హై‘కమాండ్‌’ కోసం ఎదురుచూపులు

BJP treading cautiously on Karnataka govt formation - Sakshi

ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమన్న కర్ణాటక బీజేపీ చీఫ్‌ యడ్యూరప్ప

బీజేపీ అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి  

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని కర్ణాటక బీజేపీ చీఫ్, ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప తెలిపారు. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్‌ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. బెంగళూరులోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయం ‘కేశవ కృప’లో బుధవారం సంఘ్‌ పెద్దలను కలుసుకున్న అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. ‘నేను ఢిల్లీ నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా. ఎప్పుడు అవసరమైనా నేను బీజేపీ శాసనసభా పక్షాన్ని సమావేశపర్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్‌ను కలుసుకోగలను. కానీ ఇందుకోసం పార్టీ హైకమాండ్‌ నుంచి తొలుత స్పష్టత రావాలి’ అని తెలిపారు. కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షకు అనుకూలంగా 99 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా, 105 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. దీంతో విశ్వాసతీర్మానం వీగిపోయి సీఎం కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.

ఆరెస్సెస్‌ ఆశీర్వాదం వల్లే..
ఆరెస్సెస్‌ పెద్దల ఆశీర్వాదం, సహకారం కారణంగానే తాను తాలూకా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదిగానని యడ్యూరప్ప తెలిపారు. ‘తదుపరి కార్యాచరణను చేపట్టేముందు ఆరెస్సెస్‌ పెద్దల ఆశీస్సులు తీసుకునేందుకే ఇక్కడకు వచ్చాను. విశ్వాసపరీక్ష సందర్భంగా మా ఎమ్మెల్యేలు బలంగా, ఐకమత్యంతో నిలిచారు. మాకు రాబోయే కాలంలో కీలకమైన పరీక్షలు ఎదురుకానున్నాయి. ఇలాంటి పరిస్థితులన్నింటిని దీటుగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాం’ అని వెల్లడించారు. మరోవైపు విశ్వాసపరీక్షకు డుమ్మా కొట్టిన 17 మంది రెబెల్‌ ఎమ్మెల్యేల రాజీనామాల విషయంలో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని బీజేపీ అధిష్టానం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, ముంబైలో ఆందోళన చెందుతున్న రెబెల్‌ ఎమ్మెల్యేలకు సర్దిచెప్పేందుకు బీజేపీ నేతలు అశ్వంత్‌ నారాయణ్, ఆర్‌.అశోక ముంబైకి బయలుదేరివెళ్లారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక దూత..
కర్ణాటకలో నాటకీయ పరిణామాల మధ్య సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ అధిష్టానం పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను సాఫీగా జరిగేలా చూసేందుకు త్వరలోనే ప్రత్యేక పరిశీలకుడిని పంపనుంది. కర్ణాటకలో విశ్వాసపరీక్షకు మొత్తం 17 మంది అధికార కూటమి సభ్యులు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీరిపై స్పీకర్‌ చర్యలు తీసుకునేవరకూ వేచిఉండాలన్న ధోరణితోనే బీజేపీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఒకవేళ స్పీకర్‌ సుప్రీంకోర్టుకెళ్లిన 15 మంది రెబెల్స్‌ రాజీనామాలను ఆమోదించి లేదా అనర్హత వేటేస్తే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 210కి, కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి బలం(బీఎస్పీ ఎమ్మెల్యేతో కలుపుకుని) 103కు చేరుకుంటుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 106కు తగ్గుతుంది. దీంతో 107 ఎమ్మెల్యేల మద్దతున్న బీజేపీ కూటమి(బీజేపీ 105, ఇద్దరు స్వతంత్రులు) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమౌతుంది. అయితే స్వతంత్రుల దయాదాక్షిణ్యాలపై బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగించాల్సి ఉంటుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top