
సాక్షి, బెంగళూరు: బ్లూ ఫిల్మ్ అంటే తెలుసా?.. ఇలా ప్రశ్నించింది ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. నగరంలో విజయనగర నియోజకవర్గంలో రూ.64 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ ‘యడ్యూరప్పకు వయసైపోయింది. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు. గతంలో జరిగినవన్నీ మరిచిపోతున్నారు. యడ్యూరప్ప, ఆయన పార్టీ సీనియర్లు అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చారు. కొంతమంది మంత్రులు అసెంబ్లీ సమావేశాల్లో బ్లూ ఫిల్మ్‌లు చూసి పదవులు పోగొట్టుకున్నారు. బ్లూ ఫిల్మ్‌లు అంటే తెలుసా? నీలి చిత్రాలు’ అన్నారు. దీంతో సభలో నవ్వులు విరిశాయి.
అవినీతిపై బహిరంగ చర్చకు యడ్యూరప్ప, బీజేపీ నాయకులతో సిద్ధమని సిద్ధరామయ్య ప్రకటించారు. మేయర్ సంపత్‌రాజ్ మాట్లాడుతూ... సిద్ధరామయ్యను సచిన్ టెండూల్కర్‌తో పోల్చారు. ‘సచిన్ క్రికెట్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను నెలకొల్పారు. అయితే చాలా మంది వాటిని మరిచిపోయారు. అదే విధంగా సిద్ధరామయ్య కూడా అనేక పథకాలను ప్రవేశపెట్టినా చాలా వాటిని మరిచిపోయార’ ని అన్నారు. మంత్రి కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణలు ఈ సభలో పాల్గొన్నారు.