తీయని బంధం

a sweet relationship with moova chekkilu - Sakshi

మువా చెక్కీలతో నేస్తరికం

స్నేహానికి ప్రతీకగా నెయ్యి చెక్కీలు

నేస్తరికం.. పెళ్లి కన్నా ఘనమైన సంబరం. బారసాల కంటే అపురూపమైన వేడుక. పుట్టిన రోజు కంటే విలువైన కార్యక్రమం. ఓ స్నేహితుడిని వెతుక్కుని, శాస్త్రబద్ధంగా అతడు లేదా ఆమెతో నేస్తరికాన్ని కట్టుకోవడం, ఆ విషయాన్ని ఊరంతా చాటింపు వేయడం సిక్కోలు విశిష్ట సంప్రదాయానికి ప్రతీక. ఈ సంప్రదాయంలో మరింత ప్రత్యేకమైనవి నెయ్యి చెక్కీలు. ఆనందకరమైన సందర్భాన్ని మరింత ఆనందంగా చేస్తుందీ పదార్థం. ఉత్తరాంధ్రలో మరీ ముఖ్యంగా ఉద్దానంలో నెయ్యి చెక్కీ తిననిదే సంక్రాంతి పూర్తి కాదు. రండి ఇంకాస్త లోతుగా వెళ్దాం..            

నేస్తం.. నేస్తురాలు.. మిత్రాలు.. మిత్తన్న.. మొఖరా.. మనకు చాలా పరియమైన పదాలు. మర్చిపోతున్న పదాలు కూడా. సిక్కోలు విశిష్ట సంప్రదాయానికి ఈ పదాలే ప్రతీకలు. కులాలు, మతాలు, రక్త సంబంధాలతో పనిలేకుండా ఒకరికొకరు ఆప్యాయంగా పిలుచుకునే మానవ సంబంధాల వరసలు ఇవి. కులాలు వేరైనా, మతాలు వేరైనా ఒకే పోలికతో ఉంటే వారి మధ్య అన్నదమ్ముల అనుబంధాలకు ‘నేస్తం’ అనే సంబంధాన్ని కలుపుతారు. అప్పటి నుంచి వారి మధ్య ‘నేస్తరికం’ సాగుతుం. అదే విధంగా బావ, బావ మరదళ్లు వరుస అయితే అందుకు ‘మొఖరా’ అనే పదంతో పిలుస్తారు. వీరి అనుబంధాలు కలకాలం ఉడాలనే ఉద్దేశంతో ఏటా సంక్రాంతి మకర సంక్రమణం నుంచి నెయ్యిలతో తయారు చేసిన పేలాల చెక్కీలు ‘నెయ్యి చెక్కీలు’ ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ చెక్కీలనే మువా చెక్కీలు అని కూడా అంటారు.

ఎలా చేస్తారంటే..?
ధాన్యంను దోరగా వేయించి వచ్చిన నెయ్యిలు(మువాలు)ను వేరే బానలో పోసి వాటిలో పంచదార లేక బెల్లం పాకంగా మార్చి వివిధ ఆకృతుల్లో చెక్కీలను తయారు చేస్తారు. వాటిపై ఎండు కొబ్బరి(కురడీ) ముక్కలను పలుచగా కోసి అద్దుతారు. వాటిపైనే జీడిపప్పును సైతం క్రమంగా అమర్చి అందంగా తయారు చేస్తారు. స్థానికంకా ఈ చెక్కీలు తయారు చేస్తున్నప్పటికీ ఆంధ్రా సరిహద్దులో ఇచ్ఛాపురం ఉండటంతో నిత్యం వందల సంఖ్యలో బరంపురం నుంచి ఈ చెక్కీలు దిగుమతి అవుతుంటాయి. ధరలు సైతం సైజును బట్టి రూ.20 నుండి 200 రూపాయల వరకు ధర పలుకుతాయి. ఇక్కడ నుండే శ్రీకాకుళం, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కోల్‌కత్తా వంటి ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయి.

బరంపురం చెక్కీలకే గిరాకీ
సంక్రాంతి వచ్చిందంటే చాలు మువా చెక్కీలకు గిరాకీ ఎక్కువగా ఉంటోంది. లోకల్‌గా తయారు చేసిన చెక్కీల కంటే బరంపురం చెక్కీలకే ఎక్కువ గిరాకీ ఉంటోంది. ఇవి చాలా ధృడంగానూ, రుచికరంగానూ ఉంటాయి. ఒక్కో చెక్కీ రెండు నెలలు వరకు చెక్కుచెదర కుండా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వ్యాపారం కూడా బాగుంటుంది.
– సిఆర్‌.గౌడ, చెక్కీల అమ్మకందారుడు, ఇచ్ఛాపురం
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top