తాజ్‌మహల్‌ పైనా గోప్యతేనా? | Sakshi
Sakshi News home page

తాజ్‌మహల్‌ పైనా గోప్యతేనా?

Published Fri, Jun 16 2017 12:32 AM

తాజ్‌మహల్‌ పైనా గోప్యతేనా?

తాజ్‌మహల్‌ని రక్షించే బాధ్యత, చట్టాన్ని అమలుచేసే బాధ్యత ఉన్న ఏఎస్‌ఐ.. దాని చుట్టూ అక్రమ నిర్మాణాల వివరాలు చెప్పకపోవడం.. ఎంత సమయం ఇచ్చినా వివ రాలు సేకరించి, ప్రచురించకపోవటం, ఆదేశాలను పాటించకపోవటం అన్యాయం.

ప్రపంచ వారసత్వ భవనం అని యునెస్కో గుర్తించిన అద్భుత కట్టడం తాజ్‌మహల్‌ను మనం రక్షించుకుంటు న్నామా?  రోజూ 30 లక్షలమంది దర్శించి కోట్ల రూపాయల పర్యాటక ఆదాయాన్ని తెచ్చే తాజ్‌ చుట్టూ అక్రమ నిర్మాణాలు కాలుష్యాల గురించి అడిగే వారే లేరా? తాజ్‌ అందాన్ని దెబ్బతీసే అంశాలను గురించి సుప్రీంకోర్టు, జాతీయ పర్యావరణ న్యాయస్థానం ఎన్నో కేసులు విచారించి కఠినమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ అద్భుత కట్టడానికి 2.4 కిలోమీటర్ల పరిధిలో చెట్లు కొట్టివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, తాజ్‌ ప్రహరీ నుంచి 100 మీటర్ల లోపున వాణిజ్య, నివాస నిర్మాణాలు చేపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర కాలుష్యనియంత్రణ మండలిని, భారత పురావస్తు శాఖను కట్టడిచేస్తూ తీర్పులు వెలువరించారు. ఇక్కడ నాసిరకం నిర్మాణాలను అనుమతిస్తే తాజ్‌ అందానికి హాని కలుగుతుందని సుప్రీం కోర్టు ఎంసీ మెహతా కేసులో హెచ్చరించింది. తాజ్‌ చుట్టూ నో ట్రాఫిక్‌ జోన్‌ ప్రతిపాదన అమలుపై ప్రశ్నిం చింది. ఇష్టంవచ్చినట్టు కట్టడాలను అనుమతిస్తే తాజ్‌ కళాత్మకతకు భంగం వాటిల్లుతుందని వివరించింది.

ఆ కాలంలో ఉలి, సుత్తి తప్ప ఏ పరికరాలు లేకపోయినా అద్భుత సౌందర్య కళామందిరాన్ని నిర్మించారని, ఇప్పుడు అన్ని రకాల పరికరాలు యంత్రాలు సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఆ నాటి అందానికి సరితూగే నిర్మాణాలను దాని చుట్టూ చేయలేకపోతున్నామని సుప్రీంకోర్టు విమర్శించింది. పురావస్తు చట్టం 2010 ప్రకారం రక్షిత కట్టడాలలో నిర్దేశిత ప్రాంతంలో నిర్మాణాలను నిషేధించారు. 200 మీటర్ల ప్రాంతంలో కట్టడాలపైన నిషేధం లేదు కానీ కొన్ని పరిమితులు విధించారు. రెగ్యులేటెడ్‌ ఏరియా అని కొంత ప్రాంతాన్ని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీచేసింది. పురావస్తు శాఖ అధికారి తప్ప మరొకరెవరూ ఇక్కడ నిర్మాణాలు చేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా భూమి యజమాని అయినా సరే నిర్మాణాలు సాగిస్తే 3 నెలల వరకు జైలు శిక్ష 5 వేల రూపాయల వరకు జరి మానా విధించవచ్చని ఆర్కియాలాజికల్‌ సైట్స్‌ అండ్‌ రిమెయిన్స్‌ యాక్ట్‌ వివరిస్తున్నది.

ఒక ఆర్టీఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆగ్రాసర్కిల్‌ లో 533 అక్రమ నిర్మాణాలు జరిగాయని, వాటిలో 46 తాజ్‌ గంజ్‌ ప్రాంతాల్లో ఉన్నాయని ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వివరించింది. ఏఎస్‌ఐ శాఖ వారు అక్రమ నిర్మాణాల సంఖ్య గురించి చెప్పారేగానీ వాటిపైన తీసుకున్న చర్యల గురించి వివరించనే లేదని, అసలు అక్రమ నిర్మాణాలు తొలగించారో లేదో కూడా చెప్పలేదని జమాతె ఇస్లామీ హింద్‌ సహాయ కార్యదర్శి ఇంతిజార్‌ నిజాం విమర్శించారు. అక్రమనిర్మాణాలను అనుమతించిన ఆఫీసర్లపైన, తెలిసి కూడా ఏమీ చేయని ఆఫీసర్ల మీద ఏ చర్యతీసుకున్నారని కూడా అడిగారు.  

తాజ్‌ చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఉన్న నిర్మాణాలు, నివాస సముదాయాలు (కాలనీలు), వాణిజ్య సముదాయాలు ఏమిటో తెలుసుకోవాలంటే 500 మీటర్ల పరిధి ఎక్కడెక్కడ ఉందో తెలియజెప్పాలని ఒక నాగరికుడు ఆర్టీఐ కింద దరఖాస్తులో కోరాడు. తాజ్‌ దక్షిణ దిశలో తూర్పువైపున 500 మీటర్ల లోపున ఏ నిర్మాణాలు, ఏ కాలనీలు, ఏ రోడ్లు, ఏ ప్రాంతాలు వస్తాయో తెలపాలని కోరారు. ఈ వివరాలు తెలిస్తేనే పౌరులు కూడా చట్టాన్ని అనుసరించి నిర్మాణాల విషయంలో జాగ్రత్త పడడానికి వీలుంటుంది. ఆర్కియాలజీ శాఖ వారు ఈ వివరాలు తమవద్దలేవని జవాబిచ్చారు. మరి అక్రమ నిర్మాణాలను ఏ విధంగా గుర్తిస్తారు?

సీఐసీ ఆదేశాలను కూడా నిరాదరించి సమాచారం ఇవ్వనందుకు కమిషన్‌ అధికారులకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. దానికి కూడా సమాధానం లేదు. ఆగ్రా డెవలప్‌మెంట్‌ అథారిటీ వారిని అడగాలని ఏఎస్‌ఐ వారు సూచించారు. చట్టం అమలు చేయడానికి, సుప్రీం కోర్టు ఎన్‌జీటీ ఆదేశాలు పాటించడానికి, అక్రమ  నిర్మాణాలు ఆపడానికి, నిర్మాణాలకు అనుమతి తీసుకోవడానికి కూడా ఈ వివరాలు అవసరం. అధికారులు కూడా ఈ వివరాలు ఇచ్చిన తరువాతనే అక్రమంగా నిర్మిస్తుంటే ప్రశ్నించడానికి వీలుంటుంది. ఈ వివరాలను అందరికీ అందుబాటులోకి తేలేకపోతే అవినీతికి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని దరఖాస్తుదారు వాదిం చారు. ఆగ్రా అథారిటీ దగ్గర ఉన్నాయంటే సరిపోదు, ఏఎస్‌ఐ దగ్గర కూడా ఈ సమాచారం ఉండాల్సిందే.

తాజ్‌ని రక్షించే బాధ్యత, చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న ఏఎస్‌ఐ ఈ వివరాలు లేవనడం, ఎంత సమయం ఇచ్చినా వివరాలు సేకరించి ప్రచురించకపోవడం, ఆదేశాలను కూడా పాటించకపోవడం చాలా అన్యాయం. మొత్తం కాలనీలు, రోడ్లు, వాణిజ్య సముదాయాలు, తదితర వివరాలను తమంత తామే సెక్షన్‌ 4(1)(బి) కింద వివరించవలసిన బాధ్యత ఉన్న ప్రభు త్వ శాఖ ఆ బాధ్యతను విస్మరించినందుకు 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఇద్దరు సమాచార అధికారులపైన కమిషన్‌ శిక్ష విధించింది. ఆగ్రా అభివృద్ధి అథారిటీతో సమన్వయం చేసి వివరాలు సేకరించి, తన బాధ్యతలను  సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడాలని కమిషన్‌ ఆదేశించింది. తాజ్‌మహల్‌ చుట్టూ కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకున్న చర్యలను కూడా వివరించాలని ఉత్తరప్రదేశ్‌ కాలుష్యమండలికి కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. (భీంసింగ్‌ సాగర్‌ వర్సెస్‌ సూపరింటెండెంట్‌ ఏఎస్‌ఐ కేసులో మే 30, 2017న సీఐసీ ఇచ్చిన ఆదేశం ఆధారంగా).

              - వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌

               మాడభూషి శ్రీధర్‌
              professorsridhar@gmail.com

              

 

 

Advertisement
Advertisement