అవినీతి..అక్రమాల్లో ‘రాజా’ ది గ్రేట్‌

Alapati Rajendra Prasad Became Fully Corrupted MLA In Tenali Constituency In Five Years - Sakshi

సాక్షి, తెనాలి : ఆంధ్రాప్యారిస్‌ తారల తళుకులతో, కళాకారుల కౌసల్యంలో వాసికెక్కిన పట్టణం.. ఐదేళ్లుగా ఆలపాటి అంతులేని అవినీతిలో మకిలీ అయ్యింది. అభివృద్ధి మాటున అడ్డగోలు దోపిడీకి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. కొల్లిపర మండలంలోని రీచ్‌లతో తవ్విన ఇసుక.. పేదలకు చేరకుండా అడ్డదారుల్లో   తరలింది. ఉచితమనే మాట అనుచితమై.. అది రాజావారి ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితైంది.

ఎమ్మెల్యే అండదండలతో టీడీపీ నేతలు సాగించిన కబ్జాకాండకు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇదేమని ప్రశ్నించిన గొంతులను అక్రమ కేసులు    నొక్కేశాయి. సహజ వనరులు ఎమ్మెల్యే ఆలపాటి రాజా అక్రమాల దెబ్బకు గుల్లయ్యాయి. కాసుల రూపంలో టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లాయి. నిలదీయాల్సిన అధికారులకు బెదిరింపులు, మామూళ్లు నజరానాగా మారి.. ఆలపాటి అంతులేని అవినీతికి ఎర్రతివాచీ పరిచాయి.  
                                        
అధికార అండతో అక్రమ నిర్మాణాలు
గుంటూరు నగరంలోని విద్యానగర్‌లో ఎన్నారై ఎడ్యుకేషనల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండియన్‌ స్ప్రింగ్స్‌ స్కూల్‌ ఆలపాటి రాజాకు చెందింది కావడంతో రోడ్డుపైకి అక్రమంగా రెండు షాపులను నిర్మించేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

నిరుపేదలు చిన్న రేకుల షెడ్డు నిర్మిస్తేనే పెద్ద తప్పు చేసినట్లు హడావుడి చేసి తొలగించే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు.. దీనిపై చెయ్యి వేసేందుకు కూడా సాహసించలేకపోయారు. నగరం నడిబొడ్డున అరండల్‌పేట 12వ లైను ఎదురుగా ఉన్న గ్రాండ్‌ నాగార్జున హోటల్‌ సెల్లార్‌లో బార్‌ను నడుపుతున్నప్పటికీ అధికారులు ఎవరూ అడ్డుచెప్పని పరిస్థితి. గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ పెరిగిపోయి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సెల్లార్‌లో పార్క్‌ చేయాల్సిన వాహనాలను రోడ్డుపైనే పెడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడానికి కారణం సదరు హోటల్‌ ఆలపాటి రాజాకు చెందింది కావడమే.    

పంట పొలాల దురాక్రమణ
తెనాలి రూరల్‌ మండలం కఠెవరంలో తినీతినకా ఆస్తులు కూడబెట్టిన ఒకరు పాతికేళ్ల క్రితం హత్యకు గురయ్యారు. అతడి ఏకైక కుమారుడు సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ కుటుంబానికి వారసులు ఎవరూ లేరు. కఠెవరం పరిధిలో 14 ఎకరాల పంట భూములపై హక్కుల కోసం కొందరు కోర్టును ఆశ్రయించారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ దృష్టి ఆ భూములపై పడింది. కోర్టులో వాజ్యం నడుపుతున్న వారికి తలా కొంత ముట్టజెప్పి, తన పార్టీకి చెందిన బినామీల పేరిట రిజిస్టర్‌ చేయించారు. వీరిలో విశాఖకు చెందిన బినామీ కూడా ఉన్నారు. ఆ విధంగా రూ.2 కోట్లలోపు ఖర్చుతో రూ.70 కోట్ల విలువైన పంట పొలాలను సొంతం చేసుకున్నారు.

నీరు–చెట్టు పథకం కింద తెనాలి రూరల్‌ మండలం మల్లెపాడులో 11 ఎకరాల చెరువు ఆక్రమణలకుపోగా ప్రస్తుతం ఏడెకరాల్లో ఉంది. రెండేళ్లకోసారి చేపల వేలం ద్వారా పంచాయతీకి రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల ఆదాయం సమకూరేది. వేలం లేకుండా ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కనుసన్నల్లో తెలుగుదేశం నేత, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ రావి రామ్మోహన్‌ నేతృత్వంలో ఇక్కడ మట్టి తవ్వకాలు సాగించారు. మూడు నాలుగు పొక్లెయిన్లతో మట్టిని తవ్వి అమ్ముకున్నారు. ఇలా మట్టి తవ్వకాల్లో అ«ధికార పార్టీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర కోటి రూపాయలకుపైగా గడించారు.

రెండేళ్లలో కొల్లిపర మండలం కొల్లిపర, పిడపర్రు, వల్లభాపురం, అన్నవరం, తూములూరు, దావులూరు, పిడపర్తిపాలెం, శిరిపురం, కుంచవరం, చక్రాయపాలెం, అత్తోట, అత్తోట యాదవపాలెం గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. కేవలం కొల్లిపర మండలంలోనే ఎమ్మెల్యే ఆయన బినామీలు రూ.2.50 కోట్లను ఆర్జించారు.  నీరు–చెట్టు పథకం పేరుతో చెరువుల తవ్వకాల్లో అధికార పార్టీ నేతల్లో కలహాల కుంపటి రగిలిన సందర్భాలు లేకపోలేదు.

తెనాలి మండలం కంచర్లపాలెంలో 5 ఎకరాల ఊరచెరువులో ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన అనుచరులు మట్టి తవ్వారు. 5600 ట్రక్కుల మట్టిని తీసి ఒక్కో ట్రక్కు రూ.600 చొప్పున అమ్మేశారు. పూడికతీతతో రూ.35 లక్షల ఆదాయం సమకూరగా, రూ.6 లక్షలతో చెరువు చుట్టూ కంచె వేయించారు. మిగిలిన సొమ్ము తమ జేబుల్లో వేసుకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నీరు–చెట్టు పథకం కింద ఎమ్మెల్యే కనుసన్నల్లో అక్రమంగా తవ్వుకున్న మట్టి విలువ రూ.6 కోట్లపైమాటే! 

అమాయకుల్ని బలి తీసుకున్న ఇసుక ట్రాక్టర్లు.. 
ఎడతెరిపిలేని ఇసుక ట్రాక్టర్ల పరుగులో పొలం నుంచి ఇంటికి వస్తున్న మున్నంగికి చెందిన వంగా శేషిరెడ్డిని ఓ ఇసుక ట్రాక్టరు బలి తీసుకుంది. గత ఏప్రిల్‌ 23న ఈ దుర్ఘటన జరగ్గా.. అంతకు రెండు నెలల ముందు ఇసుక ట్రాక్టరు ఢీకొనటంతో అదే గ్రామస్తురాలైన కనపాల విశ్రాంతమ్మ విగతజీవురాలైంది. దీనిపై గ్రామస్తులు తిరుగుబాటు చేసి వల్లభాపురం రేవులో ఉచిత ఇసుక తవ్వకాలను నిలుపుదల చేయించారు.

ఇదే రేవులో ఇసుక తవ్వకాలను ప్రశ్నించారనే ఆగ్రహంతో టీడీపీ నేతల అనుచరులు వల్లభాపురానికి చెందిన అవుతు చంద్రశేఖరరెడ్డిపై ఆయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో చంద్రశేఖర రెడ్డి బొటనవేలు తెగిపోయింది. ముందు హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు.. తెలుగుదేశం నేతల జోక్యంతో సాధారణ దాడి కేసుగా మార్చారు.

ఎగ్జిబిషన్‌లకు అనుమతులు..
సుప్రీం కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ సొసైటీ, కళాశాల యాజమాన్యం వివాదాస్పద స్థలాన్ని ఎగ్జిబిషన్‌ నిర్వహించుకోవడానికి అనుమతించింది. స్థలం తమ చేతిలో ఉందని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ చెప్పుకోవడానికి, ఆ మేరకు ఆధారాలు సంపాదించుకోవడానికి వీలుగా అధికార బలంతో ఎగ్జిబిషన్, శుభకార్యాల నిర్వహణకు స్థలాన్ని ఇస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ స్థలం విలువ ప్రస్తుతం రూ. 15 కోట్లకుపైనే పలుకుతోంది.  

భారీ ఇసుక దోపిడీ...
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్యే ఆలపాటి కనుసన్నల్లో కృష్ణానది భూముల్లో మేట పేరుతో అవినీతి వేట సాగింది. గోరంత భూమికి అనుమతులు తీసుకొని, కొండంత మేర ఆక్రమించటం, ఆ పరిధిలో ఇసుకను తవ్వేసుకొని రూ. కోట్ల రూపాయలను పిండుకోవడం ఈ నాలుగున్నరేళ్లలో పరిపాటిగా మారింది. కొల్లిపర మండం అన్నవరం పరిధిలో కేవలం 1.70 ఎకరాల్లో ఇసుక తవ్వుకునేందుకు అనుమతులు పొందారు.

కానీ 30 ఎకరాలకుపైగానే తవ్వేసి రూ. 20 కోట్లు ఎమ్మెల్యే దండుకున్నారన్నది బహిరంగ రహస్యం. పాత బొమ్మువానిపాలెం ఉచిత ఇసుక రేవు గుంటూరుకు చెందిన తెలుగుదేశం నేత నల్లమోతు శ్రీను కనుసన్నల్లో నడిచింది. అనుమతులకు మించి ఇక్కడ కూడా 21 ఎకరాల్లో ఇసుక తవ్వుకుని రూ. 10 కోట్లు సంపాదించారు. 2016లో డ్వాక్రా మహిళల పేరిట రూ.3 కోట్ల విలువైన ఇసుకను ఎమ్మెల్యే కనుసన్నల్లో ఆయన బినామీలు తవ్వి అమ్ముకున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద నాలుగున్నరేళ్లలో కృష్ణానదిలో ఇసుక తవ్వి ఎమ్మెల్యే రూ. 200 కోట్లు గడించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top