కేసీఆర్‌ పాలనలో మహిళలకు అన్యాయం | Congress women leaders blames on kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనలో మహిళలకు అన్యాయం

Nov 23 2018 12:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress women leaders blames on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఏఐ సీసీ మహిళా అధ్యక్షురాలు, ఎంపీ సుస్మితాదేవి విమర్శించారు. కేసీఆర్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ప్రాతినిధ్యం కల్పించలేదని, మహిళా కమిషన్‌ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి మాట దేవుడెరుగు, ఈ ప్రభుత్వంలో కనీ సం మహిళలకు రక్షణ కూడా లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారదతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంతో మంది త్యాగాలుచేస్తే ఈ రాష్ట్రం ఏర్పడిందని, ఉద్యోగాలు, ఉపాధి అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణలో నాలుగున్నరేళ్లలో అవి పూర్తిగా విస్మరించబడ్డాయన్నారు. తెలంగాణ సాధనకోసం ఉద్యమించిన ఉస్మానియా విద్యార్థులకూ టీఆర్‌ఎస్‌ అన్యాయం చేసిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని, విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సైతం పూర్తిగా పెండింగ్‌లో పడేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌పై విమర్శలా..
తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్న టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని సుస్మిత అన్నారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే, ప్రజలను మభ్యపెట్టి మోసపూరితమైన వాగ్దానాలతో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఖాయమన్నారు.

మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత 
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని సుస్మిత అన్నారు. తెలంగాణకు మహిళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోలేదన్నారు. మహిళల హక్కులకోసం టీపీసీసీ మహిళా అధ్యక్షురాలిగా నేరెళ్ల శారద పోరాడుతున్నారని ప్రశంసించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement