేకపోతోంది. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారం దక్కని పరిస్థితుల్లో, కనీసస్థాయి ప్రాతినిధ్యం కూడా కరువైతే మరో ఐదేళ్లపాటు రాష్ట్రంలో పార్టీని నెట్టుకురావడం, కేడర్‌ను నిలుపుకోవడం కష్టసాధ్యమేనని ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top