బెంగాలీ సెంటిమెంట్‌పై ‘ఎన్నికల దాడి’

BJP, TMC workers clash during Amit Shah rally - Sakshi

లోక్‌సభ ఎన్నికల ప్రచారం చివరి దశ వేడెక్కింది. కోల్‌కతాలో మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ర్యాలీలో జరిగిన విధ్వంసంతో దేశం దృష్టి యావత్తు బెంగాల్‌పైకి మళ్లింది. అమిత్‌ షా ర్యాలీకి మమత సర్కారు అడ్డంకులు కల్పించడం, ర్యాలీని తృణమూల్, సీపీఎం శ్రేణులు అడ్డుకోవడం, ప్రతిగా బీజేపీ కార్యకర్తలు ఈశ్వర్‌ చంద్ర విద్యాసాగర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

మాటల యుద్దం నుంచి దాడుల వరకు...
సాధారణంగా బిహార్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాలు కొన్నింటిలో ఎన్నికలప్పుడు అల్లర్లు, హింస జరగడం గత ఎన్నికల్లో చూశాం. అయితే, ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు చెప్పుకోతగ్గ గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగ్గా పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హింస, అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇంత వరకు జరిగిన వివిధ దశల పోలింగులో హింస జరగడం ఒక ఎత్తయితే, తాజాగా అమిత్‌షా మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఇరు పక్షాలు విధ్వంసానికి పాల్పడటంతో ఎన్నికల ప్రచార కార్యక్రమం హింసాత్మకంగా మారింది.

ఈశ్వర్‌ చంద్ర విగ్రహ విధ్వంసానికి కారకులు మీరంటే మీరంటూ తృణమూల్, బీజేపీలు ఆరోపణలు చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ ఎన్నికల నియమావళిని యథేచ్చగా ఉల్లంఘిస్తున్నా ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ బీజేపీ నేత అమిత్‌ షా మండి పడ్డారు. తృణమూల్‌ అభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యతిరేక పార్టీ అంటూ ప్రధాని మోదీ దుయ్యబట్టారు. అమిత్‌షా పొరుగు రాష్ట్రాల నుంచి గూండాలను తీసుకొచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలపై బీజేపీ దాడి చేసిందంటూ మండి పడ్డారు. ఘటనపై ఇరు పక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. బుధవారం పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల సంఘం తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిషేధించింది.

తృణమూల్‌ బలప్రయోగం
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు  మమతా బెనర్జీ, ప్రధాని మోదీల మధ్య పోరుగా మారాయి.   వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంటే, కమలనాథులకు అవకాశం దక్కకుండా చేసేందుకు దీదీ అన్ని మార్గాలు అవలంబిస్తోంది. అధికారాన్ని ఉపయోగించుకుని విపక్ష నేతల పర్యటనలకు, ఎన్నికల ప్రచారాలకు, ర్యాలీలకు  మోకాలడ్డుతోంది. అంతే కాకుంగా, విపక్ష నేతలకు పట్టున్న జిల్లాల్లో ఓట్లు వేసేందుకు  ఓటర్లను అనుమతించడం లేదు. తృణమూల్‌ చేస్తున్న ఈ ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా తరచు హింస,అల్లర్లు చోటు చేసుకుంటున్నాయి.

ఈ తీవ్ర పోరుకి కారణం...
తృణమూల్, బీజేపీలు రెండూ ఇంతటి తీవ్ర స్థాయి పోరుకు దిగడానికి కారణం బెంగాల్‌లో విజయం ఇద్దరికీ తప్పనిసరి కావడమే. దేశంలో తృణమూల్‌ అధికారంలో ఉన్నది ఒక్క బెంగాల్‌లోనే. ఇక్కడ అధికారం కోల్పోతే దాని మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో తృణమూల్‌ శ్రేణుల పెత్తనం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉంది. మరోవైపు 34 ఏళ్ల తమ అధికారాన్ని కొల్లగొట్టిన తృణమూల్‌పై సీపీఎం కన్నెర్రగా ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మమతాని మట్టి కరిపించాలని సీపీఎం శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అందుకోసం అవసరమైతే బీజేపీకి సహకరించడానికి కూడా కమ్యూనిస్టులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ గెలుపు కోసం ప్రత్యర్థులను బల ప్రయోగంతో అణచివేయడానికి తృణమూల్‌  వెనుకాడటం లేదు. మమత మేనల్లుడు పోటీ చేస్తున్న డైమండ్‌ హార్బర్‌ నియోజకవర్గంలో తృణమూల్, బీజేపీల మధ్య వరసగా కొన్ని రోజుల పాటు ఘర్షణలు జరగడం దీనికి నిదర్శనం.

మరోవైపు బీజేపీకి కూడా బెంగాల్‌లో మెజారిటీ సీట్లు సాధించడం జాతీయ రాజకీయాల దృష్ట్యా అవసరం. రెండో సారి కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న కమలనాధులకు హిందీ బెల్ట్‌లో గతంలోలా ఈ సారి మెజారీటీ స్థానాలు రావని తేలిపోయింది. అక్కడి నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి  అత్యధిక లోక్‌సభ స్థానాలున్న బెంగాల్‌లో పట్టు సాధించడం బీజేపీకి అనివార్యం. అందుకే బెంగాల్‌లో వీలైనన్ని సీట్లు సాధించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. తృణమూల్‌పై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడం, తృణమూల్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తున్న కమ్యూనిస్టుల సహాయం తీసుకోవడం ద్వారా దీదీకి చెక్‌ చెప్పేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది కూడా ఇరు పక్షాల మధ్య ఘర్షణలకు దారి తీస్తోంది.

సత్తా చాటుకునేందుకే...
తమ సత్తా  చాటేందుకు మమత, మోదీలు పరోక్షంగా ప్రయత్నించడం రెండు పార్టీల మధ్య రాజకీయ పోరాటానికి దారి తీసింది. చివరిదశ పోలింగ్‌ సమీపిస్తున్న కొద్దీ ఇరు పక్షాలు ఎన్నికల నిబంధనలను, సంప్రదాయాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. తాజా అల్లర్లు, విధ్వంసాలు రెండు పార్టీల్లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో నిరూపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తృణమూల్‌–బీజేపీల మధ్య జరిగిన తాజా ఘర్షణల్లో ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌ విగ్రహం విధ్వంసం బెంగాల్‌ ప్రజల భావోద్వేగాలపై ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇది బెంగాలీ సంస్కృతిపై దాడిగా పలువురు అభివర్ణిస్తున్నారు.ఈ ఘటనను సీపీఎం సహా అనేక పార్టీలు తీవ్రంగా ఖండించడం, తృణమూల్‌ నేతలు తమ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ను మార్చడం ఈ ఘటన ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాయి.  విగ్రహ ధ్వంసానికి కారణమెవరైనా మరో 4 రోజుల్లో జరగనున్న పోలింగ్‌పై దీని ప్రభావాన్ని తోసి పుచ్చలేమని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.

హద్దులు దాటిన ప్రచార యుద్ధం
యూపీ మాదిరిగానే బెంగాల్‌లోని 42 సీట్లకు ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతోంది. చివరి దశలో మిగిలిన 9 లోక్‌సభ స్థానాలకు  మే 19వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది.  రాష్ట్రంలో నాలుగు, ఐదు, ఆరు దశల పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే బీజేపీ బలపడుతోందని, ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తృణమూల్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వారు చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పశ్చిమ బెంగాల్‌ను లక్ష్యంగా చేసుకుందని రాష్ట్ర సీపీఎం నేత ఒకరు అన్నారు. బెంగాల్‌ను 34 ఏళ్లు పాలించిన సీపీఎం బాగా బలహీనం కావడం, కాంగ్రెస్‌ బలం ఊహించని స్థాయిలో కుంచించుకుపోవడంతో బీజేపీకి మమతా బెనర్జీ పెద్ద సవాలుగా మారారు.  

ఇద్దరూ ఇద్దరే...
మోదీ ఆరెసెస్‌లో, తర్వాత బీజేపీలో సంస్థాగత పదవులు సమర్థంగా నిర్వహించి నాలుగు సార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రి అయ్యారు. చివరికి ప్రధాని పదవి చేపట్టారు. వామపక్ష పాలనలో మమత వీధి పోరాటాలతో రాటుదేలారు. సీపీఎం భౌతిక దాడులను సైతం తట్టుకుని హింసకు హింసతోనే ఆమె జవాబిచ్చారు. 1998లో కాంగ్రెస్‌ నుంచి బయటికొచ్చి తృణమూల్‌ కాంగ్రెస్‌ స్థాపించాక బీజేపీతో చేతులు కలిపారు. వరుసగా 1998, 99, 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో పోటీచేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మమత రాష్ట్రంలో తృణమూల్‌కు గట్టి పునాదులు వేయగలిగారు. చివరికి 2011 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకున్నారు.

ఆమె తన రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే క్రమంలో సీపీఎం, కాంగ్రెస్‌ ఉక్కిరి బిక్కిరై బలం కోల్పోయాయి. ఈ పరిణామాలను అనుకూలంగా మలచుకున్న బీజేపీ రాష్ట్రంలో తృణమూల్‌కు ప్రత్యామ్నాయంగా అవతరించింది. ఆరో దశ పోలింగ్‌కు ముందు మేదినీపూర్‌ ఎన్నికల ర్యాలీలో మమత ప్రసంగిస్తూ, ‘‘1942లో బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా నడిచిన క్విట్‌ ఇండియా ఉద్యమం లాంటివే 2019 లోక్‌సభ ఎన్నికలు. ఫాసిస్టు మోదీ సర్కారును అధికారం నుంచి కూలదోయడానికే మా పార్టీ పోరాడుతోంది,’’ అని ప్రకటించారు.  మోదీ ఇటీవల బెంగాల్‌లో ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ, ‘‘ మమత అనగానే  ‘టీ’ అక్షరంతో మొదలయ్యే మూడు పదాలు గుర్తుకొస్తాయి. అవి తణమూల్, టోల్‌బాజీ(బలవంతపు వసూళ్లు) టాక్స్‌. అన్నారు.


బుధవారం కోల్‌కతాలో భారీ ర్యాలీ చేపట్టిన తృణమూల్‌ చీఫ్, సీఎం మమతా బెనర్జీ


ఢిల్లీలో మౌన నిరసన ప్రదర్శనలో పాల్గొన్న కేంద్రమంత్రి నిర్మల, ఇతర సీనియర్‌ బీజేపీ నేతలు
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top