ఆదాయం లేని సీమాంధ్రలో జీతాలూ కష్టమే! | Seemandhra region may face income problem after bifurcation: Ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఆదాయం లేని సీమాంధ్రలో జీతాలూ కష్టమే!

Feb 25 2014 2:06 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతం తీవ్ర ఆదాయలోటును ఎదుర్కోనుందని రాష్ట్రపతికి వైస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖలో వివరించారు.

రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతం తీవ్ర ఆదాయలోటును ఎదుర్కోనుందని రాష్ట్రపతికి వైస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖలో వివరించారు. 2012-13 ఆదాయ వివరాలను ఆయన ఆ లేఖతో పాటు పొందుపర్చారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే సీమాంధ్ర ప్రాంతం ఉద్యోగుల జీతభత్యాలకూ కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణానికిగానీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికిగానీ తీవ్రంగా నిధుల కొరత ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని తెలిపారు.
 
 అనేక ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థలు, వాటి అనుబంధ పరిశ్రమలూ హైదరాబాద్ చుట్టూ ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. దీంతో సీమాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక, ఐటీ రంగం పూర్తిగా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మొత్తం ఐటీ టర్నోవరులో హైదరాబాద్ నుంచే 99.9 శాతం వస్తోందని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రజలందరూ ఉద్యోగాలు, ఉపాధి కోసం హైదరాబాద్‌వైపే చూడాల్సి వచ్చిందని తెలిపారు. కేవలం రాష్ట్ర రాజకీయ రాజధానిగానే కాకుండా ‘సూపర్ ఎకానమిక్, ఎంప్లాయ్‌మెంట్ పవర్ హౌస్’గా హైదరాబాద్ అవతరించిందని పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే... ఈ ఆదాయాన్ని సీమాంధ్ర ప్రాంతం కోల్పోవాల్సి రానుందని వివరించారు.
 
 లేఖలో పేర్కొన్న కొన్ని ఆదాయ వివరాలు...
  -   2012-13 ఆర్థిక సంవత్సరాన్ని గమనిస్తే... రాష్ట్రం సొంత ఆదాయం రూ. 75,436 కోట్లుగా (68.6 శాతం) ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఆదాయం రూ. 34,064 కోట్లు (31.2 శాతం). మొత్తం ఆదాయం రూ. 1,09,500 కోట్లు.
-     రాష్ట్ర సొంత ఆదాయంలో వ్యాట్ ఆదాయం రూ. 42,060 కోట్లు (56 శాతం) ఉండగా, ఇతరాలు రూ. 26,351 కోట్లు (35 శాతం)గా ఉంది. వడ్డీ ద్వారా రూ. 7,025 కోట్లు (19 శాతం) వస్తోంది.
 -    కేంద్ర ఆదాయం కింద కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ. 20,270 కోట్లు వస్తుండగా, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ. 13,794 కోట్లు వస్తోంది.
 -    ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ చెప్పిన విషయాన్ని గమనించాలి. ‘2008-09 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం అమ్మకపు పన్ను 22 వేల కోట్లుగా ఉంది. ఇందులో కేవలం హైదరాబాద్ నుంచే 75 శాతం వస్తోంది. హైదరాబాద్‌ను మినహాయిస్తే కోస్తాంధ్రలో కేవలం 15 శాతం మాత్రమే అమ్మకపు పన్ను ఆదాయం ఉంది’ అని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement