కాంగ్రెస్‌ పార్టీని చీల్చిచెండాడిన కేసీఆర్‌ | CM KCR Fires, says Congress number one villain | Sakshi
Sakshi News home page

Mar 14 2018 3:12 PM | Updated on Mar 18 2019 9:02 PM

CM KCR Fires, says Congress number one villain - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే నంబర్‌ వన్‌ విలన్‌ అని అభివర్ణించారు. తెలంగాణ వినాశనానికి కాంగ్రెస్సే కారణమని, ఆ పార్టీ ఇక్కడి ప్రజల జీవితాలతో ఆడుకుందని ధ్వజమెత్తారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ సభ్యత్వాలపై వేటు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ బుధవారం తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు.

అసెంబ్లీలో కఠినంగా వ్యవహరిస్తామని, తప్పు చేస్తే ఎవరినీ సహించమని ఆయన తేల్చి చెప్పారు. అనుమతి ఇచ్చిన ప్రదేశాల్లోనే ధర్నాలు, ఆందోళనలు చేయాలని ప్రతిపక్ష సభ్యులకు సూచించారు. ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తామంటే అంగీకరించబోమన్నారు. తమ హయాంలో అప్పులు పెరిగాయని ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని, తాము అధికారంలోకి వచ్చిననాడు రాష్ట్ర అప్పు రూ. 72వేల కోట్లు ఉండగా.. అది ఇప్పుడు రూ. 1.42 లక్షల కోట్లకు చేరిందని వివరించారు. అభివృద్ధి పనుల కోసమే అప్పు చేశామని అన్నారు. ఒకేసారి రూ. 2 లక్షల రుణమాఫీ అసాధ్యమని, అందుకు ఆర్బీఐ ఒప్పుకోకపోవడంతోనే నాలుగు విడతల్లో రుణమాఫీ చేపట్టామని ఆయన అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నేతలకు హైకమండ్‌ను చూస్తే వణుకు అని కేసీఆర్‌ ఎద్దేవా చేశారు. హైకమాండ్‌ ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్‌ నేతలు నాగార్జున సాగర్‌లో తెలంగాణకు అన్యాయం చేశారని, కాంగ్రెస్‌ నేతల తీరువల్లే సాగర్‌లో మన వాటా తగ్గిందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రాలతో గొడవలు ఉండేవని, కానీ, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని సజావుగా ప్రాజెక్టులు చేపడుతున్నామని వివరించారు. భక్త రామదాసు ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. 3,283 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌తో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 60వేలకుపైగా డబుల్‌ బెడ్‌రూ ఇళ్లను నిర్మిస్తున్నామని, ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్‌ బెడ్‌రూ ఇళ్లను కడుతున్నామని తెలిపారు. ప్రతి మండలానికి ఒక బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈ ఏడాది నుంచే రైతులకు ఎకరాకు రూ. 8వేలు పెట్టుబడి సాయం ఇస్తామని తెలిపారు. ఇచ్చిన హామీలను వందశాతం అమలుచేస్తామని, ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement