ట్రంప్‌పై అభిశంసన కత్తి? 

Donald Trump colleagues are convicted in various cases - Sakshi

పదవికి ఎసరు తెస్తున్న న్యాయ వివాదాలు..

వివిధ కేసుల్లో దోషులుగా తేలుతున్న ఆయన సహచరులు 

డెమోక్రాట్ల సంఖ్య పెరిగితే అభిశంసనకు సన్నాహాలు 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెడపై మరోసారి అభిశంసన కత్తి వేళ్లాడుతోందా? ట్రంప్‌ ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు ఆయన పదవికి ఎసరు పెడతాయా? అగ్రరాజ్యంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే సాగుతున్నాయి. ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్న చర్చ ఇప్పటికే మొదలవగా నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో పట్టు సాధించి ట్రంప్‌ను గద్దె దింపాలని డెమోక్రాట్లు భావిస్తున్నారు. 

వెంటాడుతున్న ఎన్నికల వివాదాలు.. 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై సాగుతున్న విచారణలో భాగంగా ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్, మాజీ ప్రచార మేనేజర్‌ పాల్‌ మనాఫోర్ట్‌లు కోర్టుల్లో దోషులుగా తేలడం ఒక్కసారిగా ట్రంప్‌ను చిక్కుల్లోకి నెట్టేసింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన సెక్స్‌ స్కాండల్‌ ముడుపుల వ్యవహారం ఇప్పుడు వెలుగుచూడటంతో ట్రంప్‌ ఎన్నడూ లేనివిధంగా విషమ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్‌ మాజీ వ్యక్తిగత న్యాయవాది మైకేల్‌ కోహెన్‌ పన్నుల ఎగవేత, బ్యాంకుల్ని మోసగించడం, ప్రచార ఆర్థిక చట్టాల ఉల్లంఘన నేరాలను కోర్టు ఎదుట అంగీకరించడం ట్రంప్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ట్రంప్‌తో తమకు లైంగిక సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న ప్లేబాయ్‌ మోడల్‌ కరెన్‌ మెక్‌ డౌగల్, పోర్న్‌స్టార్‌ స్టార్మీ డేనియల్‌లు నోరు మూయించడానికి మూడో కంటికి తెలియకుండా ముడుపులు చెల్లించాలని ట్రంప్‌ తనకు చెప్పారంటూ కోహెన్‌ కోర్టుకు వెల్లడించారు. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్‌ను గద్దె దింపాలనే చర్చకు దారి తీశాయి.  ట్రంప్‌ సైతం తనను అభిశంసిస్తే మార్కెట్లు కుప్పకూలి అందరూ పేదవాళ్లవుతారంటూ బెదిరింపులకు దిగారంటే ఆయన కూడా ఆందోళనలో ఉన్నట్టు అర్థమవుతోంది. 

అధ్యక్షుడి అభిశంసన ఇలా... 
అమెరికా అధ్యక్షుడిని అభిశంసించడం అంత సులభం కాదు. దీనికి సుదీర్ఘ ప్రక్రియ జరగాల్సి ఉంటుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రతినిధుల సభలో సభ్యులెవరైనా అధ్యక్షుడి తప్పుల్ని ఎత్తి చూపుతూ అభిశంసనకు ప్రతిపాదించవచ్చు. దేశద్రోహం, లంచాలు ఇవ్వడం, ఘోర నేరానికి పాల్పడటం, దుష్ప్రవర్తన (అధికార దుర్వినియోగం, ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీయడం దుష్ప్రవర్తన కిందకు వస్తాయి) వంటి కారణాలతో అభిశంసించే అవకాశం ఉంది. ప్రతినిధుల సభలో అధ్యక్షుడిపై నమోదైన అభియోగాలను సాక్ష్యాధారాలతో సహా హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ఎదుట విచారణకు వస్తుంది.

స్వతంత్ర ప్రతిపత్తిగల ఆ కమిటీ విచారణలో ఆరోపణలు నిజమని తేలితే ఏయే అధికరణాల కింద నేరారోపణలు చేశారనేది నిర్ధారిస్తారు. ఆ అధికరణాలపై మళ్లీ సభలో సమగ్ర చర్చ తర్వాత ఓటింగ్‌ ఉంటుంది. సాధారణ మెజారిటీతో అభిశంసన తీర్మానాన్ని సభ ఆమోదిస్తే దానిని సెనేట్‌కు పంపుతారు. అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది.

నవంబర్‌ ఎన్నికలే అభిశంసనకు రెఫరెండం... 
ఈ పరిణామాలన్నీ నవంబర్‌లో జరిగే ప్రతినిధుల సభ ఎన్నికల్లో డెమోక్రాట్లకు లాభిస్తాయనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికలే ట్రంప్‌పై అభిశంసనకు రెఫరెండంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభలో ప్రస్తుతం రిపబ్లికన్లదే మెజారిటీ. డెమోక్రాట్లు రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ప్రతినిధుల సభలో పట్టు పెంచుకుంటే ట్రంప్‌ను పదవి నుంచి తప్పించడానికి వ్యూహాలు పన్నే అవకాశాలు కనిపిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ట్రంప్‌పై గతేడాది ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభలో వీగిపోయింది. చాలా మంది డెమోక్రాట్లు ట్రంప్‌పై అభిశంసన తొందరపాటు చర్య అని అభిప్రాయపడ్డారు. అందుకే వచ్చే నవంబర్‌ ఎన్నికల వరకు వారు ట్రంప్‌ను గద్దె దింపే సాహసం చేసే అవకాశం కనిపించడం లేదు.

చరిత్రలోకి తొంగి చూస్తే...
ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులెవరూ అభిశంసనకు గురికాలేదు. 1868లో ఆండ్రూ జాన్సన్, 1998లో బిల్‌ క్లింటన్‌లపై ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నెగ్గినప్పటికీ సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. 1974లో వాటర్‌ గేట్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న రిచర్డ్‌ నిక్సన్‌ అభిశంసన తీర్మానంపై చర్చకు ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top