కుమారస్వామి ప్రమాణం.. విచిత్ర దృశ్యాలు

Anti BJP Parties Came Onto One Dies At Kumaraswamy sworn in - Sakshi

బెంగళూరు: సైద్ధాంతిక విబేధాలను పక్కనపెట్టిమరీ బద్ధశత్రువులు కరచాలనం చేశారు.. ఉమ్మడి శత్రువును ఎలా ఢీకొట్టాలో గుసగుసలాడుతూ వ్యూహాలు పంచుకున్నారు. వారిలో కొందరు అవకాశవాదులూ ఉన్నారు.. ఏదైదేనేం.. మొత్తానికి ఒక్కటిగా చేతులు పైకిలేపారు.. బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ ప్రాంగణం నుంచి ఉమ్మడిగా సమర శంఖారావం పూరించారు.. మరి ఆ శబ్ధం ఢిల్లీలోని రాయిసీనా హిల్స్‌ ఆఫీసులో కొలువుదీరిన నరేంద్ర మోదీకి.. దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూర్చున్న అమిత్‌ షాకి ఎలా వినపడి ఉంటుంది?
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగానీ, శాశ్వత శత్రువులుగానీ ఉండరన్న నానుడి తెలిసిందే. అయితే కీలకమైన 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి శత్రువును ఎదుర్కోవడానికి మిత్రులుకాని వారంతా ఒక్కటికావడం.. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవంలో కనిపించిన విచిత్ర దృశ్యం. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరితో చేయికలిపారు. ఐక్యంగా ఉంటే శత్రువును ఓడించొచ్చని ఇప్పటికే గ్రహించిన మాయావతి-అఖిలేశ్‌లు పక్కపక్కనే నిల్చొని నవ్వులు చిందించారు. గంభీరవదనంతో శరద్‌ పవార్‌ వేదికకు నిండుదనం తెచ్చారు. ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్‌, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ, ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్‌లు అదనపు వెలుగులు చిందించారు. ఇక ఎన్నికలకో పార్టీతో జతకడుతూ రంగులు మార్చే చంద్రబాబు నాయుడు.. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీతో కరచాలనం చేసి ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత అంతమంది మనుషుల మధ్యలో, అతిదగ్గరగా నిలబడ్డ సోనియా గాంధీ.. మీడియా కెమెరాల వైపునకు సవాలు విసురుతున్నట్లు ఓ చూపు చూశారు..

భారత్‌లో గతంలోనూ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇన్ని విభిన్న పార్టీలు ఒకే వేదికపైకి రావడం, తద్వారా ఉమ్మడి శత్రువుకు హెచ్చరిక సంకేతాలు పంపడం మాత్రం ఇదే ప్రధమం. కాంగ్రెసేతర-బీజేపీయేతర కూటమి కావాలన్న కేసీఆర్‌, తమిళానాడులో ఆందోళనల కారణంగా స్టాలిన్‌, తెలియని కారణంతో నవీన్‌ పట్నాయక్‌లు ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top