రీపోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం : ద్వివేది

CEO Gopal Krishna Dwivedi Comments On Repolling - Sakshi

ఆయా బూత్‌ల పరిధిలో ముగిసిన ప్రచారం

సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌

ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద 50 మంది పోలీసులతో భద్రత

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం రీ పోలింగ్‌ జరగనున్న ఐదు కేంద్రాల పరిధిలో శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీ పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, బూత్‌ల వద్ద రిటర్నింగ్‌ అధికారి, డిప్యూటీ సూపరింటెండెంట్‌ పోలీసు అధికారులతో పాటు కేంద్ర పరిశీలకులు ఉంటారన్నారు. శనివారం సచివాలయంలో కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పోలింగ్‌ కేంద్రం వద్ద 50 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.  

సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుందని, 6 గంటల లోపు క్యూలైన్లో ఉన్న ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని బూత్‌ నంబర్‌ 244, నరసరావుపేట నియోజకవర్గం కేసానుపల్లి గ్రామం 94వ బూత్, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలోని 247వ బూత్, నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ పరిధిలోని బూత్‌ నంబర్‌ 41, సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని 197వ బూత్‌లో రీ–పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. మే 23న కౌంటింగ్‌కు అన్ని ఎర్పాట్లు పూర్తి చేశారు.

నిరుద్యోగ భృతి పెంపునకు అనుమతి నిరాకరణ
రాష్ట్రంలో రీ పోలింగ్‌ ముగిసే వరకు నిరుద్యోగ భృతి పెంపునకు అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top