
సాక్షి, బెంగళూరు : బీజేపీ నాయకురాలు శోభా కరంద్లజ్ అన్నట్టే జరిగింది. నిజంగానే అద్భుతం. ఎన్నో నాటకీయ పరిస్థితులు, మరెన్నో ఎత్తులకు పైఎత్తులు జరిగినప్పటికీ ఎట్టకేలకు కాంగ్రెస్-జేడీయూలే అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. బలపరీక్షలో బలం నెగ్గించుకుంటామంటూ చివరి వరకు చెప్పుకుంటూ వచ్చిన బీజేపీ, చివరికి చేతులెత్తేసింది. బలపరీక్షకు ముందే తన ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసేశారు. తమకు బలం లేదంటూ చెప్పకనే చెప్పేసి, బలపరీక్షకు వెళ్లకుండానే బయటికి వచ్చేశారు. ఈ విషయాన్ని బీజేపీ నాయకురాలు శోభా ముందే ఊహించి ఉన్నారేమో. రాజకీయాల్లో ప్రతి నిర్ణయం అద్భుతం, సంతోషమంటూ ఆమె చెప్పారు. నిజంగానే చివరి క్షణంలో యడ్యూరప్ప అద్భుతం చేసి చూపించారు.
మరోవైపు బీజేపీ ప్రలోభాలకు ఆకర్షితులైనట్టు భావించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రతాప్ గౌడ పాటిల్, ఆనంద్ సింగ్‌లు కూడా చివరి నిమిషంలో తమ సొంత పార్టీలోకి వచ్చేశారు. వీరు శాసనసభలోకి ప్రవేశించేటప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చుట్టుముట్టారు. బలపరీక్షలో కాంగ్రెస్‌కే ఓటు వేసేలా వీరిని సన్నద్ధం చేశారు. కానీ చివరికి బలపరీక్షే జరుగలేదు. ఏది ఏమైనప్పటికీ నిజంగానే ఇది కాంగ్రెస్-జేడీఎస్‌లకు అద్భుతమనే చెప్పవచ్చు. ఎట్టకేలకు తాము అనుకున్నది సాధించి కర్ణాటక అసెంబ్లీ పీఠాన్ని దక్కించుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హైడ్రామాకు చెక్ పడింది. యడ్యూరప్పకు ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచింది. యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం కాంగ్రెస్-జేడీఎస్ నేతల్లో సంబురాలు నెలకొన్నాయి. యడ్యూరప్పకు సభలో ప్రతి ఒక్కరూ షేక్ హ్యాండు ఇచ్చారు.