పేరుకు సిక్‌.. రాజకీయ కిక్కు!

Constable Supporting TDP Government In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఆమోదించండి అని సీఐ గోరంట్ల మాధవ్‌ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. ఆమోదించకుండా ముప్పుతిప్పలు పెట్టారు. న్యాయపోరాటం చేయడంతో చివరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదించారు. కేవలం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వలనే పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  

అదే అధికారపార్టీతో అంటకాగితే పోలీసు ఉన్నతాధికారుల తీరు మరోలా ఉంటుందనేందుకు ఈ కానిస్టేబులే నిదర్శనం. కానిస్టేబుల్‌ నరసింహమూర్తి. ఈ పేరు వింటే పోలీసుశాఖలో ఎవరైనా గుర్తుపడుతారు. ప్రస్తుతం అనంతపురం రూరల్‌ పోలీసుస్టేషన్‌లో పోస్టింగ్‌ ఉంది. ఏనాడూ ఆయన మాత్రం స్టేషన్‌ మెట్లెక్కడు. నాలుగేళ్లుగా ఖాకీ వదిలి (అనధికారికంగా) ఖద్దరు తొడుక్కున్నాడు. అధికార టీడీపీతో అంటకాగుతుండడంతో అధికారులకు తెలిసినా కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. నాలుగేళ్లుగా డిపార్ట్‌మెంట్‌కు దూరంగా.. అధికారపార్టీకి దగ్గరగా ఉంటున్నాడు. కొద్దిరోజులు రావడం.. మళ్లీ సిక్‌లో వెళ్లిపోవడం జరుగుతోంది. ఓ వైపు ఉద్యోగం కాపాడుకుంటూనే మరో వైపు రాజకీయాల్లో రాణిస్తున్నాడు.

అంతేకాదండోయ్‌ ఇటీవల హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందేందుకు కూడా అర్హత సాధించాడు. ఇటీవల శిక్షణ తీసుకొని వచ్చి మళ్లీ సిక్‌లో వెళ్లిపోయాడు. తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అయితే రహస్యంగా కాదు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండడం గమనార్హం. తాజాగా గురువారం పుట్టపర్తిలో సీఎం చంద్రబాబునాయుడును కలవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అదనపు ఎస్పీ చౌడేశ్వరిని వివరణ కోరగా సిక్‌లో ఉన్న ఉద్యోగులు రాజకీయపార్టీల కార్యక్రమాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.  

  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top